ఫిజిక‌ల్‌ పాల‌సీల‌ను ఈ-ఇన్సురెన్స్‌కు మార్చుకోవ‌డం ఎలా?

క్యామ్స్‌ CAMSRep eIA ఈ స‌దుపాయాన్ని పూర్తి ఉచితంగా అందిస్తుంది.

Published : 25 Dec 2020 17:50 IST

ఈ-ఇన్సురెన్స్ ఖాతా ద్వారా వినియోగ‌దారులు అన్ని ఇన్సురెన్స్ పాల‌సీల‌ను ఒకే ప్ర‌దేశం నుంచి నిర్వ‌హించుకోవ‌చ్చు. ఇది పూర్తిగా పేప‌ర్ ర‌హితం, పూర్తి ర‌క్ష‌ణ ఉంటుంది. కొత్త‌గా పాల‌సీలు తీసుకునే వారు మాత్ర‌మే కాకుండా గ‌తంలో ఫిజిక‌ల్ పాల‌సీలు తీసుకున్న వారు కూడా త‌మ పాల‌సీల‌ను డిజిట‌ల్ రూపంలోకి మార్చుకోవ‌చ్చు. ఇందుకు ఈ- ఇన్సురెన్స్ ఖాతా మీకు సహాయ‌ప‌డుతుంది. ఈ-ఇన్సురెన్స్ స‌దుపాయాన్ని చాలా కంపెనీలు అందిస్తున్నాయి. అందులో క్యామ్స్‌ ఒక‌టి. క్యామ్స్‌ CAMSRep eIA ఈ స‌దుపాయాన్ని పూర్తి ఉచితంగా అందిస్తుంది.

ఈ- ఇన్సురెన్స్ ఖాతా అంటే ఏంటి?
మీ వ‌ద్ద ఉన్న పాల‌సీల‌కు సంబంధించిన‌ అన్ని ఇన్సురెన్స్ ప‌త్రాల‌ను ఈ- డాక్యుమెంట్లుగా(ఎల‌క్ట్రిక్ మోడ్‌) రూపాంత‌రం చేసి ఆన్‌లైన్లో ఉంచుతారు. ఈ-ఇన్సురెన్స్ ఖాతా కోసం ముందుగా మొబైల్ నెంబ‌ర్ లేదా ఈమెయిల్ ద్వారా రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేష‌న్ పూర్తైన అనంత‌రం ఖాతాదారునికి ఎస్ఎమ్ఎస్ ద్వారా గానీ ఈ మెయిల్ ద్వారా గానీ 13 అంకెల అక్కౌంటు నెంబ‌రును పంపిస్తారు. ఈ నెంబ‌రును ఉప‌యోగించి లాగ్ఇన్ అయ్యి పాల‌సీల‌ను నిర్వ‌హించుకోవ‌చ్చు. ఈ ఖాతాను ఎక్క‌డ నుంచైనా, ఎప్పుడైనా యాక్సిస్ చేసుకోవ‌చ్చు. ఈ స‌దుపాయాన్ని జీవిత‌, ఆరోగ్య‌, జ‌న‌ర‌ల్ ఇన్సురెన్స్ వంటి అన్ని బీమా పాల‌సీల‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు. దీని కోసం ఏకీకృత ఖాతా సంఖ్య‌ను కేటాయిస్తారు. ఒక‌సారి మీరు ఖాతా తెరిచిన త‌రువాత మీ వివ‌రాల‌తో యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. ఎల‌క్రానిక్ మోడ్‌లో పాల‌సీ వివ‌రాల‌ను భ‌ద్ర‌ప‌ర‌చుకోవ‌డంతో పాటు ప్రీమియం చెల్లింపులు, వివిధ పాల‌సీల‌లో వ్య‌క్తిగ‌త వివ‌రాలు అప్‌డేట్‌ చేయడం, ఆధార్ లింక్ చేయ‌డం వంటి అన్ని కార్యాక‌లాపాల‌ను నిర్వ‌హించ‌వ‌చ్చు.

ఈ-ఇన్సురెన్స్ ఖాతా ముఖ్య వివ‌రాలు:
1.ఒక్క సారి సైన్ ఇన్ అయ్యి, అన్ని బీమా స‌ర్వీసుల‌తో పాటు పాల‌సీల‌కు సంబంధించిన పూర్తి స‌మాచారాన్ని ఈ ఖాతా ద్వారా ఎప్పుడైనా, ఎక్క‌డైనా పొంద‌వ‌చ్చు.
2.జీవిత‌, ఆరోగ్య‌, వాహ‌న మొద‌లైన‌ అన్ని బీమా పాల‌సీల‌ను ఒకే చోట నుంచి నిర్వ‌హించుకోవ‌చ్చు. దీనితో పాల‌సీల‌ను స‌మీక్షించుకోవ‌డం సుల‌భ‌మ‌వుతుంది.
3.పాల‌సీ అందించిన సంస్థ‌కు ప్ర‌తీసారి వెళ్ళ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. ప్ర‌తీ ప‌ని ఆన్‌లైన్ ద్వారా చేసుకోవ‌చ్చు.
4.పాల‌సీలోని పేరు, చిరునామా, మొబైల్ నెంబ‌రు వంటి వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను, నామినీ వివ‌రాల‌ను ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేసుకోవ‌చ్చు.
5.అన్ని బీమా పాల‌సీల‌కు సంబంధించిన ప్రీమియంల‌ను ఈ ఖాతా ద్వారా చెల్లించంతో పాటు, వార్షిక స్టేట్‌మెంట్‌ను ఏకీకృత ప‌ద్ధ‌తిలో పొంద‌వ‌చ్చు.
6.ఖాతాకు అధికారిక ప్ర‌తినిధిని నియ‌మించ‌వ‌చ్చు. మీ నామినిని గానీ, వేరొక వ్య‌క్తిని గానీ అధికార‌ ప్ర‌తినిధిగా నియ‌మించ‌వ‌చ్చు. ఒక‌వేళ ఖాతాదారుడు మ‌ర‌ణిస్తే, వారి అధికార ప్ర‌తినిధి ఖాతాను యాక్సెస్ చేసే వీలుంటుంది.
7.ఈ మొత్తం స‌దుపాయం ఉచితంగా ల‌భిస్తుంది. ఫిజిక‌ల్ పాల‌సీని ఈ-కాపీగా మార్చేందుకు రుసుములు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.
8.ఈ మొత్తం విధానం పూర్తిగా కాగిత ర‌హితంగానూ, సుర‌క్షితంగానూ ఉంటుంది.
9.ఈ సౌక‌ర్యం దేశంలో నివ‌సించేవారితో పాటుగా, ఎన్ఆర్ఐల‌కు కూడా అందుబాటులో ఉంది.
10.ఈ-ఇన్సురెన్స్ స‌దుపాయాన్ని అందించేందుకు సంస్థ‌ల‌కు నియంత్ర‌ణ, అనుమ‌తి ఐఆర్‌డీఏ ఇస్తుంది.

సీఏఎమ్ఎస్‌లో ఈ-ఇన్సురెన్స్ ఖాతాను తెర‌వ‌డం ఎలా?
ఐఆర్‌డీఏ ప‌లు బీమా రిపోజీట‌రీల‌ను ఇందుకు అనుమితినిచ్చింది. మీరు ఏ రిపోజిటీరీ వ‌ద్ద‌నైనా ఈ-ఇన్సురెన్స్ ఖాతాను తెరువ‌వ‌చ్చు. ఈ-ఇన్సురెన్స్ స‌దుప‌యాల‌ను అందిస్తున్న రిపాజిట‌రీల‌లో క్యామ్స్‌ కూడా ఒక‌టి.

క్యామ్స్‌లో ఈ-ఇన్సెరెన్స్ ఖాత‌ను తెరిచే విధానం:

  • క్యామ్స్ రిపాజిట‌రీ వెబ్‌సైట్‌కి లాగ్ అయ్యి “ అప్లైయ్ ఫ‌ర్ ఈ-ఇన్సురెన్స్ అక్కౌంట్ ” లేదా “రిజిస్ట‌ర్ నౌ ” ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.

  • పాన్ లేదా ఆధార్ నెంబ‌రుతో రిజ‌స్ట‌ర్ చేసుకోవ‌చ్చు. పాన్ లేదా ఆధార్‌, మీ మొబైల్‌ నెంబ‌ర్, కింద ఇచ్చిన క్యాప్‌చా కోడ్‌ను ఎంట‌ర్ చేస్తే, మ‌రొక పేజీ తెరుచుకుంటుంది. ఇందులో పాన్ నెంబ‌రు, పేరు, పుట్టిన తేదీ, చిరునామా, సంప్ర‌దించ‌వ‌ల‌సిన ఫోన్‌ నెంబ‌ర్ మొద‌లైన వివ‌రాల‌ను ఇవ్వాలి. పాన్ కార్డు, అడ్ర‌స్ ఫ్రూవ్ ప‌త్రాల‌ను అప్‌లోడ్ చేయాలి.

  • పాల‌సీ వివ‌రాల ఆప్ష‌న్‌లో ప‌లు బీమా కంపెనీల‌ను ఎంచుకోవ‌చ్చు. బీమా సంస్థ ఎంపిక పూర్తైన త‌రువాత పాల‌సీ నెంబ‌రును తెలియ‌జేయాలి. కింద ఉన్న క్యాప్‌చాను ఎంట‌ర్‌చేసి స‌బ్మిట్ బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి.

  • స‌బ్మిట్‌ను క్లిక్ చేసిన వెంట‌నే ఒక పాప్అప్ మేసేజ్ ద‌ర‌ఖాస్తు(అప్లికేష‌న్) నెంబ‌రుతో పాటు వ‌స్తుంది. ద‌ర‌ఖాస్తు ఫార‌మ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ ఫోటో అతికించి, సంత‌కం చేసి, ఫార‌మ్‌ను క్యామ్స్ కార్యాల‌యానికి పంపించాలి.

  • ఖాతా తెరిచేందుకు ఒక బిసినెస్‌డే ప‌డుతుంది.

  • ఒక‌సారి ఖాతా తెరిచిన తరువాత ఎస్ఎమ్ఎస్‌, ఈమెయిల్ ద్వారా 13 అంకెల eIA నెంబ‌రును పంపిస్తారు.

క్యామ్స్‌లో పాల‌సీల‌ను ఈ-పాల‌సీలుగా మార్చుకోవ‌డం ఎలా?
పాల‌సీల‌ను, ఈ-పాల‌సీలుగా మార్చుకోవ‌డం చాలా సుల‌భం. ఇందుకు క‌న్వ‌ర్ష‌న్ ఫార‌మ్‌ను నింపాలి. ఈ ఫార‌మ్ రిపోసిట‌రీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఫార‌మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని eIA నెంబ‌ర్, పాల‌సీ నెంబ‌ర్లు, మొద‌లైన స‌మాచారాన్ని ఇవ్వాలి.

బీమా సంస్థ ఆధారంగా అవ‌స‌ర‌మైతే పాల‌సీ ప‌త్రాల‌ను కూడా ఇవ్వాలి. పాల‌సీ క‌వ్వ‌ర్ష‌న్ రిక్వ‌స్ట్ అందుకున్న త‌రువాత బీమా సంస్థ‌లు, పాల‌సీని, పాల‌సీదారుని ఈ-ఇన్సురెన్స్ ఖాతాకు క్రెడిట్ చేస్తాయి.

ఒక‌సారి పాల‌సీ క‌న్వ‌ర్ష‌న్ అయితే eIA కింద ఆన్‌లైన్లో పాల‌సీని చూసుకోవ‌చ్చు.

గుర్తించుకోవ‌ల‌సిన ముఖ్య‌మైన అంశాలు

  1. ఒక‌సారి పాల‌సీ ఈ-ఇన్సురెన్స్ పాల‌సీగా మారిన త‌రువాత ఫిజిక‌ల్ పాల‌సీ ప‌త్రాలు చెల్ల‌వు.

  2. ఈ-ఇన్సురెన్స్ ఖాతాను తెరిచేందుకు గానీ, పాల‌సీ ప‌త్రాల‌ను మార్చుకునేందుకు ఎటువంటి రుసుములు ఉండ‌వు.

  3. మీ పూర్తి వివ‌రాల‌ను ఆన్‌లైన్లో పెట్టే ముందు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

  4. క్యామ్స్‌తో పాటు రిపాజిట‌రీ సేవ‌లు అందించే కంపెనీలు చాలా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని