కరోనా ముందు స్థాయికి వ్యాపారం పుంజుకుంది

గతేడాది కరోనా సంక్షోభం ప్రారంభమయ్యాక తొలిసారిగా వ్యాపార కార్యకలాపాలు కరోనా ముందు స్థాయులకు చేరాయి. వరుసగా రెండో వారమూ కార్యకలాపాల్లో వృద్ధి ....

Updated : 17 Aug 2021 06:11 IST

సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ బయటపడలేదు: నొమురా

ముంబయి: గతేడాది కరోనా సంక్షోభం ప్రారంభమయ్యాక తొలిసారిగా వ్యాపార కార్యకలాపాలు కరోనా ముందు స్థాయులకు చేరాయి. వరుసగా రెండో వారమూ కార్యకలాపాల్లో వృద్ధి కనిపించిందని జపాన్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ నొమురా పేర్కొంది. కరోనా ముందు స్థాయిని ప్రాతిపదికగా చేసుకుని వారంవారీ కార్యకలాపాలను తన ‘నొమురా ఇండియా బిజినెస్‌ రిసమ్షన్‌ ఇండెక్స్‌(ఎన్‌ఐబీఆర్‌ఐ) ద్వారా పరిశీలిస్తోంది. ఆగస్టు 15తో ముగిసిన వారంలో ఈ సూచీ 101.2కు చేరింది. అంతక్రితం వారం 99.6గా ఉంది. 2020 ఏప్రిల్‌లో లాక్‌డౌన్‌ విధించాక ఈ సూచీ స్థాయి భారీగా పడిపోయినా, క్రమంగా పుంజుకుంటూ వచ్చింది. ఇపుడు తొలిసారిగా కరోనా ముందు స్థాయిని అధిగమించింది. తొలి దశ అనంతరం కరోనా ముందు స్థాయికి వ్యాపార కార్యకలాపాలు చేరడానికి 10 నెలల సమయం పట్టగా.. కరోనా రెండో దశ తర్వాత కేవలం 3 నెలల్లోనే సూచీ 100 మార్కును చేరుకోవడం గమనార్హం. జులై-ఆగస్టులో ఎన్‌ఐబీఆర్‌ఐ ధోరణిని బట్టి మూడో త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు)లో రికవరీ బలంగా ఉంటుందని నొమురా పేర్కొంది. అయితే ఆర్థిక వ్యవస్థ కరోనా సంక్షోభం నుంచి ఇంకా బయటపడలేదని గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తోంది.

ఈ ఏడాది 10.4 శాతం వృద్ధి

జూన్‌ త్రైమాసిక జీడీపీ వృద్ధి అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 4.3 శాతం తగ్గినా.. 2020-21 ఇదే త్రైమాసికంతో పోలిస్తే 29.4 శాతం వృద్ధి చెందింది. 2021-22 మొత్తంమీద జీడీపీ 10.4 శాతం మేర వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. గతేడాది 7.3 శాతం క్షీణించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు