Updated : 20 Apr 2021 09:46 IST

వాహన అమ్మకాలకు కొవిడ్‌ గండం

బైక్‌లపై మరింత అధిక ప్రభావం

దిల్లీ: దేశ వ్యాప్తంగా కొవిడ్‌-19 కేసులు రోజుకు 3 లక్షలకు సమీపిస్తుండటం.. మహమ్మారి వ్యాప్తి నిరోధానికి దిల్లీ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌-కర్ఫ్యూ ఆంక్షలు విధిస్తున్నందున వాహన విక్రయాలపై తీవ్ర ప్రభావం పడుతుందని తయారీ సంస్థలైన మారుతీ సుజుకీ ఇండియా (ఎమ్‌ఎస్‌ఐ), టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌, హోండా కార్స్‌ ఆందోళన వెలిబుచ్చాయి. ఆర్థిక వృద్ధి, వినియోగదారు సెంటిమెంట్‌తో వాహన విక్రయాలకు దగ్గరి సంబంధం ఉంటుందని మారుతీ వివరించింది. ప్రస్తుత పరిస్థితులు కచ్చితంగా వినియోగదారు సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎమ్‌ఎస్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌) శశాంక్‌ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. ‘లాక్‌డౌన్‌లతో  కార్లను డెలివరీలు చేయడం కుదరదని పేర్కొన్నారు. స్థానిక ఆంక్షలు ఆర్డర్లను, డెలివరీలను ప్రభావితం చేస్తున్నాయని టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నవీన్‌ సోనీ వెల్లడించారు. వారాంతపు లాక్‌డౌన్‌లు, రాత్రి కర్ఫ్యూలతో విక్రయ కేంద్రాలు మూసి ఉండటం వల్ల అమ్మకాలు తగ్గుతాయని హోండా కార్స్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్‌ (మార్కెటింగ్‌, సేల్స్‌) రాజేశ్‌ గోయల్‌ తెలిపారు.

ఇప్పటికే 30-50 శాతం తగ్గాయ్‌

కొవిడ్‌-19 రెండో దశ విజృంభణతో ద్విచక్ర వాహన విపణి తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఈ నెలలో గుడిపడ్వా, నవరాత్రి, ఉగాది పండుగలు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు విక్రయాలు 30-50 శాతం మేర క్షీణించాయని బ్రోకరేజీ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ నివేదిక వెల్లడించింది. కొవిడ్‌ మొదటి దశతో పోలిస్తే రెండో దశలో చిన్న నగరాలు కూడా ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయని, గత ఏడాది సెప్టెంబరులో నమోదైన పాజిటివ్‌ కేసుల గరిష్ఠ స్థాయికి రెట్టింపు నమోదు కావడం ఇందుకు తార్కాణమని నివేదిక పేర్కొంది. గుడి పడ్వాకు ఆశించిన విక్రయాల్లో 50 శాతమే జరిగాయని మహారాష్ట్ర డీలర్లు వెల్లడించారని, ఉత్తర్‌ప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రిటైల్‌ విక్రయాలపై ప్రభావం పడిందని తెలిపింది.
టోకు విక్రయాలు 2020-21లో 12 శాతం మేర క్షీణించాయి. రిటైల్‌ రిజిస్ట్రేషన్లు మాత్రం 32 శాతం తగ్గాయి. అంటే 20 శాతం వాహనాలు టోకు విక్రయదార్ల వద్ద నిలిచిపోయాయి.
2020 ఏప్రిల్‌ నుంచి వాహన సంస్థలు క్రమంగా ధరలు పెంచుతూ ఉండటం కూడా విక్రయాల తగ్గుదలకు కారణమని నివేదిక పేర్కొంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని