కొవిడ్ నేర్పిన ఆరోగ్య, ఆర్థిక పాఠాలు

తమ కుటుంబ స‌భ్యుల ఆరోగ్యం, భ‌ద్ర‌త కోసం త‌గినంత‌ బీమా చేయాల్సిన‌ అవస‌రం ఉంద‌ని గుర్తించారు.

Updated : 18 Nov 2021 15:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్ సెకండ్ వేవ్ భార‌త్‌ను అత‌లాకుతలం చేసిన సంగతి తెలిసిందే. 4 ల‌క్ష‌ల పైచిలుకు కొవిడ్ పాజిటివ్ కేసులు ప్ర‌తిరోజూ బ‌య‌ట‌ప‌డేవి. ఈ మ‌హ‌మ్మారి భార‌తీయ ఆరోగ్య బీమా రంగంపై తీవ్ర ప్ర‌భావం చూపింది. దీంతో ఇన్సూరెన్స్ ప్రొవైడ‌ర్లు, అలాగే ఆరోగ్య బీమాను కోరుకునే వ్య‌క్తులు, కార్పొరేట్‌లు నూత‌న పోక‌డ‌లు అనుస‌రించాల్సి వచ్చింది. వైద్య అత్య‌వ‌స‌రాల్లో ఆర్థికంగా బ‌లోపేతం అయ్యేందుకు ఆరోగ్య బీమా ఎంత ముఖ్య‌మో, ఎంత ప్రాధాన్యముందో ప్రజలు గ్రహించారు. తమ కుటుంబ స‌భ్యుల ఆరోగ్యం, భ‌ద్ర‌త కోసం త‌గినంత‌ బీమా చేయాల్సిన‌ అవస‌రం ఉంద‌ని గుర్తించారు.

అవ‌గాహ‌న పెరిగింది: కొవిడ్ వ‌ల్ల ప్ర‌జ‌లు ఊహించ‌ని వైద్య ఖ‌ర్చుల‌ను ఎదుర్కొనేందుకు గానూ.. వారి ఆర్థిక సంసిద్ధతను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి వచ్చింది. ఆసుప‌త్రిలో చేరితే అయ్యే అధిక ఖ‌ర్చులు, స‌రైన ఆరోగ్య బీమా ఉండాల‌నే వాద‌న‌కు బ‌లం చేకూర్చింది. ఆసుప‌త్రిలో చేరితే అయ్యే ఖ‌ర్చులకు ముఖ్యంగా కార్పొరేట్‌ ఆసుప‌త్రుల బిల్లుల చెల్లింపులకు ఇంటి పొదుపును ఖ‌ర్చుచేయ‌డంతో పాటు అప్పు చేయాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తాయి. ఇందుకోసం సాధార‌ణ సంప్రదాయ పద్ధతుల పొదుపుపై ఆధారపడలేమని ప్రజలు గ్రహించారు. వ్యక్తులు వ్యక్తిగత పాలసీల కోసం.. కుటుంబాలు ఫ్యామిలీ ప్లోట‌ర్ పాల‌సీల కోసం.. సంస్థ ఉద్యోగులు, య‌జ‌మానులు బృంద బీమా అవ‌స‌రాన్ని తెలుసుకున్నారు.

క‌వ‌రేజ్ పెంపు..: ఆరోగ్య బీమా ముందుగానే తీసుకున్న వారు.. ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌కు వేల రూపాయ‌లు స‌రిపోతాయి కాబట్టి త‌మ వ‌ద్ద ఉన్న పాల‌సీ అన్ని విధాలా స‌రిపోతుంద‌ని భావించేవారు. అయితే కొవిడ్‌ వారి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసింది. కొవిడ్‌-19 ప్ర‌భావిత‌ రోగులు ఆసుప‌త్రిలో చేరితే అయ్యే ఖ‌ర్చులు ముఖ్యంగా ‘ఐసీయూ’ మొద‌లైన వాటి కోసం వేల రూపాయ‌లు స‌రిపోవ‌డం లేదు. ల‌క్ష‌ల్లో కావాల్సి వ‌స్తోంది. ఇప్ప‌టికే పాల‌సీలు తీసుకున్న‌వారు.. టాప్‌-అప్‌, సూప‌ర్ టాప్‌-అప్‌ల‌ను కొనుగోలు చేయ‌డం ద్వారా బీమా మొత్తాన్ని పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ఆక‌ర్ష‌ణీయ‌మైన ధ‌ర‌లలో ల‌భ్య‌మ‌వుతున్నాయి. కొత్త‌గా పాల‌సీలు తీసుకునే కొనుగోలుదారులు కొవిడ్‌కు ముందు రోజుల‌తో పోల్చితే, స‌హేతుక‌మైన బేస్ పాల‌సీకి టాప్‌-అప్ లేదా సూప‌ర్ టాప్‌-అప్‌లను జ‌త చేస్తే మ‌రింత ఎక్కువ క‌వరేజ్‌ పొందొచ్చు. ఇదే బృంద బీమాకూ వ‌ర్తిస్తుంది. ఆసుప‌త్రి ఖ‌ర్చులు విప‌రీతంగా పెరిగిన కారణంగా ఉద్యోగులు, వారిపై ఆధార‌ప‌డిన కుటుంబ స‌భ్యుల కోసం అధిక కవ‌రేజ్‌తో కూడిన పాల‌సీల‌ను ఇవ్వాలని ఉద్యోగులు, వారు ప‌నిచేస్తున్న సంస్థ య‌జ‌మానుల‌ను కోరుతున్నారు.

పాల‌సీ ప్ర‌యోజ‌నాల గురించి ఆరా..: కొవిడ్‌-19కి ముందు వ్య‌క్తులు, కుటుంబాలు దీర్ఘ‌కాలిక అవ‌స‌రాలు, అంచ‌నాల‌ను పూర్తిగా ప‌రిశీలించ‌కుండా ఆరోగ్య బీమాను కొనుగోలు చేసేవారు. కొవిడ్‌-19 త‌ర్వాత ఆరోగ్య బీమా కొనుగోలు జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తున్నారు. వినియోగ‌దారులు త‌మ జీవిత‌కాలానికి త‌గినంత‌గా సేవ‌లందించే ఆరోగ్య బీమా ప్లాన్‌ను ఎంచుకోవ‌డానికి ప్లాన్ ఫీచ‌ర్లు, జీవిత‌కాల ప్ర‌యోజ‌నాల‌పై స‌మాచారాన్ని ముంద‌స్తుగా కోరుతున్నారు. నిర్దిష్ట ఫీచ‌ర్ల గురించి ఆరా తీస్తున్నారు. ప్ర‌త్యేకించి హాస్పిట‌లైజేష‌న్ ఖ‌ర్చుల‌కు సంబంధించిన గ‌ది అద్దె, ఇత‌ర అనుబంధ ఖ‌ర్చులు, అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఆసుప‌త్రిలో చేరాల్సివ‌స్తే స‌రిపోతాయా లేదా అని ఆరా తీస్తున్నారు.

డిజిట‌ల్‌ పాల‌సీలు..: ఆరోగ్య బీమా కోసం చూస్తున్న వారు ఏజెంట్ల‌పై ఆధార‌ప‌డే బ‌దులు పాల‌సీల‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు అన్వేషించ‌డం ప్రారంభించారు. డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్స్‌లో వినియోగ‌దారులు త‌మ వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు త‌గిన పాల‌సీ సుల‌భంగా ఎంచుకోవ‌చ్చు. కాబట్టి అందుబాటులో ఉన్న వంద‌లాది ఆన్‌లైన్ ప్లాన్‌ల‌తో స‌రిపోల్చుకుని స‌రైన పాల‌సీని కొనుగోలు చేయొచ్చు. ఆన్‌లైన్‌లో పాల‌సీల‌కు ఏజెంట్ల క‌మీష‌న్లు ఉండ‌వు కాబ‌ట్టి బీమా ప్రీమియం కూడా చౌక‌వుతుంది. క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం ఎల‌క్ట్రానిక్ మార్గాల ద్వారా జ‌రిగే న‌గ‌దు ర‌హిత సెటిల్‌మెంట్స్ గురించి వినియోగ‌దారులు బాగా తెలుసుకున్నారు. బీమా సంస్థ‌లు, టీపీఏలు క్లెయిమ్ డాక్యుమెంట్‌ల స్కాన్‌ల ఆధారంగా రీయింబ‌ర్స్‌మెంట్, క్లెయిమ్‌ల‌ను కూడా సెటిల్ చేస్తున్నారు.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని