Credit, Debit card Payments: ఆటో-డెబిట్ లావాదేవీలపై అక్టోబ‌ర్ 1 నుంచి కొత్త రూల్స్‌ 

డెబిట్, క్రెడిట్ కార్డులు ద్వారా చేసే ఆటో-డెబిట్ రిక‌రింగ్ లావాదేవీల‌కు అక్టోబ‌రు 1 నుంచి ఎడిష‌న‌ల్ ఫ్యాక్ట‌ర్ అథంటికేష‌న్ అవ‌స‌రం.

Published : 21 Sep 2021 16:46 IST

ఆటో-డెబిట్ రూల్స్ వ‌చ్చే నెల నుంచి మారే అవ‌కాశం ఉంది. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, యునిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్‌(యూపీఐ) లేదా ఇత‌ర ముంద‌స్తు(ప్రీపెయిడ్) చెల్లింపు సాధనాల ద్వారా చేసే పున‌రావృత లావాదేవీల‌కు ఎడిష‌న‌ల్ ఫ్యాక్ట‌ర్ అథంటికేష‌న్(ఏఎఫ్ఏ) అవ‌స‌ర‌మ‌ని రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గ‌తంలో పేర్కొంది. 

ప్ర‌స్తుతం డిజిట‌ల్ చెల్లింపులు  చేసే వారి సంఖ్య పెరిగింది.  విద్యుత్ బిల్లు ద‌గ్గ‌ర నుంచి గ్యాస్ బిల్లు వ‌ర‌కు నెల‌వారిగా చెల్లించాల్సిన బిల్లులు వాయిదాలు చెల్లించేందుకు పెద్ద సంఖ్య‌లో డెబిట్‌, క్రెడిట్ కార్డు వినియోగ‌దారులు ఆటో-డెబిట్‌ ప‌ద్ధ‌తిని ఉప‌యోగిస్తున్నారు. అందువ‌ల్ల ఈ కొత్త నిబంధ‌న‌ల‌ను ఏప్రిల్ 1 నుంచి అమ‌లు చేయాల‌ని భావించిన‌ప్ప‌టికీ.. వినియోగదారుల సౌక‌ర్యార్థం సెప్టెంబ‌రు 30 వ‌ర‌కు పాత ప‌ద్ధ‌తిలోనే చెల్లింపులు చేసేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. 

ఆటో డెబిట్ విధానంలో.. ప్రతి నెలా క్రమం తప్పకుండా చేసే చెల్లింపులు స్వ‌యం చాల‌కంగా డెబిట్‌ అయ్యేలా బ్యాంకులకు ఖాతాదారులు సూచనలు ఇచ్చే వీలుంది. ఈ చెల్లింపులను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) ఆధ్వర్యంలోని నాచ్‌ చూసుకుంటుంది. ఇందులో రుణ వాయిదాలే కాకుండా.. క్రెడిట్‌ కార్డు బిల్లులు, పెట్టుబడులు, బీమా పాలసీల చెల్లింపులు, టెలిఫోన్‌ బిల్లులు, ఇంటర్నెట్‌ ఛార్జీలు, కరెంటు, నీటి బిల్లులు ఇలా ఎన్నో ఉంటాయి. 

ప్ర‌స్తుత విధానంలో ఆటో డెబిట్ ప‌ద్ధ‌తిలో చెల్లింపులు చేసే ఖాతాదారులు త‌మ బ్యాంకుకు నిర్ధిష్ట సూచ‌న‌లు ఇస్తే స‌రిపోతుంది. కానీ కొత్త ప‌ద్ద‌తిలో అద‌నపు దృవీక‌ర‌ణ అవ‌స‌రం అవుతుంది. ఈ కొత్త నిబంధ‌న గురించిన స‌మాచారాన్ని బ్యాంకులు త‌మ ఖాతాదారులు తెలియ‌ప‌ర‌చ‌డం ప్రారంభించాయి. దీని ప్ర‌కారం వ‌చ్చే నెల నుంచి రిక‌రింగ్ ట్రాన్సేక్ష‌న్స్ కోసం అద‌న‌పు ధృవీక‌ర‌ణ లేకుండా ప్ర‌స్తుతం ఉన్న‌/ కొత్త‌  వినియోగ‌దారుల నుంచి స్టాండ‌ర్డ్ ఇన్‌స్ట్ర‌క్ష‌న్స్‌ని తీసుకోరు. నిరంత‌ర సేవ‌ల కోసం కార్డు ద్వారా నేరుగా చెల్లింపులు చేయ‌వ‌చ్చు. 

డెబిట్‌, క్రెడిట్ కార్డ్ ఆటో-చెల్లింపుల‌పై అక్టోబ‌రు 1 నుంచి అమ‌లు కాకున్న కొత్త రూల్ వివ‌రాలు..
1.
క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా ప్ర‌తీ నెల నిర్ధిష్ట సూచ‌న‌ల‌తో చేసే ఆటో-డెబిట్‌ చెల్లింపులు అద‌న‌పు ధృవీక‌ర‌ణ లేకుండా ప్రాసెస్ చేయ‌రు. ఈ నియ‌మం దేశీయ‌, అంత‌ర్జాతీయ లావాదేవీలు రెండింటికి వ‌ర్తిస్తుంది. 

2. న‌మోదు, స‌వ‌ర‌ణ‌, తొల‌గింపుల‌కు అద‌న‌పు దృవీక‌ర‌ణ(ఏఎఫ్ఏ) త‌ప్ప‌నిస‌రి. 

3. డెబిట్‌కి 24 గంటల ముందు ఖాతాదారుల‌కు ఎస్ఎమ్ఎస్ లేదా ఇ-మెయిల్ ద్వారా ప్రీ-డెబిట్  నోటిఫికేషన్ వస్తుంది.

4. ప్రీ-డెబిట్ నోటిఫికేషన్‌లో అందించిన లింక్ ద్వారా ఖాతాదారులు లావాదేవీ లేదా ఆదేశాన్ని నిలిపివేయవచ్చు.

5. ఖాతాదారులు తమ కార్డుకు ఇచ్చిన స్టాండింగ్ సూచనలను వీక్షించ‌డం, సవరించ‌డం లేదా రద్దు చేసుకునే సదుపాయం ఉంటుంది.

6. నిర్థిష్ట సూచ‌న‌లు ఇచ్చిన ఖాతాదారులు ప్ర‌తీసారి డెబిట్ అయ్యే గ‌రిష్ట మొత్తాన్ని సెట్ చేసుకోవ‌చ్చు. ఖాతాదారుడు కేటాయించిన గ‌రిష్ట మొత్తం కంటే ఎక్కువ మొత్తంలో లావాదేవీలు చేస్తే ప్రీ-డెబిట్‌ నోటిఫికేష‌న్‌తో ఏఎఫ్ఏ లింక్ వ‌స్తుంది. ధృవీక‌రణ‌ లేకుండా లావాదేవీల‌ను ప్రాసెస్ చేయ‌రు. 

7. రూ.5వేలు, అంత‌కంటే ఎక్కువ మొత్తంలో చేసే పున‌రావృత లావాదేవీల‌కు ప్ర‌తీసారి ఏఎఫ్ఏ దృవీక‌ర‌ణ అవ‌సరం అవుతుంది. 

8. బిల్ చెల్లింపుల కోసం బ్యాంకు ఖాతాతో స్టాండ‌ర్డ్ ఇన్‌స్ట్ర‌క్ష‌న్స్‌ రిజిస్ట‌ర్ చేసుకుంటే వాటిలో ఎటువంటి మార్పు ఉండ‌దు. ఇవి మీ బ్యాంకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో లింక్ అయ్యి ఉంటే.. అక్టోబ‌రు 1 నుంచి తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతాయి. ఉదాహ‌ర‌ణ‌కు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌, ఇన్సురెన్స్ చెల్లింపులకు ఇచ్చిన సూచ‌న‌లు నిలిపివేస్తారు. బ్యాంకు ఖాతాకు రిజిస్ట‌ర్  చేసుకున్న మ్యూచువ‌ల్ ఫండ్లు, సిప్‌లు, ఈఎమ్ఐ  స్టాండ‌ర్డ్ ఇన్‌స్ట్ర‌క్ష‌న్స్‌ కొన‌సాగుతాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని