Published : 21 Oct 2021 01:33 IST

Evergrande: చైనాలో కూలుతున్న ‘రియల్‌’ సౌధం..

 దివాలా దిశగా మరికొన్ని సంస్థలు 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

చైనా స్థిరాస్తి రంగంలో సంక్షోభం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఆ దేశంలో రెండో అతిపెద్ద సంస్థ ఎవర్‌గ్రాండె బాండ్లు, రుణాలను చెల్లించలేనని చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో కంపెనీ ఫాంటాసియా కూడా బాండ్లకు చెల్లింపులు చేయలేకపోయింది. ఇప్పట్లో ఈ సంక్షోభం గట్టెక్కే సూచనలు కనిపించడంలేదు. తాజాగా మరో సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలో చైనా రియల్‌ ఎస్టేట్ కంపెనీలు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోవడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.

మునుగుతున్న సినిక్‌ హోల్డింగ్స్‌..

చైనాలోని సినిక్‌ హోల్డింగ్స్‌ సంస్థ ఆఫ్‌షోర్‌ బాండ్లకు చెల్లింపులు చేయలేదు. సోమవారం నాటికి ఈ సంస్థ 250 మిలియన్‌ డాలర్లను ఆఫ్‌షోర్‌ బాండ్లకు చెల్లించాలి. కానీ, మంగళవారం వరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు.  డాలర్‌ బాండ్లకు చెల్లింపులు చేయలేకపోవచ్చని ఈ నెల మొదట్లో ఆ సంస్థ సంకేతాలను ఇచ్చింది. తాజాగా ఊహించినట్లే జరిగింది.

చైనా ప్రాపర్టీస్‌ గ్రూప్‌ కూడా..

మరో రియల్‌ ఎస్టేట్‌ సంస్థ చైనా ప్రాపర్టీస్‌ గ్రూప్‌కు చెందిన అనుబంధ సంస్థ ‘చీర్‌గెయిన్‌’ గత శుక్రవారం 226 మిలియన్‌ డాలర్ల విలువైన బాండ్లను చెల్లించలేనని ప్రకటించింది. విక్రయాలు పూర్తయ్యే వరకు గానీ లేదా రీఫైనాన్సింగ్‌ లభించే వరకు గానీ చీర్‌గెయిన్‌ చెల్లింపులు చేయలేదని చైనా ప్రాపర్టీస్‌ పేర్కొంది. అక్టోబర్‌ 15నాటికి నిధులను సమీకరించుకోవడంలో ఈ సంస్థ విఫలమైంది. దీంతో ఈ సంస్థ బాండ్లను విదేశీ ఎక్స్‌ఛేంజీల నుంచి డీలిస్ట్‌ చేయనున్నారు. ఇప్పటికే హాంకాంగ్‌ ఎక్స్‌ఛేంజీలో ఈ సంస్థ షేర్ల ట్రేడింగ్‌ను సస్పెండ్‌ చేశారు.

చిక్కుల్లో మోడెర్న్‌ ల్యాండ్‌..

బీజింగ్‌కు చెందిన ‘మోడెర్న్‌ ల్యాండ్‌’ సంస్థ కూడా నిధులకు కటకటలాడుతోంది. తాను చేయాల్సిన చెల్లింపులకు మరికొంత సమయం కోరింది. ఈ సంస్థ అక్టోబర్‌ 25 నాటికి ఇన్వెస్టర్లకు 250 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంది. నిధులను సమీకరించుకోవడానికి తమకు కొంత సమయం ఇవ్వాలని సంస్థ అభ్యర్థించింది. కంపెనీ ఛైర్మన్‌ ఝెంగ్‌ లీ, ప్రెసిడెంట్‌ ఝాంగ్ పెంగ్‌ సొంత నిధులను కంపెనీకి అప్పుగా ఇవ్వనున్నట్లు తెలిపారు. స్టాక్‌ ఎక్స్‌ఛేంజీల్లో సంస్థ షేర్ల విలువ ఈ ఏడాది 50శాతం వరకు పడిపోయింది.

చైనా రియాల్టీ సంస్థల రేటింగ్‌లు తగ్గించిన ఏజెన్సీ..

ఓ అంతర్జాతీయ ఏజెన్సీ చైనా రియల్‌ ఎస్టేట్‌ సంస్థల రేటింగ్స్‌ను తగ్గించింది. చైనాలో రెండు పెద్ద సంస్థలకు ఎస్‌అండ్‌పీ రేటింగ్స్‌ను కుదించింది. ప్రపంచంలోనే అతిఎత్తైన భవనాలను నిర్మించిన సంస్థగా పేరున్న జనరల్‌ హోల్డింగ్స్‌, ఇ-హౌస్‌ అనే సంస్థలకు కూడా ఇలానే రేటింగ్స్‌ల్లో కోత పెట్టింది. భవిష్యత్తులో మరింత కుదించే అవకాశం ఉందని హెచ్చరించింది. చైనా ఆర్థిక వ్యవస్థలో స్థిరాస్తి రంగం వాటా దాదాపు 5 ట్రిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది. ఆదివారం చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఇగాంగ్‌ మాట్లాడుతూ ఎవర్‌గ్రాండె ప్రభావం మొత్తం రియల్‌ ఎస్టేట్‌ రంగంపై పడకుండా చూడాలన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగానే ఉందని అభిప్రాయపడ్డారు.

18 బిలియన్‌ డాలర్లు చెల్లింపులు చేయలేక..

చైనాలోని కార్పొరేట్‌ రుణ ఎగవేతలు ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో భారీగానే నమోదయ్యాయి. అప్పటికి ఎవర్‌గ్రాండె సంక్షోభం తెరపైకి రాలేదు. 2021 మొదటి ఆరు నెలల్లో కార్పొరేట్‌ కంపెనీలు 18 బిలియన్‌ డాలర్లను చెల్లించలేక పోయాయి. జనవరి-జూన్‌ సీజన్‌లో ఈ స్థాయిలో ఎగవేతలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ రుణ ఎగవేతల్లోని 25 కంపెనీల్లో సగానికి పైగా ప్రభుత్వ సంస్థలు కావడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని