ప్ర‌త్యేక పాల‌సీతో డెంగ్యూపై పోరాడ‌దాం!

సీజ‌న‌ల్ వ్యాధి డెంగ్యూ బారిన పడితే ఆర్ధికంగా ఆదుకునే ప్ర‌త్యేక పాల‌సీ అపోలో మ్యూనిచ్ డెంగ్యూ కేర్.

Published : 19 Dec 2020 17:34 IST

వ‌ర్షాకాలం… చినుకులు, చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంతో ఆహ్లాదాన్ని పంచే ఈ కాలాన్ని ఇష్ట‌ప‌డేవారు ఎంతో మంది. మ‌రో వైపు వ‌ర్షాకాలంలో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ త‌డి, బుర‌ద నేల ఉండ‌డంతో బ‌య‌ట‌కు వెళ్లాలంటే ఇబ్బందులే. పైగా నీరు నిల్వ ఉండ‌డం వ‌ల్ల దోమ‌లు, ఈగ‌ల బెడ‌ద‌.

ఈ సీజ‌న్‌లో రోగాల బారిన ప‌డ‌డ‌మూ స‌ర్వ‌సాధార‌ణ‌మే. దోమ‌ల వ‌ల్ల మ‌లేరియా, ఫైలేరియా, డెంగ్యూ లాంటి సీజ‌న‌ల్ వ్యాధులు సంక్ర‌మిస్తాయి. దోమ‌తెర‌లు, మ‌స్కిటో కాయిల్స్‌, ఆయింట‌మెంట్ల‌తో దోమ‌ల‌ను ఎంత‌ని నియంత్రించ‌గలుగుతాం.

ఇలాంటి సీజ‌న‌ల్ వ్యాధుల‌ను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య బీమా సంస్థ‌లు ఇప్పుడిప్పుడే ప్ర‌త్యేక పాల‌సీల‌తో ముందుకొస్తున్నాయి. డెంగ్యూ కోస‌మే ప్ర‌త్యేకంగా “డెంగ్యూ కేర్‌” పేరుతో పాల‌సీని తీసుకొచ్చింది అపోలో మ్యూనిచ్ బీమా సంస్థ‌.

బీమా పొందే వ‌య‌సు

  • 91 రోజుల ప‌సిపిల్ల‌ల నుంచి 65ఏళ్ల వ‌య‌సు ఉన్న వారంద‌రూ ఈ పాల‌సీని కొనుగోలు చేయ‌వ‌చ్చు.

  • 65ఏళ్ల వ‌య‌సు దాటిన‌వారు పాల‌సీని రెన్యూవ‌ల్ చేసుకునేందుకు అనుమ‌తిస్తారు.

  • ఒక్క పాల‌సీలో గ‌రిష్టంగా 6 మందిని చేర్చుకోవ‌చ్చు. అయితే ప్రీమియం చెల్లింపులు, వారికి వ‌ర్తించే బీమా హామీ సొమ్ము విడివిడిగా ఉంటాయి.

బీమా హామీ సొమ్ము

  • బీమా హామీ సొమ్ము రెండు ర‌కాలుగా అందుబాటులో ఉంది. రూ.50వేల ప‌రిహారం అందించే పాల‌సీ, మ‌రొక‌టి రూ.1ల‌క్ష బీమా హామీ సొమ్ము అందించేది.

పాల‌సీ కాల‌వ్య‌వ‌ధి

  • పాల‌సీ కాల‌వ్య‌వ‌ధి ఏడాది. ఆ త‌ర్వాత రెన్యూవ‌ల్ చేయించుకోవ‌చ్చు. రెన్యూవ‌ల్ చేయించుకునేందుకు 30రోజుల గ్రేస్ పీరియ‌డ్‌ను బీమా సంస్థ ఇస్తుంది. ప్రీమియాన్ని ఏడాదికోసారి చెల్లించాల్సి ఉంటుంది.

వెయిటింగ్ పీరియ‌డ్‌

  • 15 రోజుల వెయిటింగ్ పీరియ‌డ్ మాత్ర‌మే. అంటే పాల‌సీ కొనుగోలు చేశాక‌, 15 రోజుల తర్వాత డెంగ్యూ వ్యాధికి గురైతే పాల‌సీ వ‌ర్తిస్తుంది. ఇంత త‌క్కువ వెయిటింగ్ పీరియ‌డ్ అందించే ఆరోగ్య పాల‌సీలు చాలా త‌క్కువ‌.

ముఖ్య ప్ర‌యోజ‌నాలు

  • పాల‌సీ ప‌రిధిలో ఉన్న‌వారు డెంగ్యూ వ్యాధికి గురై ఆసుప‌త్రిలో ఇన్‌-పేషెంట్‌గా చేరితే బీమా హామీ సొమ్ము మేర‌కు ప‌రిహారాన్ని ఇస్తారు. అంటే ఎంచుకున్న పాల‌సీని బ‌ట్టి గ‌రిష్ఠంగా రూ.1ల‌క్ష లేదా రూ.50వేల సొమ్ము ప‌రిహారంగా అందుతుంది.

  • ఔట్ పేషెంట్ గా చికిత్స పొందేవారు, ఔష‌ధాల‌కు, డాక్ట‌ర్ ఫీజు, డ‌యాగ్న‌స్టిక్ టెస్టులు త‌దిత‌రాల‌న్నీ క‌లిపి గ‌రిష్టంగా రూ.10వేల ప‌రిహారం అందుతుంది.

ఇత‌ర ప్ర‌యోజ‌నాలు

  • ఆసుప‌త్రిలో అద్దె ఏసీ గ‌దికి అయ్యే ఖ‌ర్చులు ఈ పాల‌సీ ప‌రిధిలోకి వ‌స్తుంది.

  • సాధార‌ణ ఆరోగ్య పాల‌సీలో ఏదైనా చికిత్స‌కు ప‌రిహారం పొందాలంటే ప‌రిమితులు, ఉప‌-ప‌రిమితులు ఉంటాయి. ఈ పాల‌సీలో అలాంటి ఉప ప‌రిమితులు ఏమీ లేవు.

  • ఆసుప‌త్రిలో చేర‌క ముందు( ప్రీ హాస్పిట‌లైజేష‌న్‌), ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యాక‌(పోస్ట్ హాస్పిట‌లైజేష‌న్‌) ఉండే వైద్య సంబంధ ఖ‌ర్చులు ఈ పాల‌సీ ప‌రిధిలోనికి వ‌స్తాయి.

పాల‌సీ పరిధిలోనికి రాని అంశాలు

  • డెంగ్యూ జ్వ‌రం కాకుండా ఇత‌ర అనారోగ్యాల‌కు చికిత్స నిర్వ‌హిస్తే పాల‌సీ వ‌ర్తించ‌దు.

  • వైద్యుడు ప్రిస్క్రిప్ష‌న్ లో రాయ‌ని విట‌మిన్‌, టానిక్ల‌ను కొనుగోలు చేస్తే…

  • స‌రైన కార‌ణం లేకుండా డెంగ్యూతో సంబంధం లేని చికిత్స‌లు రోగికి నిర్వ‌హించిన‌ప్పుడు

  • ఆసుపత్రిలో ప్ర‌త్యేక గ‌దికి ప‌రిహారం అందించే విష‌యంలోనూ కొన్ని ప‌రిమితులున్నాయి.

  • ఇవి కాకుండా మ‌రిన్ని అంశాలు పాల‌సీ ప‌రిధిలోనికి రావు. పూర్తి వివ‌రాల కోసం పాల‌సీ బ్రోచ‌ర్‌ను చ‌ద‌వాల్సిందిగా సూచించ‌డ‌మైన‌ది.

ప్రీమియం లెక్కింపు

  • బీమా హామీ సొమ్ము రూ. 50వేల‌తో కూడిన పాల‌సీకి – వార్షిక ప్రీమియం-- రూ.444

  • బీమా హామీ సొమ్ము రూ.1లక్ష‌తో కూడిన పాల‌సీకి— వార్షిక ప్రీమియం-- రూ.578
    ఉదాహరణకు: నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబానికి సంవత్సరానికి రూ. 2660 కి ఒక్కొక్కరికీ రూ. లక్ష డెంగ్యూ బీమా పొందవచ్చు.
    Screen Shot 2017-06-28 at 08.44.12.png

  • ప్రీమియానికి సేవా ప‌న్ను, ఇత‌ర ఛార్జీలు అద‌నం.

  • జులై 1 నుంచి జీఎస్‌టీ అమ‌లు కానున్న నేప‌థ్యంలో స్వ‌ల్పంగా ప్రీమియం ఛార్జీలు పెరిగే అవ‌కాశం. ఇదివ‌ర‌కున్న 15శాతం సేవా ప‌న్ను … జీఎస్‌టీ అమ‌లుతో 18శాతానికి చేర‌వ‌చ్చు.

  • ఐఆర్‌డీఏ సూచన‌ల మేర‌కు ప్రీమియం రేట్ల‌లో మార్పు ఉండ‌వ‌చ్చు.

  • రెన్యూవ‌ల్ చేసే స‌మ‌యంలో వ్య‌క్తి వ‌య‌సును బ‌ట్టి ప్రీమియం రేట్ల‌లో హెచ్చుత‌గ్గులను గ‌మ‌నించ‌వచ్చు.

పన్ను ప్ర‌యోజ‌నాలు

  • ఈ పాల‌సీకి జ‌రిపే ప్రీమియం చెల్లింపుల‌కు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం, సెక్ష‌న్ 80డీ కింద ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

పాల‌సీ కొనుగోలు విధానం

  • ఆన్‌లైన్‌లో పాల‌సీని అపోలో మ్యూనిచ్‌ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయ‌వచ్చు.

  • వెబ్ సైట్‌లోనో రెన్యూవ‌ల్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంది.

  • ఏజెంటు ద్వారా కూడా ఈ పాల‌సీని కొనుగోలు చేయ‌వ‌చ్చు.

క్లెయిం చేసే విధానం

  • క్లెయిం ఫారంను ఉప‌యోగించి క్లెయిం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

  • వైద్య ఖ‌ర్చుల‌ను రీయింబ‌ర్స్ చేసుకునేందుకు వ్యాధి ల‌క్ష‌ణాల‌ను గుర్తించిన 15రోజుల‌లోపు బీమా సంస్థ‌కు క్లెయిం చేసుకోవాలి. లేదా చికిత్స పూర్త‌యిన 7రోజుల‌లోపు రీయింబ‌ర్స్‌మెంట్ కోసం క్లెయిం చేసుకోవాలి.

  • బీమా సంస్థ కొన్ని నెట్‌వ‌ర్క్‌ ఆసుప‌త్రుల్లో క్యాష్ లేస్ స‌దుపాయాన్ని అందిస్తుంది. అలాంటి ఆసుప‌త్రుల నుంచి సేవ‌లు పొందాలనుకునేవారు 48 గంట‌ల్లోగా ఈ విష‌యాన్ని బీమా సంస్థ‌కు తెలియ‌జేయాలి.

  • క్లెయిం ఫారంతో పాటు జ‌త‌చేయాల్సిన అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్ల వివ‌రాలు సంబంధిత క్లెయిం ఫారంలోనే ఉంటాయి. వాటిని బ‌ట్టి డాక్యుమెంట్ల‌ను సిద్ధంచేసుకోవాలి.

డెంగ్యూ వ్యాధి బారిన‌ప‌డి ఆసుప‌త్రిలో చేరితే అయ్యే ఖ‌ర్చులు సాధార‌ణంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు భ‌రించలేనంతగానే ఉంటాయి. కాబట్టి త‌క్కువ ప్రీమియంతో ఇలాంటి ప్ర‌త్యేక పాల‌సీని కొనుగోలు చేయ‌డం వ‌ల్ల ఆదాయానికి గండి ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు. వ‌ర్షాకాలంలో, ముఖ్యంగా చిన్న‌పిల్ల‌లు ఉండే కుటుంబంలో లేదా ఎక్కువ‌గా వ్యాధి బారిన‌ప‌డే ప్రాంతాల‌లో ఉండేవారు ఈ పాల‌సీ కొనుగోలును ప‌రిశీలించ‌వ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని