ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయ్‌

చిన్న, మధ్య స్థాయి ప్రైవేటు రంగ బ్యాంకుల్లో 2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో డిపాజిట్లలో మంచి వృద్ధి కనిపించింది. కాగా, రుణాల జారీ మందగించింది. 3 ప్రైవేటు బ్యాంకులు ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారం

Published : 07 Jan 2021 00:38 IST

ముంబయి: చిన్న, మధ్య స్థాయి ప్రైవేటు రంగ బ్యాంకుల్లో 2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో డిపాజిట్లలో మంచి వృద్ధి కనిపించింది. కాగా, రుణాల జారీ మందగించింది. 3 ప్రైవేటు బ్యాంకులు ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారం గమనిస్తే ఇది అర్థమవుతోంది. దశాబ్ద కాలంలోనే వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గినప్పటికీ, నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థ ప్రభావంతో రుణాలకు గిరాకీ తగ్గినట్లు తెలుస్తోంది. వ్యవస్థలో రుణ వృద్ధి 6 శాతం వద్ద నత్తనడకన సాగింది. అయితే బంధన్‌ బ్యాంక్‌ రుణ పుస్తకం మాత్రం వృద్ధిని కనబరిచింది. వార్షిక ప్రాతిపదికన, 23 శాతం వృద్ధితో రూ.80,255 కోట్లకు చేరింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ల విషయానికొస్తే వృద్ధి స్వల్పంగా నమోదైంది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ రుణ పుస్తకం 2020 సెప్టెంబరు వరకు తగ్గుదల నమోదు చేసినా, డిసెంబరు త్రైమాసికంలో అదనంగా రూ.6,000 కోట్ల మేర పెరిగింది. ఏడాది క్రితం ఇదే సమయంలో రుణ పుస్తకం రూ.2.07 లక్షల కోట్లుగా ఉంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ రుణ పుస్తకం డిసెంబరు త్రైమాసికంలో రూ.3,000 కోట్ల మేర పెరిగింది.
డిపాజిట్లకొస్తే.. యెస్‌ బ్యాంక్‌ సంక్షోభ సమయంలో బ్యాంకుల డిపాజిట్లలో క్షీణత కనిపించినా,  డిసెంబరు త్రైమాసికంలో బంధన్‌ బ్యాంక్‌ 30 శాతం, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ 41 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 11 శాతం మేర డిపాజిట్లను పెంచుకున్నాయి. కరెంట్‌, పొదుపు ఖాతా (కాసా) డిపాజిట్లు ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌లో 40.5 శాతం, బంధన్‌ బ్యాంక్‌లో 43 శాతం మేర పెరిగాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో రిటైల్‌ డిపాజిట్లు (కాసా, కాలిక డిపాజిట్లు) వార్షిక ప్రాతిపదికన 100 శాతం వృద్ధి చెందాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని