గృహ బీమా ఎంత మొత్తం ఉండాలంటే!!

గృహ బీమా హామీ మొత్తం ఏ యే అంశాల ప్రాతిపదికన, యెంత మొత్తం కలిగి ఉండాలో తెలుసుకుందాం...

Published : 19 Dec 2020 16:54 IST

గృహ బీమా తీసుకునే సమయంలో, అసలు బీమా యెంత మొత్తానికి ఏ ప్రాతిపదికన ఇస్తారు, చెల్లింపు ఎలా జరుగుతుంది, నష్టం జరిగినప్పుడు ఆ నష్టాన్ని ఏ అంశాల ఆధారంగా లెక్కిస్తారు అనే విషయాల పై అవగాహన కలిగి ఉండాలి. ఆ వివరాలు చూస్తే…

గృహ నిర్మాణానికి :

గృహ బీమా కవరేజీని లెక్కించేటప్పుడు బీమా సంస్థలు గృహ సముదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాయి. ఏదైనా ప్రమాదం వల్ల కలిగిన నష్టాన్ని పూరించేందుకో, ఇంటిని పునర్నినిర్మించేందుకు అయ్యే ఖర్చును బీమా కంపెనీలు చెల్లిస్తాయి. నివాసం ఏర్పర్చుకున్న స్థలం విలువను లెక్కలోకి తీసుకోరు. బీమా చేయించుకునేటప్పుడు పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చును లెక్కించి అంత మేరకు గృహ బీమా చేయించుకోవాలి.

చదరపు అడుగు (స్కేర్‌ ఫీట్‌) ప్రామాణికంతో గృహాన్ని లెక్కిస్తారు కాబట్టి ఒక్క చదరపు అడుగుకు ఇంత బీమా చెల్లిస్తామని బీమా కంపెనీలు ముందే ఒప్పందం కుదుర్చుకుంటాయి. పునాది నిర్మించేందుకు అయ్యే ఖర్చును కూడా లెక్కిస్తారు. గృహంతోపాటు ప్రహరీ పరిధి కూడా బీమాలోకే వస్తుంది.

ద్రవ్యోల్బణ ప్రభావం :

దీర్ఘకాలానికి గృహ బీమాను తీసుకునేటట్టయితే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. భవిష్యత్తులో ఇంటి పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చును అంచనా వేసుకొని అందుకు తగ్గట్టుగా పాలసీ ఎంచుకోవాలి.

నిపుణుల ఫీజు :

నష్టం కలిగాక ఇంటిని తిరిగి కట్టించడం ఆషామాషీ వ్యవహారం కాదు. మరమ్మతుకు కావలసిన ముడిసరుకులు కొంటే సరిపోదు. ఆర్కిటెక్చర్లు, సర్వేయర్లు, మేస్త్రీలు ఇంటిని తిరిగి నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తారు. కొన్ని కంపెనీలు వాళ్లకు చెల్లించాల్సిన ఫీజును కూడా భరిస్తాయి.

శిథిలాల తొలగింపు:

భూకంపాలు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు భవనాలు కుప్పకూలిపోతాయి. ఇంటిని తిరిగి నిర్మించేందుకు పరిహారం ఇస్తారు సరే మరి అంతకుముందు శిథిలాల తొలగింపు మాటేంటి? అందుకోసం కూడా కొన్ని కంపెనీలు బీమా కల్పిస్తాయి. శిథిలాల తొలగింపునకు వాడే జేసీబీ వాహనాలకు, కూలీల ఖర్చులను బీమా కంపెనీలు చెల్లిస్తాయి.

ఇంట్లో పనిచేసేవారి పరిస్థితి…

మన ఇంట్లో కేవలం మన కుటుంబసభ్యులు మాత్రమే ఉండము కదా. మన రోజువారీ పనుల కోసం పనిమనుషులను, వంటమనుషులను, వాచ్‌మెన్‌ను నియమించుకుంటాం. కొందరు ఇంటి ఆవరణలోనే వాచ్‌మన్‌ కోసం ఔట్‌హౌస్‌ నిర్మించి ఇస్తారు. ప్రమాదం జరిగిన సమయంలో వీళ్లు మన ఇంట్లోనే ఉన్నా, విధులు నిర్వహిస్తున్నా వారికి కలిగే నష్టానికి వర్క్‌మెన్స్‌ కాంపెన్‌సేషన్‌ చట్టం ప్రకారం వాళ్లకు పరిహారం అందజేస్తారు.

పాలసీ కవరేజీ సమయంలో అమ్మితే…

పాలసీ కవరేజీలో ఉండగా ఇంటిని అమ్మినట్టయితే పాలసీ రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంది. మనం కట్టిన ప్రీమియంపై కొంత రుసుము విధించి బీమా కంపెనీలు తిరిగి చెల్లిస్తాయి.

సొసైటీ/ అపార్టుమెంటుకు బీమా తీసుకున్నప్పుడు

అపార్టుమెంటు యాజమాని లేదా సొసైటీ నిర్వాహకుడు గృహాల సముదాయానికి మొత్తం కలిపి బీమాచేయించుకుంటే అది మన సొంత ఇంటికి కొంత మేరకు మాత్రమే బీమా కల్పించగలుగుతుంది. సమగ్ర బీమా కవరేజీ కోసం మనదైన గృహ బీమా తీసుకోవడం మంచిది.

ఆభరణాలు, విలువైన వస్తువులు:

సాధారణ గృహ బీమా పరిధిలోకి ఆభరణాలు లాంటి విలువైన వస్తువులకు బీమా వర్తింపజేయరు.
అలా వర్తించని వస్తువుల వివరాలు…

  • బంగారు, వెండి ఆభరణాలు

  • హస్త కళా వస్తువులు, ప్రాచీన సంపద

  • ప్రాచీన గ్రంథాలు

  • కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసిన విలువైన సమాచారం

  • ముఖ్యమైన దస్త్రాలు

  • షేర్లు, బాండ్‌ కాగితాలు

  • కాగితం రూపంలో ఉన్న నగదు

వీటన్నింటిని ప్రత్యేకంగా పరిగణించి మన అభ్యర్థన మేరకు మాత్రమే బీమా వర్తింపజేస్తారు. ఒక్కో వస్తువు మార్కెట్‌ విలువను లెక్కకట్టి అందుకు తగ్గ బీమాను నిర్ధారిస్తారు. క్లెయిం చేసుకునే సమయంలో వాటికి సమానమైన పరిహారం లేదా అందులో కొంత శాతాన్ని అందిస్తారు.

బీమా కలిగి ఉండాల్సిన సొమ్ము :

ఏదైనా ప్రమాదం జరిగి నష్టం వాటిల్లితే దానికి సరిపడా బీమా లభించే విధంగా సరైన విలువకు బీమా కలిగి ఉండాలి. ప్రీమియం భారంగా భావించి తక్కువ మొత్తానికి బీమా తీసుకుంటే నష్టం జరిగినప్పుడు ఇబ్బంది పడవలసి ఉంటుంది.

ఇంటిని అద్దెకు తీసుకున్నప్పుడు

  • ఇంటిని అద్దెకు తీసుకన్నవారు తమ ఇంట్లో ఉండే వస్తువులకు బీమా చేయించుకోవచ్చు. ఇంట్లోని ముఖ్యమైన సామాన్లు, ఫర్నీచర్‌, టీవీ, కంప్యూటర్‌, ఫ్రిడ్జ్‌, వాషింగ్‌ మెషీన్‌, విలువైన బంగారు, వెండి ఆభరణాలు, బట్టలు, సోఫా లాంటివాటికి బీమా చేయించుకునే వీలుంది.

  • వీటి మార్కెట్‌ విలువను బీమా చేయించుకునేటప్పుడు తెలియపర్చాల్సి ఉంటుంది. వస్తువుల వాడుక వయసును కొన్ని కంపెనీలు పరిమితం చేశాయి. ఉదాహరణకు ఏడు సంవత్సరాలకు మించి వాడుతున్న వస్తువులకు బీమా కల్పించరు.

  • నష్టం జరిగిన వస్తువును మరమ్మతు చేయించేందుకు అయ్యే ఖర్చును లేదా పూర్తిగా కొత్త వస్తువు కొనేందుకు అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని బీమా కంపెనీలు చెల్లిస్తాయి. అయితే వీటి విలువను చెల్లించేటప్పుడు తరుగుదలను లెక్కిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని