Devas: కెయిర్న్‌కు తోడైన దేవాస్‌..!

దేవాస్‌ మల్టీమీడియా కంపెనీ భారత్‌ నుంచి రావాల్సిన పరిహారం వసూలు చేసుకొనేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Published : 29 Jun 2021 21:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేవాస్‌ మల్టీమీడియా కంపెనీ భారత్‌ నుంచి రావాల్సిన పరిహారం వసూలు చేసుకొనేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ కంపెనీ 1.2 బిలియన్‌ డాలర్ల పరిహారం కోరుతోంది. ఇప్పుడు కెయిర్న్‌ ఇండియాతో జత కలిసి ఎయిర్‌ ఇండియా ఆస్తలను విక్రయించి పరిహారం ఇవ్వాలని కోరుతోంది.  ఈ మేరకు దేవాస్‌ న్యూయార్క్‌లో ఒక పిటిషన్‌ దాఖలు చేసింది. అమెరికాలో ఉన్న ఎయిర్‌ ఇండియా ఆస్తులు, విమానాలు, కార్గో నిర్వహించే పరికరాలను విక్రయించి చెల్లించాలని కోరుతోంది. ఈ అంశం ఎయిర్‌ ఇండియా విక్రయానికి అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. గతేడాది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వాణిజ్య విభాగమైన యాంత్రిక్స్‌ కార్పొరేషన్‌కు అమెరికాలోని ఓ కోర్టు షాక్‌ ఇచ్చింది! 

ఏమిటీ వివాదం?

దేవాస్‌ మల్టీమీడియా బెంగళూరు సంస్థ. పలువురు అమెరికా వ్యాపారవేత్తలు కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. 2005 జనవరిలో యాంత్రిక్స్‌, దేవాస్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. యాంత్రిక్స్‌ రెండు ఉపగ్రహాలను తయారుచేసి ప్రయోగించాలి. ఈ ఉపగ్రహాల ద్వారా 70 మెగాహెర్ట్జ్‌ల ఎస్‌-బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ను దేవాస్‌కు అందుబాటులోకి తీసుకురావాలి. ఉపగ్రహ, భౌగోళిక కమ్యూనికేషన్‌ వ్యవస్థలతో కూడిన మిశ్రమ సేవలను అందించేందుకు ఆ స్పెక్ట్రమ్‌ను ఉపయోగించుకోవాలన్నది దేవాస్‌ ప్రణాళిక. అయితే- 2011 ఫిబ్రవరిలో ఆ ఒప్పందాన్ని యాంత్రిక్స్‌ రద్దు చేసుకుంది. భారత ప్రభుత్వ విధాన నిర్ణయానికి కట్టుబడి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
ఒప్పందం రద్దుపై తొలుత దేశవ్యాప్తంగా వివిధ న్యాయ వేదికలను దేవాస్‌ ఆశ్రయించింది. సుప్రీం కోర్టు తలుపు కూడా తట్టింది. ట్రైబ్యునల్‌ ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని సుప్రీం సూచించింది. 2018 సెప్టెంబరులో వెస్టర్న్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ వాషింగ్టన్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టును దేవాస్‌ మల్టీమీడియా ఆశ్రయించింది. ఒప్పందాన్ని యాంత్రిక్స్‌ అనుచిత రీతిలో రద్దు చేసుకుందని మూడు అంతర్జాతీయ ట్రైబ్యునళ్లు, తొమ్మిది మంది మధ్యవర్తులు/మధ్యవర్తిత్వ సంస్థలు తేల్చాయని తమ దావాలో కోర్టుకు నివేదించింది. అనంతరం అదే ఏడాది నవంబరులో యాంత్రిక్స్‌ కూడా ఆ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. యాంత్రిక్స్‌-దేవాస్‌ కేసు అమెరికా న్యాయస్థానం పరిధిలోకి రాదని అందులో పేర్కొంది. దేవాస్‌ దావాను కొట్టివేయాలని కోరింది. వెస్టర్న్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ వాషింగ్టన్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు అందుకు నిరాకరించింది. ఆ కేసు తమ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకుగాను దేవాస్‌కు 562.5 మిలియన్‌ డాలర్ల నష్ట పరిహారాన్ని చెల్లించాలని యాంత్రిక్స్‌ను అందులో ఆదేశించారు. వడ్డీతో కలిపితే.. చెల్లించాల్సిన మొత్తం పరిహారం 1.2 బిలియన్‌ డాలర్లు (రూ.8.9 వేల కోట్లు) అవుతుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని