Investments: ఈ పెట్టుబడి పథకాలూ సిప్‌ లాంటివే.. మరి ప్రయోజలేంటో తెలుసా?

సిస్ట‌మేటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్, మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డుల‌ను క్ర‌మంగా విత్‌డ్రా చేసుకునేందుకు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. 

Updated : 26 Jul 2021 17:16 IST

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో క్ర‌మానుగుత పెట్టుబ‌డుల‌తో పాటు క్ర‌మానుగ‌త ఉప‌సంహ‌ర‌ణ‌, ట్రాన్స్‌ఫర్ వంటి ప‌థ‌కాల గురించి మదుపర్లకు అవ‌గాహ‌న ఉంటే ఉపయోగకరం..


క్రమానుగత పెట్టుబడి పథకం (సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌-సిప్‌)

సిప్‌లో కొంత క‌చ్చిత‌మైన మొత్తాన్ని నెలకు నిర్ణీత‌ కాలం వ‌ర‌కు పెట్టుబ‌డిగా పెట్టాలి. ఈ స్కీమ్‌ను ఎంచుకుంటే మీ ఖాతా నుంచి నేరుగా సిప్ ఖాతాలో ప్ర‌తి నెల జ‌మ‌వుతుంది. ఇందులో క‌నీసం రూ.100 నుంచి కూడా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. దీనికి ఎలాంటి ఛార్జీలు ఉండ‌వు. అయితే మ్యూచువ‌ల్‌ ఫండ్ కంపెనీలు మీ పెట్టుబ‌డుల‌ను నిర్వ‌హించేందుకు కొంత ఛార్జీల‌ను వ‌సూలు చేస్తాయి. ఈక్విటీ ఫండ్ల‌కు అయితే సంవ‌త్స‌రానికి 1.5-2.5 శాతం, డెట్ ఫండ్ల‌కు 0.5-1 శాతంగా వ‌సూలు చేస్తాయి. సిప్‌తో క్ర‌మంగా పొదుపు అల‌వాటు కావ‌డ‌మే కాకుండా,  దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. వేత‌న జీవుల‌కు ఈ సిప్  విధానం చాలా అనుకూలంగా ఉంటుంది.


క్రమానుగత ఉపసంహరణ పథకం (ఎస్‌డ‌బ్ల్యూపీ)

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల నుంచి స్థిరమైన సొమ్మును ఒక క్ర‌మ‌మైన వ్య‌వ‌ధిలో తీసుకోవ‌డాన్నే సిస్ట‌మెటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్(ఎస్‌డ‌బ్ల్యూపీ) అంటారు. ఇక్క‌డ క్ర‌మ‌మైన వ్య‌వ‌ధి నెల‌, మూడు నెల‌లు, ఆరు నెల‌లు లేదా ఏడాది కావ‌చ్చు. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన‌వారికి త‌మ మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల నుంచి నెల నెలా ఆదాయం రూపంలో పొందాలంటే ఈ ఎస్‌డ‌బ్ల్యూపీ ఎంతో అనుకూల‌మైన‌ది. మీ ఖాతాలో క‌నీసం రూ.25 వేలు ఉన్న‌ప్ప‌టికీ ఎస్‌డ‌బ్ల్యూపీ ప్రారంభించ‌వ‌చ్చు. `మొద‌ట మ్యూచువ‌ల్ ఫండ్ స్కీమ్‌లో ఎక్కువ మొత్తంలో పెట్టుబ‌డి పెట్టి , ఆ త‌ర్వాత స‌మ‌యానుసారంగా కొంత మొత్తంగా రెగ్యుల‌ర్‌గా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. అప్ప‌టికీ ఖాతాలో ఉన్న దానిపై రాబ‌డి ల‌భిస్తుంది. రెగ్యుల‌ర్‌గా ఆదాయం రాన‌ప్పుడు ఇది ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి నుంచి క్ర‌మంగా పెన్ష‌న్‌ను పొందేందుకు కూడా ఈ స్కీమ్‌ను వినియోగించుకోవ‌చ్చు.


క్రమానుగత బదిలీ పథకం (ఎస్‌టీపీ)

ఎస్‌టీపీ అనేది ఎస్‌డ‌బ్ల్యూపీ, సిప్ రెండిటి క‌ల‌యిక అని చెప్పుకోవ‌చ్చు. ఇందులో మ‌దుప‌రుల‌కు సంబంధించిన నిర్ణీత సొమ్ము మొత్తం ఒక ప‌థ‌కం నుంచి మ‌రోదానికి క్ర‌మంగా బ‌దిలీ అవుతుంది. సాధార‌ణంగా ఒకే ఫండ్ సంస్థ‌కు చెందిన డెట్ ఫండ్ ప‌థ‌కం నుంచి ఈక్విటీ ప‌థ‌కానికి సొమ్ము బ‌దిలీ అవుతుంది. తొలుత డెట్‌లో మొత్తం పెట్టుబ‌డి సొమ్ము ఉంచుకునే అవ‌కాశం క‌ల్పిస్తారు. పొదుపు ఖాతా కంటే మెరుగైన రాబ‌డి వ‌చ్చేలా ఈ డెట్ ఫండ్ ఎంపిక ఉంటుంది. మార్కెట్ టైమింగ్‌ను చూసుకొని పెట్టుబ‌డి పెట్టాల్సిన‌ ఇబ్బందిని మ‌దుప‌ర్ల‌కు లేకుండా చేస్తుంది. ఫండ్ స్కీమ్ అదేవిధంగా ఫండ్ మీద ఆధార‌ప‌డి ఎస్‌టీపీ మొత్తం ఉంటుంది. క‌నీసం వెయ్యి రూపాయ‌ల నుంచి గరిష్ఠంగా ఎంతైనా ఎంచుకునే అవ‌కాశం ఉంటుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని