పొదుపు, పెట్టుబ‌డికి తేడా ఏమిటంటే...

ఆదాయం నుంచి ఖ‌ర్చులు పోగా మిగిలిన దాన్నే పొదుపు చేసిన‌ట్టుగా భావిస్తాం

Published : 19 Jan 2021 16:37 IST

ఆర్థిక ప్ర‌ణాళిక‌వేత్త‌లు, స‌ల‌హాదార్లు, మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో త‌ర‌చూ మ‌నం పొదుపు, పెట్టుబ‌డులు లాంటి మాట‌లు వింటుంటాం. సంప‌ద సృష్టించుకోవాలంటే పొదుపు ఒక్క‌టే స‌రిపోదు… పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది అనే మాట‌ల‌ను విని ఉంటాం. నిజానికి పొదుపు, పెట్టుబ‌డి రెండూ చాలా భిన్న‌మైన అంశాలు. ఈ రెండు ఒకటే కదా అనే చాలా మంది భ్రమ పడుతుంటారు. వీటి మధ్య వ్యత్యాసం ఏంటో చూద్దాం.

 ప్ర‌తి నెలా మ‌న‌లో చాలా మంది ఎంతో కొంద ఆదాయం పొందుతూనే ఉంటాం. ఉద్యోగం చేసేవారికైతే వేత‌నం రూపంలో, వ్యాపారులు, వృత్తి నిపుణుల‌కైతే బిజినెస్ ఇన్‌క‌మ్ రూపంలో వ‌స్తుంటుంది. ఆదాయానికి త‌గ్గ‌ట్టుగానే ఆహారం, దుస్తులు, అద్దె, క‌రెంటు, టెలిఫోన్ బిల్లుల రూపంలో ప్ర‌తి నెలా ఖ‌ర్చులు ఉండ‌నే ఉంటాయి. ఆదాయం నుంచి వీటికి ఖ‌ర్చు చేయ‌గా మిగిలిందే మ‌నం సేవింగ్స్ అంటాం. ఎంత ఎక్కువ‌గా పొదుపు చేస్తే అంత మంచిది కూడా! ఖ‌ర్చులు త‌గ్గించుకుంటాం స‌రే…ఇక మ‌న‌మెప్పుడూ సాధ్య‌మైనంత మేర‌కు ఖ‌ర్చులు త‌గ్గించుకునే ఉపాయాల‌ను చూసుకోవాలి. కానీ, కొన్ని ర‌కాల ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోలేం. ఇంటి అద్దె, రుణ చెల్లింపు లాంటివి వీటికి ఉదాహ‌ర‌ణ‌లు. సంప‌ద సృష్టించుకోవ‌డ‌మే మ‌న ల‌క్ష్య‌మైతే పొదుపు ఒక్క‌టే స‌రిపోదు. అంత‌కుమించి ఏమైనా చేయాల్సి ఉంటుంది. డ‌బ్బు విలువ త‌రిగిపోతోంది - ఇలాంటి సంద‌ర్భంలోనే పెట్టుబ‌డులు తెర మీదికొస్తాయి. కొంత కాలంపాటు డ‌బ్బును కొన్ని ఆర్థిక సాధ‌నాల్లో పెడితే మంచి వృద్ధిని సాధిస్తాయి. వీటినే పెట్టుబ‌డి సాధ‌నాలుగా పిలుస్తాం. ఏటా జీవన వ్య‌యాలు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రారంభించ‌డ‌మే మంచిది. ఇలా జీవ‌న వ్య‌యాలు పెరిగడాన్నే ద్ర‌వ్యోల్బ‌ణంగా పిలుస్తాం. వేరే మాటల్లో చెప్పాలంటే డ‌బ్బు విలువ త‌రిగిపోతుంటుంది. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించి - ఉదాహ‌ర‌ణ‌కు ఇప్పుడు నెల‌కు రూ.10వేలు జ‌మ‌చేస్తున్నార‌నుకుందాం. దాన్ని అలాగే వ‌దిలేస్తే కొంత కాలానికి ఆ డ‌బ్బుతో గ‌తంలో కొన్న‌న్ని వ‌స్తువులు కొన‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డ‌వ‌చ్చు. ఇలా ఎందుక‌వుతుందంటే డ‌బ్బు విలువ త‌రిగిపోతుంది. వ‌స్తు, సేవ‌ల ధ‌ర‌లు రోజురోజుకు పెరుగుతుంటాయి. అందుకే మీ డ‌బ్బు కూడా పెరుగుతూ ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ద్ర‌వ్యోల్బ‌ణం కంటే వేగంగా పెర‌గాలి. అప్పుడే భ‌విష్య‌త్‌లో క‌నీసం ఇప్పుడనుకున్న వ‌స్తువును కొనుగోలు చేయ‌గ‌లుగుతాం. మ‌రి పెట్టుబ‌డికి స‌రైన మార్గాలేమున్నాయి అంటే మొద‌ట గుర్తొచ్చేది మ్యూచువ‌ల్ ఫండ్స్ మాత్ర‌మే. ఈక్విటీ, డెట్ ఫండ్లు అని ర‌క‌ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో పెట్టుబ‌డి చేసే ముందు ఎంత రిస్క్ తీసుకోగ‌లం అన్న‌దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

కొన్ని పెట్టుబ‌డులు చాలా వేగంగా వృద్ధినిస్తాయి. మ‌రికొన్ని నిదానంగా వృద్ధి అవుతాయి. కానీ ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించి రాబ‌డిని అందించ‌గ‌లుగుతాయి. అన్నీ అంద‌రికీ అనుకూలం కాదు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ప్ర‌జా భ‌విష్య నిధి లాంటివి కూడా ఓ ర‌క‌మైన పెట్టుబ‌డి మార్గాలే. అన్ని పెట్టుబ‌డి మార్గాలు అంద‌రికీ అనుకూల‌మైన‌వి కావు. అత్య‌ధిక ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉన్న‌వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏమంత లాభ‌దాయ‌కం కాదు. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించి రాబ‌డి అందినా ఎక్కువ భాగం ప‌న్నుల‌కే వెచ్చించాల్సి వ‌స్తుంది. అదే మీరు అత్య‌ల్ప ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉన్న‌ట్ల‌యితే ఫిక్స్‌డ్ డిపాజిట్లు లాభ‌దాయ‌క‌మే.పొదుపు ఎక్కువ చేసి… పెట్టుబ‌డి త‌క్కువ చేస్తే…బ్యాంకు పొదుపు ఖాతాలో డ‌బ్బును పెట్టుకోవ‌డాన్ని సేవింగ్స్ కింద భావించాలే త‌ప్ప దాన్ని పెట్టుబ‌డిగా ప‌రిగ‌ణించ‌లేం. పొదుపు ఖాతాలోని సొమ్ముపై కొంచెం మాత్రమే వ‌డ్డీ వ‌స్తుంది. దాదాపు ఎలాంటి వృద్ధి లేన‌ట్టే లెక్క‌. ఎక్కువ‌గా పొదుపు చేసి, త‌క్కువ పెట్టుబ‌డి పెట్ట‌డం వ‌ల్ల సంప‌ద‌ను సృష్టించుకోలేం.

లిక్విడ్ ఫండ్స్ ఫ‌ర్వాలేదు కానీ…లిక్విడ్ ఫండ్స్ విజృంభ‌ణ‌తో, త‌క్ష‌ణ‌మే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును అందించే సౌక‌ర్యాల‌తో ఎన్నో మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు వినూత్న ప‌థ‌కాల‌ను అందిస్తున్నాయి. లిక్విడ్ ఫండ్స్‌తో పొదుపున‌కు కూడా కొంచెం ఆస‌రా ల‌భిస్తుంది. బ్యాంకు పొదుపు ఖాతాలో డ‌బ్బు ఉంచుకునే బ‌దులు ఇలా లిక్విడ్ ఫండ్స్‌ను ఉప‌యోగించ‌డం మంచిది. లిక్విడ్ ఫండ్స్ కూడా ఒక పొదుపు లాంటిదే. అది పెట్టుబ‌డి కాదు. సంప‌ద పోగ‌వ్వాలంటే ఈక్విటీ, డెట్ ఫండ్ల‌లో మీరు రిస్క్ తీసుకునే సామ‌ర్థ్యాన్ని బ‌ట్టి పెట్టుబ‌డుల‌ను ప్రారంభించాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని