డిస్కౌంట్ బ్రోకింగ్ vs రెగ్యుల‌ర్ బ్రోకింగ్

స్టాక్ మార్కెట్ లో రెగ్యుల‌ర్ మరియు డిస్కౌంట్ బ్రోక‌ర్లకు గ‌ల తేడాలు ఇవే...

Updated : 22 Dec 2020 15:12 IST

స్టాక్ మార్కెట్ లో రెగ్యుల‌ర్ మరియు డిస్కౌంట్ బ్రోక‌ర్లకు గ‌ల తేడాలు ఇవే

​​​​​​​టెక్నాల‌జీ ఏరంగాన్ని వ‌ద‌ల్లేదు అన్నిరంగాల్లోనూ విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు తీసుకొచ్చి ఆయా రంగాలు ప‌నిచేసే విధానంలో మార్పుల‌ను అనివార్యం చేసింది… సాంకేతిక ద్వారా ఆర్థిక సేవ‌ల రంగంలో దీని వ‌ల్ల క‌లిగిన ప్ర‌యోజ‌నాలు అనంతం. ఎక్క‌డికీ వెళ్ల‌కుండా కేవలం డాక్యుమెంట్ల‌ను నింపి, త‌గిన ప‌త్రాల‌ను ఆ సంస్థ‌ల చిరునామాకు పంపించ‌డం లేదా అందించ‌డం ద్వారా ఖాతా తెరిచే స‌దుపాయం ప్ర‌స్తుతం అందుబాటులో ఉంది.

స్టాక్ బ్రోకింగ్ సంస్థ‌లు

స్టాక్ మార్కెట్లో పెట్టుబ‌డి చేసేందుకు మ‌దుప‌ర్ల‌కు కావ‌ల్సిన డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతా సేవ‌ల‌ను అందించే వారిని స్టాక్ బ్రోక‌ర్లు అంటారు.ఈ బ్రోకింగ్ సంస్థ‌లు వినియోగ‌దారుల‌కు అవ‌స‌ర‌మ‌య్యే సేవ‌ల‌ను అందింస్తుంటాయి. అయితే ఈ సేవ‌ల్లో సాధార‌ణ‌, కొన్ని ప్ర‌త్యేక‌మైన సేవ‌లు కూడా ఉంటాయి.

2010 కి ముందు స్టాక్ మార్కెట్ల‌కు సంబంధించి సేవ‌లందించేందుకు రెగ్యుల‌ర్ స్టాక్ బ్రోక‌ర్లు మాత్ర‌మే ఉండేవారు. అప్ప‌టికి ఆన్ లైన్ లేదా డిస్కౌంట్ బ్రోక‌ర్లు లేరు. ప్ర‌స్తుతం రెగ్యుల‌ర్ బ్రోకింగ్ సంస్థ‌ల‌కు పోటాపోటీగా నిలుస్తున్నాయి.

డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థ‌లు

డిస్కౌంట్ బ్రోక‌ర్లను ఆన్‌లైన్ బ్రోక‌ర్లు అని కూడా అంటారు. సాధార‌ణ సేవ‌లు క‌ల్పించే డిస్కౌంట్ బ్రోక‌ర్లు త‌క్కువ రుసుం వ‌సూలు చేస్తారు . ఈ సంస్థ‌లందించే సేవ‌లు కూడా ప‌రిమితంగా ఉంటాయి. త‌క్కువ బ్రోక‌రేజ్ ఛార్జీల‌ను తీసుకోవ‌డం వీటి ద్వారా క‌లిగే లాభం.

రెగ్యుల‌ర్ బ్రోకింగ్ సంస్థ‌లు

పూర్తి సేవ‌లందించే బ్రోకింగ్ సంస్థ‌లు సాధార‌ణంగా పెద్ద సంస్థ‌లు. ప‌లు బ్రాంచీలు, సిబ్బంది క‌లిగి ఉంటుంది. వీటికి నిర్వ‌హ‌ణ వ్య‌యం అధికంగా ఉంటుంది. ఈ సంస్థ‌లందించే సేవ‌లు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. పెట్టుబ‌డుల‌కు సంబంధించి
ప‌లు ర‌కాలైన సేవ‌ల‌ను అందించ‌డం వీటి ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నంగా చెప్ప‌వ‌చ్చు.

ముందుగా బ్రోకింగ్ సంస్థ‌లందించే సాధార‌ణ, ప్ర‌త్యేక సేవ‌ల‌ను గురించి తెలుసుకుందాం.

సాధార‌ణ సేవ‌లు:

డీమ్యాట్ ఖాతా ట్రేడింగ్ ఖాతాల‌ను తెర‌వ‌డం.
ట్రేడింగ్ చేసేందుకు సాప్ట్ వేర్ స‌దుపాయం క‌ల్పించ‌డం, ఫోన్ ద్వారా ట్రేడింగ్ చేసే స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డం.

ప్ర‌త్యేక‌మైన సేవ‌లు:

పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్, ప్ర‌త్యేక ఆర్థిక సేవ‌లు, లీవ‌రేజ్ మొద‌లైన‌వి.
లీవ‌రేజ్: మ‌దుప‌ర్లు, ట్రేడింగ్ చేసే వారికి త‌మ వ‌ద్ద ఉన్న డ‌బ్బు కంటే ఎక్కువ మొత్తంలో షేర్ల‌ను కొనుగోలు చేసేందుకు ఈ సంస్థ‌లు అద‌నంగా నిధుల‌ను క‌ల్పించ‌డాన్ని లీవ‌రేజ్ అంటారు.

dvsr.png

  • త‌క్కువ బ్రోక‌రేజీ రుసుం వ‌సూలు చేస్తూ డిస్కౌంట్ బ్రోక‌ర్లు పూర్తి సేవ‌లందించే రెగ్యుల‌ర్ బ్రోక‌ర్ల‌కు కొత్త స‌వాళ్ల‌ను తీసుకొచ్చారు.

  • క‌నీస బ్రోక‌రేజ్ రుసుం విధించాల‌నే ప్ర‌తిపాద‌న‌ను సెబీ తోసిపుచ్చింది. బ్రోక‌రేజ్ రుసుం వ‌సూళ్లు మార్కెట్ లో జ‌రిగే పోటీ పై ఆధారంగా ఉండాలి. దానికి ప‌రిమితులు విధించ‌డం స‌బ‌బు కాద‌ని తేల్చి చెప్పింది. అయితే గ‌రిష్ఠ రుసుం మాత్రం 2.5 శాతానికి మించ‌కూడ‌ద‌నే నిబంధ‌న‌ను పెట్టింది.

  • సాధార‌ణంగా వీరు డెలివ‌రీ ట్రేడ్‌ ల‌కు 0.3 - 0.4 శాతం చొప్పున తీసుకుంటారు.

  • డిస్కౌంట్ బ్రోక‌ర్లు ట్రేడ్ చొప్పున వ‌సూలు చేస్తుంటారు. ట్రేడ్ కు రూ.20 నుంచి 30 వ‌ర‌కూ తీసుకుంటారు…

కొన్ని డిస్కౌంట్, పూర్తి సేవ‌లందించే బ్రోక‌రేజీ సంస్థ‌లు తీసుకునే ఛార్జీల‌ను కింది ప‌ట్టిక‌లో చూడ‌వ‌చ్చు.

BROKING.png

క‌చ్చితంగా ఇవే ఉంటాయ‌ని చెప్ప‌లేం. స‌మ‌యాన్ని బ‌ట్టి ఈ ఛార్జీలు మార‌వ‌చ్చు కాబ‌ట్టి మ‌దుప‌ర్లు ఈ విష‌యంలో స‌ద‌రు బ్రోక‌రేజీ సంస్థ‌లు సంప్ర‌దించి పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌డం మంచిది.

చివ‌ర‌గా…

కొత్త‌గా మార్కెట్లో ప్ర‌వేశం చేయాల‌నుకునే వారు రెగ్యుల‌ర్ బ్రోక‌ర్ల‌ను ఆశ్ర‌యించ‌డం మంచిది. వీరు మ‌దుప‌ర్ల‌కు త‌గిన సూచ‌న‌లు స‌ల‌హాలు అందిస్తారు. బ్రోకింగ్ సంస్థ నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను కోరుకోని వారు అనుభ‌వం ఉన్న మ‌దుప‌ర్లు ట్రేడ‌ర్లు డిస్కౌంట్ బ్రోక‌ర్ల‌ను ఎంచుకోవ‌చ్చు. బ్రోక‌ర్ల‌ను ఎంచుకునే ముందు మ‌దుప‌ర్లు వారి అవ‌స‌రాలు, ల‌క్ష్యాలు త‌దిత‌ర అంశాల ఆధారంగా నిర్ణ‌యం తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని