ప‌న్ను ఆదాకు ఏవి ఉత్త‌మం

ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డెట్ ఫండ్లు వేటిక‌వే ప్ర‌త్యేకం. పన్ను ఆదా ప్ర‌ణాళిక‌లో దేనికి రాచ‌కిరీటం.. పెట్టుబ‌డి మొద‌లుపెట్ట‌క ముందే వ‌చ్చే రాబ‌డిలో ఎంత ప‌న్నుగా పోతుందో ఎంత చేతికి అందుతుందో బేరీజు వేస్తుంటాడు ..

Published : 25 Dec 2020 18:47 IST

ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డెట్ ఫండ్లు వేటిక‌వే ప్ర‌త్యేకం. పన్ను ఆదా ప్ర‌ణాళిక‌లో దేనికి రాచ‌కిరీటం.. పెట్టుబ‌డి మొద‌లుపెట్ట‌క ముందే వ‌చ్చే రాబ‌డిలో ఎంత ప‌న్నుగా పోతుందో ఎంత చేతికి అందుతుందో బేరీజు వేస్తుంటాడు స‌గ‌టు మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవి. ఏ ప‌థకం త‌క్కువ ప‌న్నును ఆక‌ర్షిస్తుందో అని గాలం వేసి మ‌రీ వెతుకుతుంటారు కొంద‌రు. ఈ నేప‌థ్యంలో ఫిక్సిడ్ డిపాజిట్లు, డెట్ ఫండ్ల‌కు మ‌ధ్య వ్య‌త్యాసాల‌తో పాటు విడివిడిగా వాటి రాబ‌డి ,ప‌న్ను విధానం ఎలా ఉంటుందో చూద్దాం.

ఫిక్సిడ్ డిపాజిట్ (ఎఫ్ డీ) : కాల‌ప‌రిమితితో కూడిన న‌గ‌దు డిపాజిట్ల‌ను ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా పేర్కొంటారు. డిపాజిట్‌ సొమ్మును కాల‌ప‌రిమితి ముగిశాక వ‌డ్డీతో క‌లిపి చేతికందిస్తారు.

డెట్ ఫండ్ : మ‌్యూచువ‌ల్ ఫండ్ల‌లో డెట్ ఫండ్లు ఓ ర‌కం. డెట్ ఫండ్ల‌లో పెట్టే పెట్టుబ‌డిని మ్యూచువ‌ల్ ఫండ్ నిర్వాహ‌కులు కొన్ని ఎంపిక చేసిన స్థిర ఆదాయ పెట్టుబ‌డి మాధ్య‌మాల్లో (ఫిక్స్‌డ్ ఇన్‌క‌మ్ ఇన్ స్ట్రుమెంట్స్‌) లో ఉంచుతారు. డెట్ ఫండ్ల‌పై వ‌చ్చే ఆదాయాన్ని మ‌దుప‌ర్ల‌కు పంచుతారు.

రాబ‌డిలో తేడా
♦ ఫిక్సిడ్ డిపాజిట్లు కాల‌ప‌రిమితితో క‌చ్చిత‌మైన వ‌డ్డీతో రాబ‌డినిస్తాయి . డెట్ ఫండ్ల‌లో క‌చ్చిత‌మైన హామీ ఆదాయం ఉండ‌దు. ఫిక్సిడ్ డిపాజిట్ల‌ కంటే ఎక్కువ ఆదాయం డెట్ ఫండ్ల ద్వారా పొందే అవ‌కాశం ఉంటుంది. బాండ్ మార్కెట్ ప్ర‌గ‌తిపై డెట్ ఫండ్ల ప‌నితీరు ఆధార‌ప‌డి ఉంటుంది.
♦ ఫిక్సిడ్ డిపాజిట్ల‌ను మెచ్యూరిటీ తీర‌క‌ముందు ఉపసంహ‌రిస్తే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. డెట్ ఫండ్ల‌లో ర‌కాన్ని బ‌ట్టి కొంతకాలం త‌ర్వాత పెట్టుబ‌డిని ఏ విధ‌మైన నిష్క్ర‌మ‌ణ ఛార్జీలు లేకుండా ఉపసంహ‌రించ‌వ‌చ్చు. ఫండ్ ప్ర‌తిపాదిత‌ క‌నీస కాలానికి ముందే పెట్టుబ‌డిని వైదొల‌గించుకుంటే నిష్క్ర‌మ‌ణ ఛార్జీల భారం త‌ప్ప‌దు. ఇది సాధార‌ణంగా 1శాతం.
ఎఫ్ డీ, డెట్ ఫండ్లలో ప‌న్నువిధానం

♦ మూడుసంవ‌త్స‌రాల లోపు (స్వ‌ల్ప‌కాల‌ మూల‌ధ‌న) ఆదాయం పై వ్య‌క్తిగ‌త శ్లాబును అనుస‌రించి ప‌న్ను చెల్లించాలి. స్వ‌ల్ప‌కాలిక‌ మూల‌ధ‌న ఆదాయం పై ఫిక్సిడ్ డిపాజిట్లు, డెట్ ఫండ్ల‌లో ఒకేవిధంగా ప‌న్ను ఉంటుంది.
♦ దీర్ఘ‌కాల మూల‌ధ‌న ఆదాయం పై ఫిక్సిడ్ డిపాజిట్లలో వ్య‌క్తిగ‌త శ్లాబును బ‌ట్టి ప‌న్ను చెల్లించాలి. డెట్ ఫండ్ల‌లో మూడు సంవ‌త్స‌రాలు పైన (దీర్ఘ‌కాల‌ మూల‌ధ‌న) ఆదాయం పై ఇండెక్సేష‌న్ తో 20శాతం క‌లిపి చెల్లించాలి.
స్వ‌ల్ప‌కాల‌ మూల‌ధ‌నఆదాయం
ఉదాహర‌ణః రూ. 1 ల‌క్ష ఫిక్స్ డ్ డిపాజిట్ తో లేదా డెట్ ఫండ్ల‌లో మ‌దుపు చేసిన‌ట్ల‌యితే , ఏడాదికి రూ.10వేలు రాబ‌డి వ‌చ్చింద‌నుకుందాం.

ప‌న్ను చెల్లింపు ఆ వ్య‌క్తి స్లాబ్ రేటు బ‌ట్టి

♦ 10శాతం శ్లాబ్ లో ఉన్న‌వారికి 10,000@10%= రూ. 1000

♦ 20శాతం శ్లాబ్‌లో ఉన్న‌వారికి 10,000@20%= రూ. 2000

♦ 30శాతం శ్లాబ్‌ లో ఉన్న‌వారికి 10,000@30%= రూ. 3000

దీర్ఘ‌కాలిక మూలాధ‌న ఆదాయం
ఉదాహ‌ర‌ణ‌కు 2012-13లో ఫిక్స్డ్ డిపాజిట్లో మ‌దుపు చేస్తే 2015-16లో మెచ్యూరిటీ పూర్త‌యింద‌నుకుందాం. ఏటా వ‌చ్చే ఆదాయంపై వ్య‌క్తిగ‌త శ్లాబ్ ప్ర‌కారం ప‌న్ను చెల్లించాలి.

2012-13 లో డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల లో రూ. 1లక్ష‌ మ‌దుపుచేసి 2015-16 లో ఉప‌సంహ‌రిస్తే రూ. 1.3ల‌క్ష‌లు వ‌చ్చింద‌నుకుందాం. చివ‌రి ఏడాది లో ప‌న్ను చెల్లించ‌వ‌చ్చు. ఇండెక్సేష‌న్ తో క‌లిపి ఆదాయంలో 20 శాతం చెల్లించాలి.

డెట్ ఫండ్ల‌లో దీర్ఘ‌కాల మూల‌ధ‌న ఆదాయంపై ప‌న్ను త‌గ్గింపు విధానం
ఇండెక్సేష‌న్ ప్ర‌కారం పెట్టుబ‌డి విలువ‌ = 1,00,000 x (1081/852) = రూ. 1,26,877
(గ‌మ‌నిక: 2012-13 సంవ‌త్స‌రానికి ఇండెక్సేష‌న్ విలువ 852
2015-16 సంవ‌త్స‌రానికిగాను ఇండెక్సేష‌న్ విలువ 1081)

= రాబ‌డి - పెట్టుబ‌డి

= రూ. 1,30,000- రూ. 1,26,877

= రూ. 3,123

మూడేళ్లు, ఆ పైన‌ పెట్టుబ‌డుల విష‌యంలో ఫిక్సిడ్ డిపాజిట్ల కంటే డెట్ ఫండ్ల‌లో మ‌దుపుతో ప‌న్ను చెల్లింపులను త‌గ్గించుకోవ‌చ్చు.

♦ దీర్ఘ‌కాలిక మూలాధ‌న ఆదాయం ప‌న్ను చెల్లించాల్సిన‌ మొత్తం రూ. 3123

♦ మూల‌ధ‌న ఆదాయంపై 20% ఇండెక్సేష‌న్‌తో క‌లిపి ప‌న్ను లెక్కిస్తే… రూ. 3123@20%= రూ. 624.6 అవుతుంది. చెల్లించాల్సిన ప‌న్ను అయిదో వంతు త‌గ్గిన‌ట్టు అయ్యింది.

♦ డెట్ ఫండ్ల‌లో ఏ శ్లాబ్‌లో ఉన్న‌వారికైనా ఒకే ప‌న్ను విధానం వ‌ర్తిస్తుంది. ఫిక్సిడ్ డిపాజిట్లలో ప‌న్ను చెల్లింపుదారుని శ్లాబుని బ‌ట్టి నిర్ణ‌య‌మ‌వుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని