స్టాక్స్, మ్యూచువ‌ల్ ఫండ్స్ మ‌ధ్య వ్య‌త్యాసం ఏంటి?

మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డుల‌ను ఫండ్ మేనేజ‌ర్లు నిర్వ‌హిస్తారు కాబ‌ట్టి అంత‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఉండ‌దు....​

Published : 19 Dec 2020 14:15 IST

మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డుల‌ను ఫండ్ మేనేజ‌ర్లు నిర్వ‌హిస్తారు కాబ‌ట్టి అంత‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.​​​​​​​

స్టాక్ లేదా మ్యూచువ‌ల్ ఫండ్ రెండూ ఈక్విటీ పెట్టుబ‌డుల కింద‌కే వ‌స్తాయి. దీర్ఘ‌కాలిక పెట్టుబడుల‌కు ఇవి స‌రైన‌వి. ఎప్ప‌టిక‌ప్పుడు వీటిని స‌మీక్షించుకుంటుండాలి. స్టాక్ లేదా మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబడుల‌కు కొంత వ్య‌త్యాసం ఉంటుంది. అదేంటో తెలుసుకోవ‌డం ఒక సాధార‌ణ పెట్టుబ‌డిదారుడికి చాలా ముఖ్యం. అప్పుడే పెట్టుబ‌డుల విష‌యంపై ఒక నిర్ణ‌యం తీసుకోగ‌లుగుతారు.

అనిశ్చితి:

ఒకే స్టాక్‌లో లేదా అంత‌కంటే ఎక్కువ‌ స్టాకుల్లో పెట్టుబ‌డులు పెడితే ఉప‌సంహ‌ణ స‌మ‌యానికి విలువ‌లో చాలా వ్య‌త్యాసం ఉండొచ్చు. మార్కెట్ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఒక్కోసారి 20 శాతం రాబ‌డిని ఇవ్వొచ్చు లేదా 10 శాతం న‌ష్ట‌పోవ‌చ్చు. లాభం వ‌చ్చిన‌ప్పుడు సంతోషించాల్సిన విష‌య‌మే అయినా ఎప్పుడూ అలాగే ఉండ‌దు. న‌ష్ట‌పోయిన‌ప్పుడు స‌రైన నిర్ణ‌యం తీసుకోలేద‌న్న బాధ‌ క‌ల‌గ‌వ‌చ్చు.

మ‌రోవైపు మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల్లో పెట్టుబ‌డుల్లో వైవిధ్య‌త ఉండ‌టం వ‌ల్ల సాధార‌ణంగానే కొంత రిస్క్ త‌క్కువ‌నే చెప్పుకోవ‌చ్చు. ఈ పెట్టుబ‌డుల్లో ఒకేసారి 50-100 స్టాక్స్ క‌వ‌ర్ అవుతాయి. వివిధ రంగాల నుంచి వివిధ ర‌కాల షేర్లను పెట్టుబ‌డుల‌కు ఎంపిక చేస్తారు. మార్కెట్ల‌లో ఏదో ఉప‌ద్ర‌వం ఏర్ప‌డితే కానీ విలువ‌లో పెద్ద మార్పులేమీ ఉండ‌వు.

రాబ‌డి:

ఈక్విటీలలో నేరుగా పెట్టుబడులు పెట్టడం ద్వారా త్వరగా సంపన్నులు అయిన‌ట్లు చాలా క‌థ‌నాలు ఉన్నాయి. అయితే ఎప్పుడూ లాభాలే వ‌స్తాయ‌ని చెప్ప‌డం క‌ష్టం. మంచి రాబ‌డిని పొందేందుకు కొంత ఓర్పు, స‌హ‌నంతో పాటు పెట్టుబ‌డుల‌పై న‌మ్మ‌కం క‌లిగి ఉండాలి. స్టాక్ మార్కెట్ల గురించి అవ‌గాహన ఉన్న‌వారైతే కొంత రిస్క్ ఉన్నా ప‌ర్వాలేదు అనుకుంటే నేరుగా స్టాకుల్లో పెట్టుబ‌డులు పెట్టవ‌చ్చు.

స్టాక్స్‌తో పోల్చి చూడ‌క‌పోతే మ్యూచువ‌ల్ ఫండ్లు మంచి రాబ‌డినిస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. స్టాక్స్‌లో ఒక్కోసారి ఊహించలేని లాభాలు రావొచ్చు మ‌రోసారి భ‌రించ‌లేని నష్టాలు కూడా రావొచ్చు. కాని మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌రీ అంత మార్పు ఉండ‌దు. ఎందుకంటే పెట్టుబ‌డుల వైవిధ్య‌త ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి ఎప్పుడూ మంచి రాబ‌డినే ఆశించ‌వ‌చ్చు.

ప‌ర్య‌వేక్ష‌ణ‌:

స్టాక్ పెట్టుబ‌డులు అనేవి వ్య‌క్తిగ‌త‌మైన‌వి. అంటే సొంతంగా నిర్ణ‌యం తీసుకొని పెట్టుబ‌డులు పెట్టాల్సి ఉంటుంది. అమ్మ‌కం, కొనుగోలు అన్ని మీ చేతిలో ఉంటాయి. స్టాక్స్‌లో దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డులు కొన‌సాగించాల‌నుకుంటే ప్ర‌తీ త్రైమాసికానికి లేదా సంవ‌త్స‌రానికి స‌మీక్షించుకోవాలి. దేశ‌ ఆర్థిక ప‌రిస్థితులు, మార్కెట్ సంబందిత స‌మాచారంపై అవ‌గాహ‌న ఏర్ప‌రుచుకోవాలి.

మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డుల‌కు స్టాక్‌ల అంత ఎక్కువ‌గా ప‌ర్య‌వేక్ష‌ణ‌ అవ‌స‌రం లేదు. ఎందుకంటే మ్యూచువ‌ల్‌ ఫండ్ల నిర్వ‌హ‌ణ ఫండ్ మేనేజ‌ర్ల చేతిలో ఉంటుంది కాబ‌ట్టి వారు ఫండ్‌తీరును స‌మీక్షిస్తుంటారు. పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్ చేస్తారు. మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల్లో ఇది సానుకూలమైన అంశం. అయితే ఎక్కువ సార్లు పెట్టుబ‌డుల‌ను మారుస్తుండ‌టం కూడా అంత మంచిది కాదు.

సిప్ పెట్టుబ‌డులు:

స్టాకుల్లో సిప్ పెట్టుబ‌డులు మంచివి కావు. అయిన‌ప్ప‌టికీ కొన్ని కంపెనీలు సిప్ స‌దుపాయాన్ని క‌ల్పిస్తాయి కానీ, అది సానుకూలించే అంశం కాద‌నే చెప్పుకోవాలి. ప్ర‌త్యేక స్టాకులో సిప్ పెట్టుబ‌డులు లాభించ‌వు. సింగిల్ స్టాక్‌తో రిస్క్ కూడా ఉంటుంది. ఒక స్టాక్ కొన్ని నెల‌లు లేదా సంవ‌త్స‌రాలు న‌ష్టాల్లో కొన‌సాగ‌వ‌చ్చు. అదే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో అయితే స్టాక్ ప‌నితీరును బ‌ట్టి పెట్టుబ‌డుల‌ను మారుస్తారు.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ప్ర‌తి నెల కొంత మొత్తంతో సిప్ రూపంలో పెట్టుబ‌డులు చేయ‌వ‌చ్చ‌న్న సంగ‌తి తెలిసిందే. వేత‌న జీవుల‌కు ఈ పెట్టుబ‌డులు అనుకూలంగా ఉంటాయి. ఈక్విటీ మార్కెట్ల గురించి పూర్తిగా తెలియ‌న‌ప్ప‌టికీ దీర్ఘ‌కాలికంగా సిప్ పెట్టుబ‌డులు మంచి రాబ‌డినిస్తాయి.

పెట్టుబ‌డుల ప‌రిమితి:

స్టాక్ పెట్టుబ‌డులు కేవ‌లం స్టాక్స్‌కే ప‌రిమితం అవుతాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్ ఏది ఎంచుకున్నా ఈక్విటీ కింద‌కే వ‌స్తుంది. మ్యూచువ‌ల్ ఫండ్లు పెట్టుబ‌డులు మిశ్ర‌మంగా ఉంటాయి. ఈక్విటీ, డెట్‌, గోల్డ్, ఈక్విటీ-డెట్ ఇలా వైవిధ్యంగా ఉంటాయి. బ్యాలెన్స్‌డ్ ఫండ్లలో పెట్టుబ‌డులు కేటాయింపుల‌ను బ్యాలెన్స్ చేస్తాయి. అందుకే స్టాకుల‌తో పోలిస్తే మ్యూచువ‌ల్ ఫండ్లు మేలైన‌వి.

చివ‌ర‌గా…

కొన్ని స్టాక్‌లను క‌లిపితే మ్యూచువ‌ల్ ఫండ్లు అంటారు. అయితే స్టాకుల‌తోపోలిస్తే మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు వేరుగా ఉంటుంది. ఆ వ్య‌త్యాసం ఏంటో తెలుసుకొని ఎందులో పెట్టుబ‌డులు పెట్టాలో నిర్ణ‌యించుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని