Digital Payments: నెట్‌ లేకున్నా డిజిటల్‌ చెల్లింపులు.. ఎలా చేస్తారో తెలుసా?

టీ బిల్లు కట్టేందుకూ యూపీఐ వాడేస్తున్నాం. కిరాణా దుకాణాల్లోనూ ఇంతే. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా మొబైల్‌తో చెల్లించాలన్నా.. డెబిట్‌/కార్డు స్వైప్‌ చేయాలన్నా, ఇంటర్నెట్‌కు అనుసంధానం కావాల్సిందే. నెట్‌వర్క్‌ సరిగ్గా లేకపోతే, ఈ డిజిటల్‌ చెల్లింపులు.....

Updated : 13 Oct 2021 08:48 IST

ఫలించిన ఆర్‌బీఐ ప్రయోగాలు

త్వరలో దేశవ్యాప్తంగా అమల్లోకి

ఈనాడు - హైదరాబాద్‌

టీ బిల్లు కట్టేందుకూ యూపీఐ వాడేస్తున్నాం. కిరాణా దుకాణాల్లోనూ ఇంతే. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా మొబైల్‌తో చెల్లించాలన్నా.. డెబిట్‌/కార్డు స్వైప్‌ చేయాలన్నా, ఇంటర్నెట్‌కు అనుసంధానం కావాల్సిందే. నెట్‌వర్క్‌ సరిగ్గా లేకపోతే, ఈ డిజిటల్‌ చెల్లింపులు ఆలస్యం కావడమే కాదు.. ఒక్కోసారి బ్యాంకు ఖాతాలో నగదు కట్‌ అయినా, వ్యాపారికి చేరడం లేదు. ఈ విషయంలో వివాదాలు తప్పడం లేదు. దీనికి పరిష్కారంగా అసలు ఇంటర్నెట్‌ లేకున్నా, ఆఫ్‌లైన్‌ ద్వారానే డిజిటల్‌ చెల్లింపులు జరిపే పద్ధతిని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆవిష్కరించి, కొన్ని ప్రాంతాల్లో 2020 సెప్టెంబరు నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు ప్రయోగాత్మకంగా పరిశీలించింది కూడా. సంతృప్తికర ఫలితాలు రావడంతో, ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తోంది. ప్రయోగ దశలో ఈ చెల్లింపుల గరిష్ఠ పరిమితిని రూ.200గా చేశారు. అన్ని లావాదేవీల సగటు రూ.48గా ఉంది.  మొత్తం 2.41 లక్షల లావాదేవీల ద్వారా రూ.1.16 కోట్ల నగదు బదిలీ ఈ కొత్త పద్ధతిలో జరిగిందని సమాచారం.

ఎలా పనిచేస్తుంది?

ఆఫ్‌లైన్‌ లావాదేవీలను వినియోగించుకోవాలనుకునే వారికి బ్యాంకులు లేదా ఫిన్‌టెక్‌ సంస్థలు ప్రత్యేక కార్డు లేదా టోకెన్‌ ఇస్తాయి. ఇది డెబిట్‌ కార్డులాంటిదేనని చెప్పొచ్చు. నిర్ణీత మొత్తంలో చెల్లించాలని అనుకున్నప్పుడు.. ఈ కార్డును వాడుకోవచ్చు. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) తరహాలో ఉండే ప్రత్యేక యంత్రం ద్వారా ఆ చెల్లింపును నమోదు చేస్తారు. సాధారణంగా పీఓఎస్‌ యంత్రానికీ నెట్‌ అనుసంధానం ఉండాలి. కానీ, ఈ ప్రత్యేక పీఓఎస్‌ మెషిన్‌కు ఇంటర్నెట్‌ అవసరం ఉండదు. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చినప్పుడు వ్యాపారి ఈ యంత్రాన్ని అనుసంధానిస్తే, ఆయా చెల్లింపులన్నీ ఒకేసారి ప్రాసెస్‌ అవుతాయి. అంతేకాదు.. వాయిస్‌ బేస్డ్‌ చెల్లింపులనూ ఈ పద్ధతిలో చేసే వీలుంటుంది. ఐవీఆర్‌ ద్వారా సూచనలు ఇచ్చి, చెల్లింపులను పూర్తి చేయొచ్చు.

ఫిన్‌టెక్‌ సంస్థలకు ప్రోత్సాహంగా

దేశంలో డిజిటల్‌ చెల్లింపుల్లో ఫిన్‌టెక్‌ అంకురాలు ఎంతో ఆసక్తిగా పనిచేస్తున్నాయి. ఆఫ్‌లైన్‌ చెల్లింపుల విధానం అమల్లోకి వస్తే.. వీటికి మంచి అవకాశం లభించినట్లే. ఇప్పటికే ఈ విభాగంలో కొన్ని సంస్థలు ప్రయోగాలు ప్రారంభించాయి. ప్రత్యేకంగా కార్డులు జారీ చేయడంతో పాటు, యంత్రాలను రూపొందించడం, వాటిని ఇంటర్నెట్‌ సరిగా రాని ప్రాంతాలు, ముఖ్యంగా కొండ ప్రాంతాలు, పర్యటక ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు భారీ అవకాశాలు లభిస్తాయి. ఎన్‌ఎఫ్‌సీ (నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌) కార్డుల వాడకం కోసం ప్రత్యేక ఏర్పాట్లూ ఫిన్‌టెక్‌ సంస్థలకు సరికొత్త వ్యాపారావకాశాలను సృష్టించే వీలుంది.

సాధ్యమేనా?

ఇంటర్నెట్‌ అవసరం లేకుండా నగదు బదిలీ సేవలు కొత్తేమీ కాదు. దాదాపు దశాబ్దం కిందే.. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ విధానాన్ని ప్రవేశ పెట్టింది. సాధారణ ఫోన్‌ ఉన్నవారూ.. అన్‌స్ట్రక్చర్డ్‌ సప్లిమెంటరీ సర్వీసెస్‌ డేటా (యూఎస్‌ఎస్‌డీ)తో పనిచేసే.. *99H కు ఫోన్‌ చేయడం ద్వారా, సంక్షిప్త సందేశాల రూపంలో (ఎస్‌ఎంఎస్‌) బ్యాంకు లావాదేవీలను నిర్వహించే వీలును తీసుకొచ్చింది. యూఎస్‌ఎస్‌డీ ద్వారా బ్యాంకు ఖాతా నిల్వ తెలుసుకోవడం, నగదు బదిలీ చేయడం నిర్వహించుకోవచ్చు. ఇందుకు నెట్‌ అవసరం లేదు. కాబట్టి, ఆఫ్‌లైన్‌లో నగదు చెల్లింపు లావాదేవీలు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. చిన్నమొత్తం చెల్లింపులను సులభంగా, ఎలాంటి అంతరాయం లేకుండా చేసేందుకు వీలు కల్పిస్తుందంటున్నారు.

జాగ్రత్త అవసరమే..

సైబర్‌ నేరాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆఫ్‌లైన్‌ కార్డులతో మరింత అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. నోటిమాటతోనూ (వాయిస్‌) చెల్లింపులను చేసే అవకాశం ఉండటంతో జాగ్రత్త తప్పదని అంటున్నారు. అయితే, చెల్లింపులకు జియోట్యాగింగ్‌ చేయడంలాంటి వాటివల్ల వీటికి అడ్డుకట్ట వేసే వీలుందని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని