బంగారం, స్థిరాస్తిపై ఎక్కువ పెట్టుబడులు పెట్టడం మంచిదేనా?

మీ పెట్టుబ‌డులు తిరిగి అధిక లాభాలు వ‌చ్చే విధంగా ఉండ‌టంతో పాటు లిక్విడిటీ, ప‌న్ను మిన‌హాయింపులు క‌లిగి ఉండే విధంగా చూసుకోవాలి.  

Updated : 06 Aug 2021 18:42 IST

మొద‌టి ఇల్లును కొనుగోలు చేయ‌డం లేదా త‌మ‌కు ఇష్ట‌మైన ఆభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేయ‌డం భావోద్వేగాల‌కు సంబంధించిన విష‌యం. పెట్టుబ‌డులు ప్రారంభించేట‌ప్పుడు రాబ‌డి, రిస్క్‌, లిక్విడిటీ, ప‌న్ను వంటి వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. అయితే బంగారం, స్థిరాస్తి పెట్టుబ‌డుల విష‌యంలో అయితే ఇవేమి ఉండ‌వు. కొన్ని సంద‌ర్భాల‌లో భావోద్వేగాల‌తో తీసుకునే నిర్ణ‌యాల‌తో ఇత‌ర అంశాల‌ను ప‌ట్టించుకోరు. అదేవిధంగా బంంగారం, స్థిరాస్తి పెట్టుబ‌డులు ఎప్ప‌టికీ మంచివే అనే ఒక న‌మ్మ‌కంతో ఉంటారు. అందుకే ఈ పెట్టుబ‌డుల‌పై ఎక్కువ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. కానీ, ఇవి కొంత రిస్క్‌తో కూడుకొని ఉంటాయి. దీర్ఘ‌కాలంలో త‌క్కువ రిట‌ర్నుల‌ను ఇవ్వ‌డ‌మే కాకుండా, లిక్విడిటీ స‌మ‌స్య‌లు కూడా ఉంటాయి. అంటే పూర్తిగా ఈ పెట్టుబ‌డుల‌కు దూరంగా ఉండాల‌ని ఇక్క‌డ ఉద్దేశం కాదు కానీ,  ఎక్కువ మొత్తంలో వాటికే కేటాయించ‌కుండా పెట్టుబ‌డుల‌ను స‌మ‌తుల్యం చేసుకుంటే మంచిదని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.

బంగారం, స్థిరాస్తులు

బంగారం ద్ర‌వ్యోల్బ‌ణానికి అనుగుణంగా ఉంటుంది. కానీ,  దీనిపై ఎలాంటి డివిడెండు లేదా వ‌డ్డీ ల‌భించ‌దు. అంత‌ర్జాతీయంగా క‌మొడిటీ , చ‌మురు, డాల‌ర్‌పై ఆధార‌ప‌డి ధ‌ర‌లు మారుతుంటాయి. వీటిని సాధార‌ణ పెట్టుబ‌డుదారులు అంత‌గా ప‌ట్టించుకోరు. స్థిరాస్తి పెట్టుబ‌డుల్లో లిక్విడిటీ స‌మ‌స్య‌లు, లావాదేవీలు రుసుములు అధికంగా ఉంటాయి. దీంతోపాటు రిజిస్ట్రేషన్‌, ఆక్ర‌మ‌ణ‌లు వంటి స‌మ‌స్యలు ఉంటాయి. అయితే ఈ పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే రాబ‌డిని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. స్థిరాస్తి పెట్టుబ‌డుల‌పై దీర్ఘ‌కాలిక రాబ‌డి, మార్కెట్ల‌లో వ‌చ్చే రాబ‌డి కంటే త‌క్కువగా ఉంటుంది. బంగారం పెట్టుబ‌డుల‌ను కూడా ఇదేవిధంగా చూడ‌వ‌చ్చు. బంగారంతో పోలిస్తే స్థిరాస్తి పెట్టుబ‌డుల‌పై కొంత ఎక్కువ రాబ‌డి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. గ‌త ఐదేళ్లుగా చూస్తే ఈ రెండు ద్ర‌వ్యోల్బ‌ణానికి మించి రాబ‌డిని అందిస్తున్నాయి. 

రిస్క్‌: రిట‌ర్నుల‌ను ప‌క్క‌న‌బెడితే బంగారం పెట్టుబ‌డుల్లో రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది. దీనిని కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపుతారు. కానీ, అమ్మేందుకు వెన‌కాడుతారు. బంగారం, స్థిరాస్తి ఉంటే ఎప్ప‌టికైనా మంచిదే అని భావిస్తారు. దీంతో కేవ‌లం  పెట్టుబ‌డులు పెట్టి వ‌దిలేయ‌డంతో రాబ‌డి ఎక్కువ‌గా ఉండ‌దు. ఇది పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక‌కు పూర్తి విరుద్ధం అని చెప్పుకోవాలి.

పెట్టుబ‌డుల వైవిధ్య‌త: దీంతో పాటు ఈ ర‌క‌మైన పెట్టుబ‌డుల‌తో ఆర్థిక లక్ష్యాలు కూడా దెబ్బ‌తింటాయి. ఇత‌ర పెట్టుబ‌డుల‌కు త‌గినంత కేటాయించ‌లేక‌పోవ‌చ్చు. స్థిరాస్తిలో ఎక్కువ పెట్టుబ‌డులు పెడితే ఇత‌ర ముఖ్య‌మైన అవ‌స‌రాలు అంటే పిల్ల‌ల చ‌దువు, ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం కేటాయించేందుకు స‌రిపోక‌పోవ‌చ్చు. అవి పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక‌లో ఉండే చాలా ముఖ్య‌మైన అంశాలు. దీంతోపాటు అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఈ పెట్టుబ‌డులు ఉప‌యోగ‌ప‌డ‌వు.

ఆస్తుల కేటాయింపు: స్థిరాస్తులు, బంగారంలో ఎక్కువ‌ పెట్టుబ‌డుల‌తో మంచి కంటే చెడే ఎక్కువ‌గా క‌నిపిస్తుంద‌ని చెప్పుకోవ‌చ్చు. మీ పోర్ట్‌ఫోలియోలో ఈ పెట్టుబ‌డులు ఎన్ని ఉన్నాయో ఒక‌సారి చూసుకోండి. రిస్క్‌, ఆర్థిక లక్ష్యాల ఆధారంగా పెట్టుబ‌డులు పెట్టాలి. బంగారం, స్థిరాస్తి  పెట్టుబ‌డుల‌ను ప‌రిమితం చేయాలి. ప్ర‌ణాళికలో అన్ని స్థిరాస్థి, బంగారంతో పాటు ఇత‌ర పెట్టుబ‌డులు ఉంటేనే అనుకున్న ల‌క్ష్యాల‌ను సాధించ‌గ‌ల‌రు. 

ఫోర్ట్‌ఫోలియోలో స్థిరాస్తి పెట్టుబ‌డుల‌కు చివ‌రి స్థానం క‌ల్పించాలి. స్థిరాస్తి కొనుగోలుతో పాటు నిర్వ‌హ‌ణ‌, విక్ర‌యం కూడా క‌ష్టంగానే ఉంటుంది. ఇందులో లిక్విడిటీ ఉండ‌దు. లావాదేవీల వ్య‌యాలు, ప‌న్ను వంటివి రాబ‌డిని త‌గ్గిస్తాయి. రూ.5 కోట్ల కంటే త‌క్కువ పోర్ట్‌ఫోలియోలో స్థిరాస్తి పెట్టుబ‌డులు అవ‌స‌రం లేద‌ని నిపుణులు చెబుతున్నారు.  పోర్ట్‌ఫోలియోలో 20-40 శాతం స్థిరాస్తి పెట్టుబ‌డుల‌కు కేటాయించాలి. బంగారం పెట్టుబ‌డులు కూడా 5-10 శాతం మించ‌కుండా చూసుకోవాల‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ద్ర‌వ్యోల్బ‌ణానికి మించి రాబ‌డి ఇస్తుంది కాబ‌ట్టి బంగారం కోసం కొంత కేటాయించాలి. అయితే స్థిరాస్తి పెట్టుబ‌డులు రియ‌ల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ (రైట్స్‌), బంగారం పెట్టుబ‌డులు ఈటీఎఫ్‌, సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల ద్వారా పెట్ట‌డం మంచిది. రైట్స్ పెట్టుబ‌డుల్లో ఎక్కువ మొత్తంలో న‌గ‌దు అవ‌స‌రం ఉండ‌దు. క‌నీస పెట్టుబ‌డిని ఇటీవ‌ల రూ.2 ల‌క్ష‌ల నుంచి రూ.50 వేల‌కు త‌గ్గించారు.

అదేవిధంగా బాండ్లు, ఈటీఎఫ్‌ల ద్వారా బంగారం పెట్టుబ‌డులు ప‌న్ను త‌క్కువ‌గా ఉంటుంది. మీ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ‌గా స్థిరాస్తి, బంగారం పెట్టుబ‌డులు ఉన్న‌ట్ల‌యితే వాటిని సరిచూసుకోండి. రెండో ఇల్లు కొనుగోలు చేయ‌డం లేదా బంగారం కొనుగోలు చేయ‌డం ఆర్థికంగా ధైర్యాన్ని ఇస్తుంది కాని దానిపై ఎటువంటి రాబ‌డి రాదు అన్న విష‌యం గుర్తుంచుకోండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని