స్పెక్ట్రమ్‌ను హామీగా పరిగణించొద్దు

రుణ ఊబిలో కూరుకుపోయి దివాలా పరిష్కార ప్రక్రియ ఎదుర్కొంటున్న టెలికాం సంస్థలు ప్రభుత్వానికి స్పెక్ట్రమ్‌ వినియోగ చెల్లింపులు చేయకుండా, తమ వద్ద ఉన్న స్పెక్ట్రమ్‌ను హక్కుగా పొందలేవని జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) పేర్కొంది. పలు టెలికాం కంపెనీలు దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.

Published : 14 Apr 2021 01:45 IST

 ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పు

దిల్లీ: రుణ ఊబిలో కూరుకుపోయి దివాలా పరిష్కార ప్రక్రియ ఎదుర్కొంటున్న టెలికాం సంస్థలు ప్రభుత్వానికి స్పెక్ట్రమ్‌ వినియోగ చెల్లింపులు చేయకుండా, తమ వద్ద ఉన్న స్పెక్ట్రమ్‌ను హక్కుగా పొందలేవని జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) పేర్కొంది. పలు టెలికాం కంపెనీలు దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.  సహజవనరు అయిన స్పెక్ట్రమ్‌ను రుణదాతలు హామీగా పరిగణించరాదని ముగ్గురు సభ్యులతో కూడిన ట్రైబ్యునల్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన లైసెన్సు కింద స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునే హక్కు టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్‌కు ఉన్నప్పటికీ.. అది వినియోగానికే పరిమితమని, యాజమాన్య హక్కుగా చెప్పరాదని ఎన్‌సీఎల్‌ఏటీ తెలిపింది. దివాలా చట్టంలోని సీఐఆర్‌పీ కింద బకాయిలు చెల్లించకుండా స్పెక్ట్రమ్‌ను వినియోగించరాదని ఎన్‌సీఎల్‌ఏటీ తాత్కాలిక ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ బీఎల్‌ భట్‌ పేర్కొన్నారు.


రూట్‌ మొబైల్‌ సర్వర్లు హ్యాక్‌!
వినియోగదార్ల డేటా భద్రమే: కంపెనీ

దిల్లీ: రూట్‌ మొబైల్‌కు చెందిన సర్వర్లపై హ్యాకర్లు దాడి చేశారని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు. అయితే కంపెనీ మాత్రం తమ వినియోగదార్ల డేటా భద్రంగా ఉందని.. తమ సైబర్‌ సెక్యూరిటీ బృందం ఈ విషయంపై దర్యాప్తు చేపడుతోందని చెబుతోంది. సైబర్‌ భద్రతా నిపుణుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. రూట్‌ మొబైల్‌ సర్వర్లు హ్యాకింగ్‌కు గురి కావడం వల్ల టాటా కమ్యూనికేషన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, డీబీఎస్‌ బ్యాంకుల డేటా లీక్‌ అయింది. సైబర్‌ థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ పైఫై టెక్నాలజీస్‌ ప్రకారం..‘టాటా కమ్యూనికేషన్స్‌ డేటా లీక్‌ అయిందని సైబర్‌ నేరగాళ్లు అంటున్నారు. కంపెనీ సర్వర్లలోని 50 జీబీకి పైగా డేటాను డార్క్‌నెట్‌ ఫోరమ్స్‌లో వారు అమ్మకానికి పెట్టార’ని అంటోంది. టాటా కమ్యూనికేషన్స్‌ నుంచి డేటా లీక్‌ అయినట్లు కనిపించడం లేదని..ఆ కంపెనీ సాంకేతిక వెండార్‌ రూట్‌ మొబైల్‌ నుంచే అది జరిగిందని సైబర్‌ భద్రతా పరిశోధకుడు రాజ్‌శేఖర్‌ రాజాహరియా పేర్కొన్నారు. కాగా, ‘టాటా కమ్యూనికేషన్స్‌కు కానీ, మా వినియోగదార్లకు కానీ ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. అయితే మా అంతర్జాతీయ భద్రత బృందం దీనిపై దర్యాప్తు చేస్తోంది. వినియోగదార్ల భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యత గల అంశమ’ని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ఈ వార్తలను మేం తీవ్రంగా తీసుకుంటున్నారు. థర్డ్‌ పార్టీ సైబర్‌ సెక్యూరిటీ కన్సల్టెంట్‌ను నియమించాం. స్వతంత్రంగా తనిఖీ చేసి మా దర్యాప్తును ఆడిట్‌ చేస్తుంద’ని రూట్‌ మొబైల్‌ తెలిపింది. కాగా, ఈ విషయంపై భారతీ ఎయిర్‌టెల్‌, డీబీఎస్‌ బ్యాంకులు ఇంకా స్పందించలేదు.
యువ నిపుణుల కోసం హీరో వైర్డ్‌
దిల్లీ: పరిశ్రమకు అవసరమయ్యే నైపుణ్యాలను యువతకు అందించడం కోసం కొత్త ఎడ్యుటెక్‌ కంపెనీ ‘హీరో వైర్డ్‌’ను హీరో గ్రూప్‌ ప్రకటించింది. ఈ కోర్సుల కోసం మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ), సింగులారిటీ యూనివర్సిటీ సహా అగ్రగామి యూనివర్సిటీలతో హీరో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని కోసం ముంజాల్‌ కుటుంబం 10 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.75 కోట్ల)కు పై పెట్టుబడులు పెట్టనుంది. ‘వర్చువల్‌, విద్య. ఈ రెండు పదాల సమ్మేళనమే వైర్డ్‌. బోధనకు భవిష్యత్‌ హీరో వైర్డ్‌ అని విశ్వసిస్తున్నాం. దేశంలో ఉన్న నైపుణ్యాల కొరతకు ఇది పరిష్కారం కానుంది. పెద్ద చదువులు పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన వారి కొరత ఉంది’ అని హీరో వైర్డ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ అక్షయ్‌ ముంజాల్‌ పేర్కొన్నారు. ఫైనాన్స్‌, సంబంధిత టెక్నాలజీలు, డేటా సైన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, కృత్రిమ మేధ, పుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌, గేమ్‌ డిజైన్‌, ఎంటర్‌ప్రెన్యూరల్‌ థింకింగ్‌, ఇన్నోవేషన్‌ల్లో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను హీరో వైర్డ్‌ అందించనుంది. కోర్సును బట్టి ఫీజులు రూ.2.5- 5 లక్షలుగా ఉంటాయి. రెండు కోర్సులు ఈ ఏడాది జులైలో, మిగతా కోర్సులను క్రమంగా ప్రారంభిస్తామని ముంజాల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు