కొవిడ్‌ త‌ర్వాత గృహ‌ కొనుగోలుదారులు ఎలాంటి సౌక‌ర్యాలు కోరుకుంటున్నారు?

కోవిడ్ స‌మయంలో ఎదురైన స‌మ‌స్య‌ల‌తో గృహ‌ కొనుగోలుదారుని ఆలోచనా విధానం, ప్రాధాన్య‌త‌లు మారాయ‌ని చెప్తున్నారు నిపుణులు.

Updated : 29 Nov 2021 18:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్ స‌మయంలో పిల్లలు, పెద్దలు అంద‌రూ నెల‌ల త‌ర‌బ‌డి ఇళ్ల‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. అధిక సంఖ్య‌లో ప్ర‌జ‌లు కొవిడ్ బారిన ప‌డ‌డంతో ఆసుప్ర‌తులలో బెడ్ దొర‌క‌డం చాలా క‌ష్ట‌మైంది. చాలామంది ఇళ్ల వ‌ద్దే హోమ్ క్వారెంటైన్‌లో ఉండి, వైద్యుల స‌లహా మేర‌కు మెడిసిన్ వాడుతూ త‌గిన జాగ్ర‌త్త‌లతో కొవిడ్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే ఆ స‌మ‌యంలో ఇంటిలో త‌గిన స‌దుపాయాలు లేక చాలా ఇబ్బందులు ప‌డ్డారు. కొవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం సామాజిక దూరం పాటించ‌డం చాలా ముఖ్యం. కార్యాల‌యాల్లో స్థ‌లం త‌క్కువ ఉంటుంది...  కాబ‌ట్టి ఉద్యోగుల ఆరోగ్య భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని చాలా వ‌ర‌కు సంస్థ‌లు వారి ఉద్యోగులకు ఇంటి నుంచే ప‌నిచేసే స‌దుయాన్ని క‌ల్పించాయి. కొన్ని సంస్థ‌లు శాశ్వ‌త వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను ప్ర‌క‌టించాయి. అలాగే పిల్ల‌ల చ‌దువు విష‌యంలో పాఠశాల‌ల‌ యాజ‌మాన్యం, త‌ల్లిదండ్రులు కూడా ఆన్‌లైన్ క్లాసుల వైపే మ‌గ్గుచూపారు. కానీ నెల‌ల త‌ర‌బ‌డి ఇంటి నుంచి ప‌నిచేయాలంటే త‌గిన సౌక‌ర్యాలు ఉండాలి. ప‌నిచేసే చోట, ఆన్‌లైన్ క్లాసులు జ‌రుగుతున్న చోట‌ త‌గినంత వెలుతురు, అలాగే కూర్చునేందుకు త‌గిన ఏర్పాట్లు చేసుకోవాలి. లేదంటే క‌ళ్ల స‌మ‌స్య‌లతో పాటు ఇత‌ర ఆరోగ్య (మెడ, న‌డుము నొప్పి వంటి) స‌మ‌స్య‌లు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీంతో ఇంటి వ‌ద్దే ఆఫీస్ సెట‌ప్ ఏర్పాటు చేసు కుంటున్నారు. కొత్త‌గా ఇల్లు కొనుగోలు చేస్తున్న‌వారు ఇలాంటి సౌక‌ర్యాలు ఉన్న ఇంటి కోసం చూస్తున్నారు.

ప్ర‌స్తుతం స‌మాజంలో చోటు చేసుకున్న మార్పుల‌ను దృష్టిలో ఉంచుకుని కొనుగోలుదారుల అవ‌స‌రాలు, అభిరుచుల‌కు త‌గిన‌ట్లుగా ఆధునిక‌త‌ను జోడించి అద్భుత‌మైన ఆర్కిటెక్చ‌ర్‌తో గృహాల‌ను నిర్మిస్తున్నారు డెవ‌ల‌ప‌ర్లు. కొవిడ్ తర్వాత రియ‌ల్ ఎస్టేట్‌ వృద్ధి కోసం ‘న్యూ ఏజ్ ఆఫ్ లైఫ్’  డెవ‌ల‌ప‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఫ‌లితంగా ప్రాజెక్టుల రూప‌క‌ల్ప‌న‌, నిర్మాణంలో భారీ మార్పులు వ‌చ్చాయి. 

కొత్త‌గా కొనుగోలు చేసేవారు ఇంటిలో ఎలాంటి స‌దుపాయాలు కోరుకుంటున్నారు?
క‌మ్యూనిటీ బిల్డింగ్‌, ఓపెన్ స్పేస్‌: క్లబ్ హౌస్, కమ్యూనిటీ జోన్ విలాస‌వంతమైన గృహ ప్రాజెక్టుల్లో మాత్ర‌మే క‌నిపించేవి. కానీ ఇప్పుడు ప‌రిస్థ‌తి మారింది. మ‌ధ్య త‌ర‌గ‌తి, ఎగువ మ‌ధ్య త‌ర‌గ‌తి వారు కూడా ఇలాంటి సౌక‌ర్యాలు కోరుకుంటున్నారు. ప్రజలు తమ త‌మ ఇళ్ల‌లోనే ఉండాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తిన‌ప్పుడు, గృహంలో మెరుగైన సౌక‌ర్యాలు ఉంటే.. శారీరక, మాన‌సిక ఆరోగ్యం రెండూ చ‌క్క‌గా ఉంటాయ‌ని న‌మ్ముతున్నారు. ఇలాంటి భావోద్వేగ అంశాలను పెంపొందించే వ్యాయామశాల, ఆట ప్ర‌దేశం, లైబ్రరీ, మెంట‌ల్ వెల్‌నెస్ జోన్‌ వంటి మౌలిక సదుపాయాల కోసం గృహ‌ కొనుగోలుదారులు చూస్తున్నారు. లాన్‌, ఓపెన్‌ స్పేస్‌ వంటివి పెద్దలకు, ఆట స్థ‌లం పిల్ల‌ల‌కు తాజాద‌నాన్ని అందిస్తాయి. కానీ ఇలాంటివి నివాస ప్రాజెక్టుల‌లో అరుదుగా క‌నిపించే అంశాలు. ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చే ప్రాజెక్టుల‌లో ఇలాంటి అంశాల ప‌ట్ల శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు డెవ‌ల‌ప‌ర్లు.

స్థిర‌త్వం, ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ‌: ప్ర‌స్తుతం చాలామంది ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌ల‌గ‌కుండా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. స్థిరత్వంతోపాటు, ప‌ర్యావ‌ర‌ణ సంర‌క్ష‌ణ‌ను దృష్టిలో ఉంచుకుంటున్నారు. రియ‌ల్ ఎస్టేట్ రంగం ఇందుకు భిన్నం కాదు. నిర్మాణ ద‌శ నుంచి స్థిర‌మైన ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రించే గృహాల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. ఈవీ ఛార్జింగ్‌లు, కార్బన్ మోనాక్సైడ్ సెన్సార్, సోలార్ ప్యానెల్‌లు, శక్తిని ఆదా చేసే బల్బులు, కార్బన్ ఫుట్ ప్రింట్‌ను తగ్గించే ఎలివేటర్‌లను ఎంచుకుంటారు. స‌రైన ఇంటిని ఎంచుకోవ‌డంలో భారీ వ్యత్యాసాన్ని చూపే చిన్న చిన్న అంశాలు ఇవే.

భద్రత‌, శ్రేయస్సు కోసం: కొత్త‌గా ఇంటిని కొనుగోలు చేసేవారు త‌మ కుటుంబ స‌భ్యుల శ్రేయ‌స్సు కోసం సుర‌క్షిత‌మైన‌, ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణాన్ని కోరుకుంటున్నారు. ఇల్లు ఎంట్రీ పాయింట్ ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తి చిన్న విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. టచ్‌లెస్ ఎంట్రీ సిస్టమ్‌లు, ఎలివేటర్, టెంపరేచర్ స్క్రీనింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటివి కామ‌న్ ఏరియాను సుర‌క్షితం చేస్తాయి. అందువ‌ల్ల ఇంటి ఎంపిక‌లో ఈ సౌక‌ర్యాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.

ప్ర‌దేశం: ఇంటి కొనుగోలు కోసం ప్ర‌దేశాన్ని నిర్ణ‌యించే ముఖ్య‌మైన అంశం ప్ర‌జా ర‌వాణా సౌక‌ర్యాలు. రోడ్డు, రైలు, వాయు ప్ర‌యాణ మార్గాలు అందుబాటులో ఉన్న ప్ర‌దేశాల‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలాగే ఆరోగ్య స‌దుపాయాలు, రిటైల్ సేవ‌లు, రెస్టారెంట్లు ఇంటి ద‌గ్గ‌ర‌లో ఉండాలి. ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు అన్ని సామాజిక‌, ఇత‌ర సౌక‌ర్యాలను అందించే ప్రాజెక్టుల కోసం చూస్తున్నారు. అలాంటి చోట ఇంటి కోసం అధిక విలువ చెల్లించేందుకూ సిద్ధ‌ప‌డుతున్నారు.

కొవిడ్ స‌మయంలో ఎదురైన స‌మ‌స్య‌ల‌తో గృహ‌ కొనుగోలుదారుని ఆలోచనా విధానం, ప్రాధాన్య‌త‌లు మారాయి. వాటికి త‌గిన‌ట్లు డెవల‌ప‌ర్లు వారి ప్రాజెక్టుల నిర్మాణంలో మార్పులు చేస్తున్నారు. ఆధునిక స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో రియ‌ల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని