Apple: యాపిల్‌ ఆదాయంలో భారత్‌ వాటా ఎంతో తెలుసా?

భారత్‌లో యాపిల్‌ వ్యాపారం వృద్ధి చెందుతున్నప్పటికీ.. సంస్థ మొత్తం ఆదాయంలో మన దేశ వాటా ఇంకా నామమాత్రంగానే ఉందని విశ్లేషకులు అంటున్నారు....

Published : 01 Nov 2021 15:12 IST

దిల్లీ: సెప్టెంబరు త్రైమాసికంలో తమ సంస్థ ఆర్జించిన ఆదాయాల్లో మూడో వంతు వర్థమాన దేశాల నుంచే వచ్చినట్లు యాపిల్‌ తెలిపింది. భారత్‌, వియత్నాంల్లో తమ వ్యాపారం రెట్టింపైందని కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ స్వయంగా వెల్లడించారు. 2021 సెప్టెంబరు 25తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఆపిల్‌ ఆదాయం 29 శాతం వృద్ధితో 8,340 కోట్ల డాలర్లకు (సుమారు రూ.6,25,000 కోట్లు) చేరింది. నికర లాభం కూడా 1,267 కోట్ల డాలర్ల నుంచి 2,055 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,54,000 కోట్లు) పెరిగింది.

అయితే, భారత్‌లో యాపిల్‌ వ్యాపారం వృద్ధి చెందుతున్నప్పటికీ.. సంస్థ మొత్తం ఆదాయంలో మన దేశ వాటా ఇంకా నామమాత్రంగానే ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఇది కంపెనీకి అవకాశమని కూడా తెలిపారు. సంస్థ ఆదాయంలో భారత్‌ వాటా ఇంకా 1 శాతం కంటే తక్కువే ఉందని.. ఇది వ్యాపార విస్తరణకు ఓ సదావకాశమని అభిప్రాయపడ్డారు. 2021 సెప్టెంబరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం నికర విక్రయాలు 36,580 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. అంటే రోజుకు ఒక బిలియన్‌ డాలర్ల విక్రయాలన్నమాట! కానీ, ఇందులో భారత్‌ వాటా 0.9 శాతం మాత్రమే. అయితే, 2020  ఆర్థిక సంవత్సరంలో ఉన్న 0.6-0.7 శాతం వాటాతో పోలిస్తే పెరుగుదల నమోదైంది. ఇక భారత్‌లో వచ్చిన ఆదాయంలో 60 శాతం ఐఫోన్‌ విక్రయాల ద్వారా వచ్చిందే. ఇది కూడా కంపెనీ మొత్తం ఐఫోన్‌ విక్రయాల్లో ఒక శాతం కంటే తక్కువే.

ఇటీవలి పరిణామాలు గమనించినట్లైతే.. యాపిల్‌కు బలమైన మార్కెట్‌గా భారత్‌ ఎదుగుతోంది. యూఎస్‌, అమెరికా, యూకే, యూఏఈ, జర్మనీ, ఆస్ట్రేలియా సహా పెద్ద మార్కెట్లలో విడుదలైన రోజే ఐఫోన్‌ 13 భారత్‌లోకీ ప్రవేశించింది. ఇలా ఓ కొత్త ఐఫోన్‌ భారత్‌లో తొలిరోజే విడుదల కావడం ఇదే మొదటిసారి. ఇంతకుమందు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన మార్కెట్లలో విడుదలైన మూడు, నాలుగు వారాలకుగానీ కొత్త ఐఫోన్లు భారత్‌కు వచ్చేవి కాదు. జపాన్‌, చైనాను మినహాయిస్తే.. ఆసియా ప్రాంతంలో యాపిల్‌కు వస్తున్న ఆదాయంలో భారత్‌ వాటా 12-13 శాతంగా ఉంది. ఇక యాపిల్‌ ఆదాయంలో చైనా వాటా 18.67 శాతం కావడం గమనార్హం.

ఐఫోన్‌ 13, యాపిల్‌ 12 ప్రో, ప్రో మ్యాక్స్‌ మినహా యాపిల్‌ కీలక ఫోన్లన్నీ భారత్‌లోనే తయారవుతున్నాయి. మరోవైపు అధిక దిగుమతి సుంకం కారణంగా దుబాయ్‌, అమెరికా నుంచి ఇప్పటికీ అక్రమ మార్గంలో భారత్‌కు యాపిల్‌ ఉత్పత్తులు చేరుతున్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts