కోవిడ్‌-19ని స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కునేందుకు స‌రైన బీమా పాల‌సీ మీ వ‌ద్ద ఉందా? 

కోవిడ్‌-స్పెసిఫిక్ బీమా పాల‌సీలు స్వ‌ల్ప‌కాలానికి మాత్ర‌మే రూపొందించారు.. అందువ‌ల్ల ఇవి ఉన్న‌ప్ప‌టికీ స‌మ‌గ్ర జీవిత, ఆరోగ్య బీమా పాల‌సీలు ఉండాలి.

Updated : 27 Apr 2021 15:19 IST

కోవిడ్‌-19 మ‌న‌లో చాలా మందికి, వ్య‌క్తిగ‌తంగా అనేక ఆర్థిక పాఠాలు నేర్పించింది. ముఖ్యంగా బీమా ప్రాముఖ్య‌త‌ను తెలియ‌జేసింది. త‌గిన మొత్తంలో బీమా క‌వ‌రేజ్ ఎందుకు ఉండాలో తెలిపింది.  కోవిడ్‌-19 రెండో ద‌శ ప్రారంభ‌మైంది. ఇది రోజురోజుకి దేశమంతా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్ర‌భుత్వం విడుద‌ల చేస్తున్న నివేదిక‌ల ప్ర‌కారం గ‌త కొద్ది రోజులుగా, రోజుకు 3 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. మ‌ర‌ణాల సంఖ్య కూడా ఆందోళ‌నక‌రంగానే ఉంది. మరోసారి ఈ మహమ్మారి విజృంభిస్తున్న వేళ... మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. భౌతిక దూరం పాటించ‌టం.. మాస్కులు ధ‌రించ‌డం ఎంత అవసరమో.. ఆర్థికంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవ‌డం కూడా అంతే ముఖ్యం. మరీ ముఖ్యంగా త‌గినంత క‌వ‌రేజ్‌తో జీవిత‌, ఆరోగ్య బీమా పాల‌సీలు ఉండాలి. అందువ‌ల్ల ఆరోగ్య‌, జీవిత బీమా రెండింటిని స‌మీక్షించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. 

కోవిడ్‌-19ని స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కునేందుకు స‌రైన బీమాపాల‌సీ మీ వ‌ద్ద ఉందా? ఒక‌వేళ లేక‌పోతే ఎలాంటి పాల‌సీ తీసుకోవాలి? ఎలాంటి పాల‌సీ తీసుకుంటే స‌రిపోతుంది? స‌రైన‌ పాల‌సీని ఎలా ఎంచుకోవాలి? ప్ర‌త్యేకించి కోవిడ్-19 కోసం రూపొందిచిన పాల‌సీని తీసుకోవాలా.. స‌మ‌గ్ర ట‌ర్మ్‌, ఆరోగ్య ప్లాన్‌ను ఎంచుకుంటే స‌రిపోతుందా? త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకుందాం. 

కోవిడ్‌-స్పెసిఫిక్ బీమా పాల‌సీలు..
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఏఐ) జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా బీమా సంస్థ‌లు 2020లో కరోనా కవచ్, కరోనా రక్షక్ పేర్ల‌తో రెండు ర‌కాల పాల‌సీల‌ను రూపొందించాయి. ఈ ప్రామాణిక ఆరోగ్య బీమా పాలసీలు కరోనావైరస్ వ్యాధి చికిత్స ఖర్చును భరిస్తాయి. ఈ పాలసీలు చాలా స్వల్పకాలిక కోసం అంటే మార్చి 31,2021 జారీ చేయ‌డం జ‌రిగింది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పాల‌సీల‌ను సెప్టెంబ‌రు 30, 2021 వ‌ర‌కు జారీ చేసేందుకు, అదే విధంగా పున‌రుద్ధ‌రించేందుకు ఐఆర్‌డీఏఐ బీమా సంస్థ‌ల‌ను అనుమతించింది. 

బీమా సంస్థ‌లు, కరోనా కవచ్ పాలసీని వ్యక్తులు, కుటుంబాలకు నష్టపరిహార ప్రాతిపదికన అందిస్తున్నాయి. కరోనా రక్షక్ వ్య‌క్తిగ‌త పాల‌సీ. బీమా తీసుకున్న వ్య‌క్తికి మాత్ర‌మే ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది. 

కరోనా కవచ్..
ఇది నష్టపరిహార-ఆధారిత ఆరోగ్య బీమా పాలసీ,  కరోనావైరస్ వ్యాధి చికిత్స కోసం అయిన వాస్తవ ఖర్చులను తిరిగి ఇస్తుంది.  కోవిడ్-సంబంధిత ఆసుపత్రి ఖర్చులు, గృహ సంరక్షణ(హోమ్ కేర్‌) చికిత్స ఖర్చులు, ఆయుష్ ట్రీట్‌మెంట్ ఖర్చులు, ఆసుపత్రికి వెళ్ళ‌క ముందు, ఆ తరువాత వైద్య ఖర్చులను ఈ పాల‌సీ క‌వ‌ర్ చేస్తుంది. 18 నుంచి 65 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు వారు ఈ పాల‌సీని కొనుగోలు చేయ‌వ‌చ్చు. 18 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న పిల్ల‌లు, మీపై ఆధారప‌డిల‌న త‌ల్లితండ్రులు ఉంటే ఫ్యామిలీ ఫ్లోట‌ర్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవచ్చు. 

స‌మ‌గ్ర ఆరోగ్య బీమా పాల‌సీల‌లో ఉండే 30 రోజుల  వెయిటింగ్ పిరియ‌డ్‌తో పోలిస్తే, క‌రోనా క‌వాచ్‌లో 15 రోజుల అతి త‌క్కువ వెయిటింగ్ ప‌రియ‌డ్ ఉంటుంది. ఈ పాల‌సీ కింద రూ.50 వేల నుంచి గ‌రిష్టంగా రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు బీమా క‌వ‌రేజ్ ఉంటుంది. మూడున్న‌ర‌, ఆరున్న‌ర‌, తొమ్మిదిన్న‌ర నెల‌ల కాల‌ప‌రిమితుల‌తో పాల‌సీలు అందుబాటులో ఉంటాయి. 

ఈ పాల‌సీలు స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు అందుబాటులో ఉన్నాయి. కుటుంబంలో ఉన్న ప్ర‌తీ వ్య‌క్తికి స‌మ‌గ్ర బీమా కొనుగోలు చేయాలంటే చాలా ఖ‌ర్చ‌వుంతుంది. ఒక వ్య‌క్తికి రూ.5 ల‌క్ష‌ల హామీ మొత్తంతో స‌మ‌గ్ర బీమా పాల‌సీ కొనుగోలు చేసేందుకు రూ.10వేల కంటే ఎక్కువ ప్రీమియం వ‌సూలు చేస్తున్నాయి చాలా బీమా సంస్థ‌లు. అయితే రూ.1300-రూ.3000 వ‌ర‌కు ప్రీమియంతో రూ. 5ల‌క్ష‌ల క‌రోనా క‌వాచ్ క‌వ‌రేజ్‌ను పొంద‌చ్చు.  ఉదాహ‌ర‌ణ‌కి, ఓరియంట‌ల్ ఇన్సురెన్స్ సంస్థ రూ.1272, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సురెన్స్ రూ.2965 ప్రీమియంతో రూ.5 ల‌క్ష‌ల క‌వరేజ్‌తో కూడిన క‌రోనా క‌వచ్ పాల‌సీని ఆఫ‌ర్ చేస్తున్నాయి. మ‌రికొన్ని బీమా సంస్థ‌లు కూడా ఈ పాల‌సీల‌ను ఆఫ‌ర్ చేస్తున్న‌ప్ప‌టికీ,  ప్రీమియం ఎక్కువ‌గా వ‌సూలు చేస్తున్నాయి.  

ఎవరు ఎంచుకోవాలి..
సమగ్ర ఆరోగ్య బీమా పథకం ఉండి, కుటుంబ సభ్యులందరికీ ఏకకాలంలో ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు తగిన మొత్తంలో హామీ ఉన్న‌వారు తీసుకోన‌వ‌స‌రం లేదు. అయితే ఆరోగ్య బీమా లేకపోయినా, హామీ మొత్తం త‌క్కువ‌గా ఉన్నా, కుటుంబంలో ఉన్న ఇత‌ర స‌భ్యులంద‌రికీ, ఏక‌కాలంలో స‌రిపోయే క‌వ‌రేజ్ లేక‌పోయినా, స‌మ‌యాన్ని వృదా చేయ‌కుండా, సాధ్య‌మైనంత తొంద‌ర‌గా క‌రోనా క‌వ‌చ్ పాల‌సీని కొనుగోలు చేయ‌డ‌మే మంచిద‌ని బీమా రంగ నిపుణులు చెబుతున్నారు. 

క‌రోనా ర‌క్ష‌క్‌..
క‌రోనా ర‌క్ష‌క్ పాల‌సీ ప్ర‌యోజ‌న‌-ఆధారిత ప్ర‌ణాళిక‌, నష్టపరిహార-ఆధారిత కరోనా కవచ్ ప్లాన్‌కు భిన్నంగా ఉంటుంది, దీన్ని ఎంచుకున్న వ్యక్తులు ఆసుపత్రిలో చేరినప్పుడు పాల‌సీ ప్ర‌కారం 100 శాతం హామీ మొత్తాన్ని పొందుతారు. అయితే పాల‌సీదారుడు క‌నీసం 72 గంట‌ల పాటు ఆసుప‌త్రిలో చేసి నిరంత‌ర చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కోవిడ్ -19 చికిత్సకు అవసరమైన పరికరాలు - పీపీఈ కిట్లు, ఆక్సిజన్ నెబ్యులైజర్లు, ఫేస్ మాస్క్‌లు, ఆక్సిజన్ సిలిండర్లు, గ్లోవ్స్, ఆక్సిమీటర్లతో సహా అదనపు ఖర్చులను కూడా క‌వ‌ర్ అవుతాయి. 

రూ. 50 వేల నుంచి గరిష్టంగా రూ. 2.5 లక్షల వరకు హామీ మొత్తం ఉంటుంది. 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వ‌య‌సు గ‌ల వారంద‌రూ వ్య‌క్తిగ‌త బీమా ప్రాతిప‌దిక‌న‌ ఈ పాల‌సీని కొనుగోలు చేయ‌వ‌చ్చు. క‌రోనా క‌వచ్ మాదిరిగానే ఇది మూడున్నర, ఆరున్నర, తొమ్మిదిన్నర నెలల కాల‌ప‌రిమితితో వ‌స్తుంది. ఇందులో ఉన్న ముఖ్య‌మైన‌ ప్ర‌యోజ‌నం ఏమిటంటే.. పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి వైద్య ఖ‌ర్చులు మాత్ర‌మే కాకుండా.. పూర్తి హామీని పొంద‌చ్చు. 

ఎవరు ఎంచుకోవాలి..
ఇప్పటికే ఆరోగ్య బీమా పథకం ఉన్నప్పటికీ, మొత్తం కుటుంబానికి హామీ మొత్తం స‌రిపోదు అనుకున్న‌ప్పుడు, వ్య‌క్తిగ‌తంగా ఈ పాల‌సీ కొనుగోలు చేయ‌వ‌చ్చు.  ఈ ప్లాన్‌ వ్య‌క్తిగ‌తంగా ప్ర‌యోజ‌నక‌రంగా ఉంటుంది కాబ‌ట్టి, ఎక్కువ రిస్క్ ఉన్న వ్య‌క్తులు, అవ‌స‌ర‌మైన విధంగా ఉప‌యోగించుకునేందుకు ఈ పాల‌సీ తీసుకోవ‌చ్చు. 

స‌మ‌గ్ర ఆరోగ్య లేదా ట‌ర్మ్ పాల‌సీని ఎవ‌రు కొనుగోలు చేయాలి?
జీవిత బీమా లేని వారు, చాలా తక్కువ కవరేజీని అందించే కోవిడ్‌-స్పెసిఫిక్ బీమా పాల‌సీ కంటే కూడా, త‌గినంత హామీతో స‌మ‌గ్ర బీమా ప్లాన్ల‌ను కొనుగోలు చేయ‌డం మంచిది. ముఖ్యంగా కోవిడ్ -19 కారణంగా పాలసీదారుడు మరణిస్తే  ఈ పాల‌సీలు పెద్దగా సహాయపడకపోవచ్చు. అందువల్ల, మీ త‌రువాత కూడా మీ కుటుంబాన్ని ఆర్థికంగా భద్రపరిచే ప్రాథమిక పాల‌సీల‌ను  కొనుగోలు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. 

కోవిడ్‌-19 మొద‌టి ద‌శ‌ కంటే రెండో ద‌శ మ‌రింత ప్ర‌భావంతంగా ఉంది. అందువ‌ల్ల ఒక వ్య‌క్తి మ‌ర‌ణం త‌రువాత కూడా కుటుంబ స‌భ్యుల భ‌విష్య‌త్తుకు ఆర్థికంగా స‌హాయ‌ప‌డే ట‌ర్మ్ జీవిత బీమా పాల‌సీని తీసుకోవ‌డం అత్య‌వ‌స‌రం. ఇటువంటి పాల‌సీల‌ను సంపాదన‌ ప్రారంభంలోనే కొనుగోలు చేయ‌డం మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు. 

అదేవిధంగా,  ప్రాథమిక సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ లేనివారు కూడా ఆరోగ్య బీమా పాల‌సీని వెంట‌నే కొనుగోలు చేయ‌డం మంచిది. కరోనావైరస్ నుంచి కోలుకున్న తర్వాత, ఇతర ఆరోగ్య‌ సమస్యలు తలెత్తే అవ‌కాశం ఉంది. కోవిడ్ కోసం రూపొందించిన నిర్దిష్ట ప్రణాళికలు అతి తక్కువ కాల‌ప‌రిమితితో వ‌స్తున్నాయి. అందువ‌ల్ల దీర్ఘకాలం ర‌క్ష‌ణ ఇవ్వ‌లేవు. 

కోవిడ్‌-19 వైర‌స్ బారిన ప‌డి కోలుక‌న్న వారిలో దీర్ఘ‌కాలిక అనారోగ్యాలు త‌లెత్తే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఇందుకోసం అయ్యే మందుల ఖ‌ర్చు కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. అంతేకాకుండా కోవిడ్‌-19 వ్యాక్సిన్ వ‌ల్ల క‌లిగే సైడ్ ఎఫెక్స్ మొద‌లైన వాటికి దీర్ఘ‌కాలికంగా సంర‌క్ష‌ణ పొందేందుకు స‌మ‌గ్ర‌ ఆరోగ్య బీమా ప్ర‌ణాళిక ఉండాలి.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని