డాలర్‌ ఆస్తులు తొలగించిన రష్యా వెల్త్‌ సంస్థ

అమెరికా డాలర్‌ ఆస్తులను పూర్తిగా తొలగిస్తున్నట్లు రష్యా నేషనల్‌ వెల్త్‌ ఫండ్‌ ప్రకటించింది. రెండు వారాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ల మధ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో, అమెరికాపై ఒత్తిడి పెంచేందుకే రష్యా ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.

Published : 04 Jun 2021 02:18 IST

మాస్కో: అమెరికా డాలర్‌ ఆస్తులను పూర్తిగా తొలగిస్తున్నట్లు రష్యా నేషనల్‌ వెల్త్‌ ఫండ్‌ ప్రకటించింది. రెండు వారాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ల మధ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో, అమెరికాపై ఒత్తిడి పెంచేందుకే రష్యా ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. డాలర్‌ రూపేణ ఉన్న ఆస్తులను యూరోలు, యువాన్‌, పసిడి కింద మార్చనున్నట్లు రష్యా ఆర్థిక మంత్రి అంటోన్‌ సిలునోవ్‌ వెల్లడించారు. ఈ పక్రియకు నెల రోజులు పడుతుందని, పూర్తయిన తర్వాత జాతీయ సంపద నిధిలో 40 శాతం యూరోలు, 30 శాతం యువాన్‌, 20 శాతం పసిడి, బ్రిటిష్‌ పౌండు, జపాన్‌ యెన్‌ చెరో 5 శాతం ఉంటాయని వివరించారు. ప్రస్తుతం ఈ నిధి ఆస్తుల్లో 35 శాతం డాలర్లు, మరో 35 శాతం యూరోలు ఉన్నాయని తెలిపారు. చమురు నుంచి వచ్చిన ఆదాయాలను తీసుకునే ఈ నిధిని.. మార్కెట్‌ ఒడుదొడుకులు ఎదుర్కొనేందుకు, దేశ ప్రాజెక్టులకు కోసం వినియోగిస్తారు. ప్రస్తుతం రష్యా సంపద నిధి విలువ దాదాపు 600 బిలియన్‌ డాలర్లుగా అంచనా.


మేలో సేవల రంగ పీఎంఐ 46.4

దిల్లీ: కొవిడ్‌ సంక్షోభంతో భారత సేవల రంగం గత 8 నెలల్లో తొలిసారిగా క్షీణత నమోదు చేసింది. మేలో సేవల రంగ వ్యాపార కార్యకలాపాల సూచీ 46.4 పాయింట్లుగా నమోదైంది. ఇది ఏప్రిల్‌లో 54 పాయింట్లుగా ఉంది. ఈ సూచీ 50 పాయింట్ల పైన ఉంటే వృద్ధిగా, దిగువన ఉంటే క్షీణతగా భావించాల్సి ఉంటుంది. కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి, లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో వ్యాపార కార్యకలాపాలు మందగించడం, దేశీయంగా, అంతర్జాతీయంగా భారతీయ సేవలకు గిరాకీ తగ్గడంతో పీఎంఐ సేవల సూచీ క్షీణతను నమోదు చేసిందని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఎకనామిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పాలియానా డె లీమా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని