అత్యవసర నిధి కోసం..అప్పు చేయొద్దు

నా వయసు 23 ఏళ్లు. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.20వేలు వస్తున్నాయి. ఇందులో నుంచి రూ.5వేల వరకూ మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. ఆరేళ్ల వరకూ పెట్టుబడి పెడితే ఎంత మొత్తం జమ అవుతుంది?....

Published : 01 May 2021 22:36 IST

*నా వయసు 23 ఏళ్లు. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.20వేలు వస్తున్నాయి. ఇందులో నుంచి రూ.5వేల వరకూ మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. ఆరేళ్ల వరకూ పెట్టుబడి పెడితే ఎంత మొత్తం జమ అవుతుంది? నా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి? - కిరణ్‌
మీపైన ఆధారపడిన వారు ఉంటే.. రూ.25 లక్షల వరకూ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోండి. ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలనూ తీసుకోండి. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోండి. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.5వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. సగటున 13శాతం వార్షిక రాబడి అంచనాతో.. నెలకు రూ.5వేల చొప్పున 6 ఏళ్లు మదుపు చేస్తే.. దాదాపు రూ.5లక్షల వరకూ జమ అయ్యే అవకాశం ఉంది. 

*మా నాన్న పేరుతో ఉన్న బీమా పాలసీ నుంచి రూ.4లక్షల వరకూ వస్తున్నాయి. వీటిని ఎక్కడైనా మదుపు చేసి, నెలనెలా రాబడి అందుకునే ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. నాన్న వయసు 57 ఏళ్లు. ఇమ్మీడియట్‌ యాన్యుటీ బీమా పాలసీలు తీసుకుంటే మంచిది అంటున్నారు. నిజమేనా? ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి?     - ప్రియాంక
మీరు వెంటనే పింఛను ఇచ్చే ఇమ్మీడియట్‌ యాన్యుటీ పాలసీలను తీసుకోండి. వీటిలో ‘ఇమ్మీడియట్‌ యాన్యుటీ ఫర్‌ లైఫ్‌ విత్‌ రిటర్న్‌ ఆఫ్‌ పర్ఛేజ్‌ ప్రైస్‌’ ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. ఈ యాన్యుటీ ఆప్షన్‌లో దాదాపు 5.3% - 5.6% వరకూ వడ్డీ వచ్చే అవకాశం ఉంది. జీవితాంతం వరకూ ఇది కొనసాగుతుంది. ప్రత్యామ్నాయంగా పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీంను పరిశీలించవచ్చు. ఇందులో ప్రస్తుతం 6.6శాతం రాబడి అందుతోంది. దీని వ్యవధి 5 ఏళ్లు.

*నాలుగేళ్ల నుంచి బ్యాంకులో నెలకు రూ.10వేల చొప్పున రికరింగ్‌ డిపాజిట్‌ చేస్తున్నాను. కానీ, పెద్దగా లాభం ఉండటం లేదు. దీనికి బదులుగా డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తే రాబడి అధికంగా వస్తుందా? నాకు మరో మూడేళ్లలో డబ్బులు అవసరం అవుతాయి. ఏం చేయాలి? - ప్రదీప్‌
మంచి క్రెడిట్‌ క్వాలిటీ ఉన్న షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేస్తే రికరింగ్‌ డిపాజిట్‌ కన్నా కాస్త అధిక రాబడి వచ్చే అవకాశం ఉంది. కానీ, ఇందులోనూ కాస్త నష్టభయం ఉంటుంది. దీనికి సిద్ధమైతేనే డెట్‌ ఫండ్లలో మదుపు చేయండి. లేకపోతే రికరింగ్‌ డిపాజిట్‌లోనే కొనసాగండి. 

*కరోనా నేపథ్యంలో అత్యవసరాల కోసం ఉపయోగపడుతుందని ఇటీవలే రూ.2లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నాను. వడ్డీ 13 శాతం. ఇప్పుడు ఈ మొత్తాన్ని కనీసం వడ్డీలో కొంత భాగమైనా వచ్చేలా మదుపు చేద్దామని అనుకుంటున్నాను. దీనివల్ల నష్టమేమైనా ఉంటుందా? ఈ డబ్బును ఎలా వినియోగించుకోవాలి?     - గిరి
మనం ఎప్పుడూ అత్యవసర నిధి కోసం మన సొంత డబ్బు నుంచే జమ చేయాలి. అంతేకానీ, అధిక వడ్డీకి అప్పు తీసుకొని, అత్యవసర నిధి కింద వాడుకోవద్దు. మీరు చెల్లించే వడ్డీ చాలా అధికం. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు చేతిలో ఉండటం చాలా అవసరమే. మీ దగ్గరున్న డబ్బును మరో నాలుగు నెలలపాటు ముట్టుకోకండి. ఈలోపు ఆన్‌లైన్‌లో ఫ్లెక్సీ డిపాజిట్‌ చేసుకునే అవకాశాన్ని పరిశీలించండి. అవసరమైతే వెంటనే వెనక్కి తీసుకునే వీలూ ఉంటుంది. ఇప్పుడున్న ఇబ్బందికరమైన పరిస్థితులు కాస్త సర్దుకున్నాక.. వ్యక్తిగత రుణాన్ని మొత్తం తీర్చేయడానికి ప్రయత్నించండి.

*ఇల్లు కొనాలనే ఆలోచనతో ఈపీఎఫ్‌ నుంచి డబ్బు తీసుకున్నాను. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఏడాది వరకూ వేచి చూడాలని ఆలోచిస్తున్నాం. మా దగ్గరున్న మొత్తాన్ని కనీసం 10 శాతం రాబడి వచ్చేలా ఎక్కడ మదుపు చేయాలి? - మహిపాల్‌
ప్రస్తుతం స్వల్పకాలిక సురక్షితమైన పెట్టుబడులపైన 5 నుంచి 5.5శాతం వరకూ రాబడి వచ్చే అవకాశం ఉంది. మీరు ఏడాది సమయమే ఉందంటున్నారు కాబట్టి, 10శాతం రాబడి రావడం కష్టం. ఇంత రాబడి రావాలంటే.. నష్టభయంతో కూడిన పథకాల్లో మదుపు చేయాలి. కానీ, కనీసం 5-7 ఏళ్లపాటు ఎదురుచూడాలి. మీ దగ్గరున్న డబ్బును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లేదా పోస్టాఫీసు టైం డిపాజిట్‌లో ఏడాది కాల వ్యవధికి డిపాజిట్‌ చేసుకోండి.    

 

- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని