Published : 05 Oct 2021 11:09 IST

Wealth Creation: సంపద సృష్టించాలంటే ఈ అపోహలొద్దు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెద్ద మొత్తంలో సంపద సృష్టించాలని ఎవరికి ఉండదు చెప్పండి! అందుకోసం అనేక పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తారు. వాటిలో కొన్నింటిని ఆచరిస్తారు. అయితే, మనం ఎంచుకునే మార్గాల్లో అన్నీ సరైనవి అయ్యి ఉండకపోవచ్చు. ఆ  విషయం మనకు వెంటనే అర్థం కాదు. అప్పుడు కొంతమంది సలహాలను తీసుకుంటాం. లేదా ఆన్‌లైన్‌ వనరులపై ఆధారపడతాం. ఈ క్రమంలో అనేక అపోహలు మన దరికి చేరతాయి. వాటిని నమ్మితే.. మన ఆర్థిక లక్ష్యాలకు దూరమైనట్లే! ఇంతకీ ఆ అపోహలేంటో చూద్దాం!

అపోహ 1: ఆలస్యమైనా.. ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్‌ చేస్తే సరిపోతుంది..

తొలి ఉద్యోగంలో వేతనం తక్కువగానే ఉండొచ్చు. అప్పుడు మదుపు చేయడం కష్టం. అందుకోసం జీతం పెరిగే వరకు వేచి చూసి కొంచెం ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడదాం అనుకుంటాం. ఆలస్యమైనా.. ఎక్కువ ఇన్వెస్ట్‌ చేయడం వల్ల కావాల్సినంత సంపాదించొచ్చని భావిస్తాం. కానీ, ఇది అపోహ. తక్కువ వయసులో మదుపు చేయడం కంటే మరో మంచి మార్గం లేదు. ఎంత తక్కువ మొత్తమైనా పర్వాలేదు. ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభించడం ముఖ్యం. వేతనం పెరుగుతున్న కొద్దీ మదుపూ పెంచుకోవచ్చు.

ఉదాహరణకు.. రాజేశ్‌, సురేశ్‌ అనే ఇద్దరు మిత్రులు ఉన్నారనుకుందాం. ఇద్దరికీ 25 ఏళ్ల వయసులో ఉద్యోగం వచ్చింది. రాజేశ్‌ తొలి వేతనం అందిన వెంటనే ప్రతినెలా రూ.5,000 సిప్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) చేయడం ప్రారంభించాడు. ఏటా 5శాతం పెంచుతూ వెళ్లాడు. మరోవైపు సురేశ్‌ ఐదేళ్లు ఆగి 30వ ఏట నుంచి ప్రతినెలా రూ.10,000 మదుపు చేయడం ఆరంభించాడు. ఏటా 5 శాతం పెంచుతూ వెళ్లాడు. ఇద్దరికీ 12 శాతం వార్షిక రిటర్న్స్‌ వచ్చాయనుకుందాం. వారిద్దరి వయసు 60 ఏళ్లు వచ్చే సరికి వారి మదుపు ఎంత సంపదను సృష్టించిందో చూద్దాం.

మదుపు వివరాలు          రాజేశ్‌                సురేశ్‌

తొలిమదుపు              రూ.5,000          రూ.10,000

ఏటా పెంపు               5 శాతం              5 శాతం

వార్షిక రిటర్నులు          12 శాతం             12 శాతం

మదుపు గడువు           35 ఏళ్లు              30 ఏళ్లు

60 ఏళ్లు వచ్చే 
సరికి వారి సంపద
       రూ.7.58 కోట్లు       రూ.7.40 కోట్లు

చూశారా... రిటైరయ్యే సమయానికి రాజేశ్‌ను అందుకోవడం సురేశ్‌ వల్ల కాలేదు. రాజేశ్‌ కంటే సురేశ్‌ రెండింతలు మదుపు చేసినా.. అది సాధ్యం కాలేదు. అందుకే చిన్న వయసులో తక్కువ మొత్తం మదుపు చేస్తే.. దీర్ఘకాలంలో పెద్దమొత్తంలో సంపదను సృష్టించొచ్చు.

అపోహ 2: సంపద సృష్టికి స్థిరమైన రాబడి మేలు..

దీర్ఘకాలంలో సంపదను సృష్టించాలంటే.. అసలు నష్టాలు లేకుండా చూసుకోవాలనుకుంటారు కొంతమంది. అందుకే చాలా మంది భారతీయులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, పీపీఎఫ్‌.. వంటి సంప్రదాయ మదుపు పథకాల్ని ఎంచుకుంటారు. అయితే, ఎక్కువ మొత్తంలో సంపద సృష్టించాలంటే ఇవి పెద్దగా ఫలితాలివ్వకపోవచ్చు. ప్రస్తుతం ఎఫ్‌డీ వడ్డీరేటు సగటున 6 శాతం, పీపీఎఫ్‌ వడ్డీరేటు 7.1 శాతంగా ఉంది. ఈ రెండింటిలో కలిపి మదుపు చేశారని అనుకున్నా... సగటున ఏటా 7 శాతం రాబడి వస్తుంది. అయితే, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో దీర్ఘకాలంలో మదుపు చేస్తే.. కనీసం 12 శాతం రాబడి దాదాపు ఖాయం! అయితే, ఇది స్థిరమైన రాబడి కాదు కాబట్టి.. మధ్యలో నష్టాలు తప్పవు. అయినప్పటికీ.. చివరకు 12 శాతం రాబడి మాత్రం ఎక్కడికీ పోదని ఈక్విటీ మార్కెట్ల పోకడను చూస్తే స్పష్టమవుతోంది! ఈ నేపథ్యంలో సంప్రదాయ మదుపు పథకాల కంటే కొంచెం నష్టభయం ఎక్కువ ఉన్న పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందొచ్చు.

అపోహ 3: ఎక్కువ రాబడి వచ్చే పథకాలతోనే సంపద సృష్టి సాధ్యం..

కేవలం ఎక్కువ రాబడి వచ్చే పథకాల్లో మదుపు చేసినంత మాత్రాన అనుకున్నంత సంపద పోగేయడం సాధ్యం కాదు. ముదపుతో పాటే పొదుపు కూడా ఉండాలి. పెట్టుబడి ప్రారంభించిన తొలినాళ్లలో అవి ఎంత ఎక్కువ మొత్తంలో రాబడి ఇచ్చినా.. అసలు తక్కువ కాబట్టి సంపద సృష్టి పెద్దమొత్తంలో ఉండదు. కొన్నేళ్లు గడిస్తే గానీ, మదుపు చేసిన దాని నుంచి ఆశించిన స్థాయిలో రిటర్న్స్‌ రావు. ఈ నేపథ్యంలో మదుపుతో పాటే పొదుపు కూడా చేస్తూ ఉండాలి. దీన్ని క్రమానుగతంగా మీ పెట్టుబడికి జత చేస్తూ వెళ్లాలి. అప్పుడు మీ పెట్టుబడి మొత్తం పెరిగి రిటర్న్స్‌ కూడా పెరుగుతాయి.

ఉదాహరణకు.. మీరు 20 శాతం రిటర్న్స్‌ ఇచ్చే పథకంలో రూ.10,000 తొలుత మదుపు చేశారనుకుందాం. ఏటా మీ రాబడి రూ.2,000. అదే మీరు కొంతకాలం మరో రూ.40,000 పొదుపు చేసి తొలుత మదుపు చేసిన రూ.10,000కు జత చేస్తే అప్పుడు మీ పెట్టుబడి రూ.50,000కు పెరుగుతుంది. అప్పుడు అది 10 శాతం రిటర్న్స్‌ ఇచ్చినా.. మీ రాబడి రూ.5,000కు చేరుతుంది. అందుకే మదుపు చేసి ఊరుకోకుండా.. పొదుపు కూడా చేసి దాన్ని పెట్టుబడికి జతచేస్తూ వెళ్లాలి.

అపోహ 4: మదుపు చేసి మర్చిపోండి..

కొందరు మదుపర్లు తమ పెట్టుబడులను తరచూ వివిధ మార్గాల్లోకి మారుస్తూ ఉంటారు. మరికొందరేమో పెట్టుబడి పెట్టి వాటిని అలా వదిలేస్తారు. ఈ రెండూ సంపద సృష్టికి అంత మంచిది కాదు. ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటించాలి. అప్పుడప్పుడూ మీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను చెక్‌ చేసుకుంటూ ఉండండి. మీ లక్ష్యానికి అనుగుణంగా రాబడి రావడం లేదనుకుంటే.. మరింత ఆకర్షిణీయమైన పథకాల్లోకి కొంత డబ్బును తరలించండి.

సంపద సృష్టి ఒక్కరోజులో అయ్యే పని కాదు. దానికి ఓపిక, క్రమశిక్షణ అవసరం. పైన చెప్పిన అపోహల్ని నమ్మకుండా.. కొన్ని కీలక నిర్ణయాల ద్వారా రిటైర్‌ అయ్యే సమయానికి ఎక్కువ మొత్తంలోనే పోగు చేసుకోవచ్చు. అలాగే మీ ఆర్థిక లక్ష్యాలూ సకాలంలో నెరవేరుతాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని