Income Tax: సెక్షన్ 80సి కింద డిడ‌క్ష‌న్‌ క్లెయిమ్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయ‌కండి..

మీ ల‌క్ష్యాల‌ను అనుస‌రించి ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభం నుంచి వ్యూహాత్మ‌కంగా పెట్టుబ‌డులు పెడితే ప‌న్ను ఆదా ప్ర‌యోజ‌నాలు పూర్తిగా పొంద‌చ్చు. 

Updated : 25 Sep 2021 17:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప‌రిమితికి మించి ఆర్జించిన ఆదాయంపై నిబంధ‌న‌ల మేర‌కు ప్రతి ఒక్కరూ ఆదాయ‌పు ప‌న్ను చెల్లించాలి. కానీ జీతం ద్వారా ఆదాయం పొందుతున్న సగటు ఉద్యోగి మ‌దిలో మెదిలే కామ‌న్‌ ప్ర‌శ్న.. ప‌న్ను భారం ఎలా త‌గ్గించుకోవాలి? అని. దీనికి స‌మాధానం ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961లోని ప‌న్ను మిన‌హాయంపు పొందేందుకు అనేక చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన మార్గాలు. అలాంటి వాటిలో సెక్ష‌న్ 80సి కూడా ఒక‌టి. నిర్ణీత‌ పెట్టుబ‌డుల్లో మ‌దుపు చేయ‌డం, నిర్ణీత వ్య‌యాలు చేయ‌డం ద్వారా ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయాన్ని త‌గ్గించేందుకు ఇది స‌హాయ‌ప‌డుతుంది. సెక్ష‌న్ 80సి ప‌న్ను చెల్లింపుదారుల్లో అత్యంత ఆద‌ర‌ణ పొందిన ప‌న్ను ఆదా మార్గం. సెక్ష‌న్ 80సిలో- 80సిసిసి, 80సిసిడి (1), 80సిసిడి (1బి), 80 సిసిడి (2) వంటి స‌బ్ సెక్షన్లూ ఉన్నాయి.

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80సి ఏప్రిల్ 1, 2006 నుంచి అమ‌ల్లోకి వచ్చింది. దీని ప్ర‌కారం కొన్ని ప్రాథమిక ఖ‌ర్చులు, పెట్టుబ‌డులకు ప‌న్ను నుంచి మిన‌హాయింపు పొందొచ్చు. ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం ప్ర‌జా భ‌విష్య నిధి (పీపీఎఫ్‌), జాతీయ పింఛను ప‌థ‌కం (ఎన్‌పీఎస్‌), జాతీయ పొదుపు ప‌త్రాలు (ఎస్ఎస్‌సి), గృహ రుణ చెల్లింపులు వంటి వాటిలో పెట్టుబ‌డులు పెడితే సంవ‌త్స‌రానికి రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. త‌ద్వారా ప‌న్ను భారం తగ్గించుకోవచ్చు. అయితే ఇక్క‌డ రెండు ముఖ్య విష‌యాలు గుర్తుంచుకోవాలి. మొద‌టిది వ్య‌క్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌)లు మాత్ర‌మే ఈ మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌గ‌ల‌రు. కంపెనీలు, భాగ‌స్వామ్య సంస్థ‌లు, ఎల్ఎల్‌పీలు ఈ మిన‌హాయంపును పొంద‌లేవు. ఇక రెండోది.. ఇటీవల కాలంలో చేసిన‌ ఆర్థిక చ‌ట్టం 2020 సెక్ష‌న్ 115 బిసి ప్ర‌కారం ప‌న్ను చెల్లింపుదారులు కొత్త ప‌న్ను విధానాన్ని ఎంచుకుంటే సెక్ష‌న్ 80సి ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపు పొంద‌లేరు. ప‌న్ను విధానాల‌ను స‌రిగ్గా అర్థం చేసుకోక పొతే, పూర్తి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌డం క‌ష్ట‌మ‌వుతుంది. ఆర్థిక ప్ర‌ణాళిక లేక‌పోవ‌డం వ‌ల్ల కూడా చాలా త‌ప్పులు జ‌రుగుతాయి. సాధార‌ణంగా చేసే కొన్ని త‌ప్పులు తెలుసుకుంటే.. వాటి విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హరించ‌డానికి అవ‌కాశం ఉంటుంది. అందువ‌ల్ల ప‌న్ను చెల్లింపుదారులు కామ‌న్‌గా చేసే కొన్ని త‌ప్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. లాక్-ఇన్‌ పీరియ‌డ్‌పై దృష్టి పెట్ట‌క‌పోవ‌డం..
సెక్షన్ 80సి కిందికి వ‌చ్చే నిర్దిష్ట తగ్గింపులు లాక్-ఇన్ పీరియ‌డ్‌కి లోబడి ఉంటాయి. ఉదాహరణకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల‌కు 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియ‌డ్‌ ఉంటుంది. అదేవిధంగా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు (ఈఎల్ఎస్ఎస్‌) మూడేళ్ల‌ లాక్-ఇన్ పీరియ‌డ్‌తో వ‌స్తాయి. పన్ను చెల్లింపుదారులు లాక్-ఇన్ పీరియ‌డ్ పరిమితులను ఉల్లంఘిస్తే ఆ ఆదాయాన్ని నిర్దిష్ట ఆర్థిక సంవ‌త్స‌రం వ‌చ్చిన ఆదాయంగా ప‌రిగిణించి పన్ను విధిస్తారు. 
పీపీఎఫ్ వంటి దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌కూ ఇదే వ‌ర్తిస్తుంది. పీపీఎఫ్‌లో 15 సంవత్స‌రాల లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది.

2.  రుణ చెల్లింపుల విష‌యంలో..
గృహ రుణ తిరిగి చెల్లింపుల‌పై ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చ‌ని తెలిసిందే. అయితే కొంత మంది ప‌న్ను చెల్లింపుదారులు ప్రైవేట్ లోన్ (స్నేహితులు, బంధువులు వ‌ద్ద తీసుకున్న రుణం) తిరిగి చెల్లింపులకు కూడా సెక్ష‌న్ 80సి కింద డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. 
ప‌న్ను చెల్లింపుదారుడు సెక్ష‌న్ 80సి కింద గృహ రుణ తిరిగి చెల్లింపుల‌పై ప‌న్ను మిన‌హాయింపు పొందాలంటే సెక్ష‌న్ 80C(2)(xviii)(c)లో పేర్కొన్న నిర్దిష్ట సంస్థ‌లు, వ్య‌క్తులు, బ్యాంకులు, కో-ఆప‌రేటివ్ బ్యాంకులు, నేష‌న‌ల్ హౌసింగ్ బ్యాంకులు, లైఫ్ ఇన్సూరెన్స్‌ కార్పొరేష‌న్ మొదలైన వాటి నుంచి రుణం పొంది ఉండాలి.

3. రిజిస్ట్రేష‌న్‌, స్టాంప్ డ్యూటీల‌పై త‌గ్గింపు..
నివాస గృహ బ‌దిలీకి సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు, ఇత‌ర ఖ‌ర్చుల‌ను సెక్ష‌న్ 80సి కింద మిన‌హాయింపునకు అనుమతిస్తారు. వాణిజ్య ఆస్తుల విష‌యంలో ఈ ఖ‌ర్చులను సెక్ష‌న్ 80సి కింద అనుమ‌తించ‌రు. కాబ‌ట్టి ప‌న్ను చెల్లింపుదారులు ఇలాంటి ఖ‌ర్చుల విష‌యంలో మిన‌హాయింపు కోసం ఆస్తి ర‌కాన్ని తెల‌పాల్సి ఉంటుంది.

4. ట్యూష‌న్ ఫీజు..
పిల్ల‌ల విద్య కోసం చెల్లించే ట్యూష‌న్ ఫీజుకు మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే పూర్తి స‌మయం విద్య కోసం చెల్లించిన ఫీజుల‌కు మాత్ర‌మే మిన‌హాయింపు ల‌భిస్తుంది. పూర్తి ఫీజులో ట్యూష‌న్ ఫీజు ఒక భాగం మాత్ర‌మే. ఈ భాగం వ‌ర‌కు మాత్ర‌మే మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అది కూడా ఇద్ద‌రు పిల్ల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.

5. ఎండోమెంట్ బీమా పథకాల్లో పెట్టుబడి..
జీవిత బీమా, పెట్టుబ‌డులు క‌ల‌యికే ఎండోమెంట్ ప్లాన్‌. ప‌న్ను ఆదా చేసేందుకు చాలామంది వీటిలో మదుపు చేస్తుంటారు. అయితే ఇందులో ఎక్కువ మొత్తంలో పెట్టుబ‌డులు పెట్ట‌డం వ‌ల్ల ఆశించినంత మేర‌ రాబ‌డి ఉండ‌దు. మీరు ఎక్కువ మొత్తం ఆదా చేయాల‌నుకుంటే ట‌ర్మ్ జీవిత బీమా తీసుకోవ‌డం మంచిది. ఇందులో కూడా సెక్ష‌న్ 80సి ప్రకారం మిన‌హాయింపు ల‌భిస్తుంది. ట‌ర్మ్ పాల‌సీ ప్రీమియం త‌క్కువ‌గా ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని మ‌రో ప‌థ‌కంలో మ‌దుపు చేయ‌డం వ‌ల్ల ఎక్కువ రాబ‌డి పొందొచ్చు.

చివ‌రి నిమిషంలో..

ప‌న్ను ఆదా పెట్టుబడులను ఎంచుకునేందుకు ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి వ‌ర‌కు వేచి ఉండ‌కూడ‌దు. హడావుడిలో తప్పు నిర్ణ‌యం తీసుకునేందుకు అవ‌కాశాలు ఉంటాయి. అలాగే ఆఖ‌రిలో నిధుల స‌మీక‌ర‌ణ‌కు కూడా ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది. మీ ల‌క్ష్యాల‌ను అనుస‌రించి ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభం నుంచి ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం వ్యూహాత్మ‌కంగా పెట్టుబ‌డులు పెడితే పూర్తి ప‌న్ను ఆదా ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని