కొత్త‌గా క్రెడిట్ కార్డు తీసుకున్నారా?

ఈ మ‌ధ్య కాలంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు ఎక్కువ‌గానే క్రెడిట్ కార్డుల‌ను జారీ చేస్తుండ‌టంతో, వాటిని వినియోగించే వారి సంఖ్య మ‌న దేశంలో రోజు రోజుకీ పెరుగుతోంది. దీని ప్ర‌కారం మొద‌టి సారి క్రెడిట్ కార్డులను వినియోగించే వారి సంఖ్య కూడా ఎక్కువ‌గా ఉన్న‌ట్లు అర్థ‌మ‌వుతుంది. జ‌న‌వ‌రి 2018 లో చలామణిలో ఉన్న మొత్తం క్రెడిట్ కార్డుల.. 

Updated : 01 Jan 2021 19:24 IST

ఈ మ‌ధ్య కాలంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు ఎక్కువ‌గానే క్రెడిట్ కార్డుల‌ను జారీ చేస్తుండ‌టంతో, వాటిని వినియోగించే వారి సంఖ్య మ‌న దేశంలో రోజు రోజుకీ పెరుగుతోంది. దీని ప్ర‌కారం మొద‌టి సారి క్రెడిట్ కార్డులను వినియోగించే వారి సంఖ్య కూడా ఎక్కువ‌గా ఉన్న‌ట్లు అర్థ‌మ‌వుతుంది. జ‌న‌వ‌రి 2018 లో చలామణిలో ఉన్న మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య 3.624 కోట్లు (36.24 మినియ‌న్లు) గా ఉంటే, జన‌వ‌రి 2019 నాటికి ఈ సంఖ్య‌ 4.51కోట్లు (45.17మిలియ‌న్లు)కు చేరుకుంది. ఈ సంవ‌త్స‌రం దాదాపు 90 ల‌క్ష‌ల కార్డులు పెరిగిన‌ట్లు రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్‌ ఇండియా విడుద‌ల చేసిన నివేదిక‌ల ద్వారా తెలుస్తుంది.

కొత్త‌గా క్రెడిట్ కార్డు ఉప‌యోగించే వారే ల‌క్ష్యంగా:

క్రెడిట్ కార్డుల‌ను స‌రైన ప‌ద్ధ‌తిలో ఉప‌యోగించాలి. క్రెడిట్ కార్డుల లావాదేవీలు జ‌ర‌పడంలో మోస‌గాళ్ళ బారిన ప‌డి న‌ష్ట‌పోయిన కేసులు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా తొలిసారిగా క్రెడిట్ కార్డు ఉప‌యోగించే వారిని ల‌క్ష్యంగా చేసుకుని మోస‌గాళ్ళు ప‌లు ర‌కాల సైబర్ నేరాల‌కు పాల్ప‌డుతున్నారు. అందువ‌ల్ల క్రెడిట్ కార్డు ఉప‌యోగించేప్పుడు మిమ్మ‌ల్ని మీరు కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

డైన‌మిక్ పాస్‌వ‌ర్డ్ పెట్టండి:

క్రెడిట్ కార్డు మోసాల‌కు పాల్ప‌డేవారు అధిక శాతం డిజిట‌ల్ లేదా ఆన్‌లైన్‌ను వేదిక‌గా చేసుకుని మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. మోస‌గాళ్ళు బ్యాంకు నుంచి గానీ, ఏదైనా ఆర్థిక సంస్థ నుంచి కాల్ చేస్తునట్లు న‌మ్మించి క్రెడిట్ కార్డు నెంబ‌రు, కార్డు గడువు తేదీ, సీవీవీ వంటి వివ‌రాల‌ను అడుగుతారు. ఒక‌వేళ మోస‌గాళ్ళ‌ను న‌మ్మి మీరు కార్డు వివ‌రాల‌ను చెబితే ఇక న‌ష్ట‌పోక త‌ప్ప‌దు. మోస‌గాళ్ళ‌కు ఒక్క‌సారి మీ స్టాటిక్ పాస్‌వ‌ర్డ్ తెలిస్తే కార్డును ప‌లు చోట్ల ఉప‌యోగిస్తారు. ఈ విధ‌మైన‌ మోసాలను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కునేందుకు ప‌లు ఆర్థిక సంస్థ‌లు స్టాటిక్ పాస్‌వ‌ర్డ్‌కి బ‌దులుగా డైన‌మిక్ పాస్‌వ‌ర్డ్‌ను ఉప‌యోగించాల‌ని సూచిస్తున్న‌ట్లు ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్‌, అన్‌సెక్యూర్డ్ ఎసెట్స్ హెడ్ సుదీప్త‌రాయ్ తెలిపారు.

స్టాటిక్ పాస్‌వ‌ర్డ్‌ స్థిరంగా ఉంటుంది. మీరు చేసే ప్ర‌తీ లావాదేవీకి ఒకే పాస్‌వ‌ర్డ్‌ను ఉప‌యోగిస్తుంటే దానిని స్టాటిక్ పాస్‌వ‌ర్డ్ అంటారు. నేర‌గాళ్ళు మీరు చెప్పే కార్డు వివ‌రాల‌తో ఒక‌సారి పాస్‌వ‌ర్డ్ తెలుసుకుంటే ఇక మీరు వారి ఉచ్చులో చిక్కుకున్న‌ట్లే. అందువ‌ల్ల స్టాటిక్ పాస్‌వ‌ర్డ్ స్థానంలో డైన‌మిక్ పాస్‌వ‌ర్డ్‌ను ఉప‌యోగిస్తే ఈ నేరాల సంఖ్య త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. మీరు లావాదేవీ నిర్వహించిన ప్ర‌తీసారీ డైన‌మిక్ పాస్‌వ‌ర్డ్ మారుతూ ఉంటుంది. ఈ విధానంలో మీరు ప్ర‌తీసారి ఒక కొత్త పాస్‌వ‌ర్డ్‌ను పొందుతారు.

ఇత‌రుల‌కు స‌మాచారం ఇవ్వ‌కండి:

మీ కార్డు వివ‌రాల‌ను ఇత‌రుల‌కు తెలియచేయకూడదని బ్యాంకులు, ఆర్ధిక సంస్థ‌లు ప్ర‌చారం చేసున్న‌ప్ప‌టికీ, వినియోగ‌దారులు వారి మాట‌ల‌ను విని త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డంతో మోసాల భారిన ప‌డుతూనే ఉన్నారు. ప్ర‌జ‌లు వారికి సంబంధించిన స‌మాచారాన్ని ఫోటో కాపీస్ రూపంలో, ఈ-మెయిల్ ఐడీ మొద‌లైన విధానాల ద్వారా షేర్ చేస్తున్నారు. సాధార‌ణంగా మోస‌గాళ్ళు డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ ద్వారా పాస్‌వ‌ర్డ్‌ను యాక్సిస్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు కొంద‌రు ఆదాయ‌పు ప‌న్ను శాఖ నుంచి రిఫండ్ కోసం కాల్ చేస్తున్నాం అని చెప్పి మీ కార్డు వివ‌రాలు, పాస్‌వ‌ర్డ్ తెలుప‌వ‌ల‌సిందిగా కోర‌తారు. బ్యాంకులు, బీమా సంస్థ‌లు, ఆదాయ‌పు ప‌న్ను శాఖ వారు గానీ మ‌రి ఏ ఇత‌ర ఆర్థిక, ఆర్థికేత‌ర సంస్థ‌లు, మీ కార్డు వివ‌రాలు, పాస్‌వ‌ర్డ్, ఒన్‌టైమ్ పాస్‌వ‌ర్డ్‌ (ఓటీపీ) వంటివి తెలుప‌మ‌ని కోర‌రు.

కార్డు స్వైప్ చేస్తున్న‌ప్పుడు జాగ్ర‌త్త‌:

కొన్ని సార్లు మీరు కార్డు ఉప‌యోగించిన‌ప్పుడు స‌మాచారం దొంగతనానికి గురవవ్వచ్చు. ఏదైనా సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్ లేదా ఇత‌ర రీటైల్ స్టోర్స్‌లో చెల్లింపులు చేసేందుకు కార్డును మిషన్‌లో ఒక్కసారి మాత్ర‌మే స్వైప్ చేయాలి. ఒక‌వేళ‌ రెండు సార్లు స్వైప్ చేసినా, మిషన్‌ లో మీ కార్డును ఎక్కువ స‌మ‌యం ఉంచినా, వెంటనే చెల్లింపులు నిలిపివేయ‌డం మంచిది. కార‌ణం రెండో సారి కార్డు స్వైప్‌ చేసినప్పుడు మీ కార్డ్ మీద ఉండే మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ద్వారా మీ సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని బ్యాంకు ప‌రిశ్ర‌మ నిపుణులు తెలిపారు.

క్రెడిట్ కార్డు మోసాల భారిన ప‌డ‌కుండా, మీ కార్డు ద్వారా జ‌రిగే లావాదేవీల‌కు ఒక ప‌రిమితి విధించుకోవ‌డం మంచిది. కార్డును జారీ చేసే సంస్థ‌లు నెట్ బ్యాంకింగ్ వేదిక‌గా ఈ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తాయి. క్ర‌మ‌మైన వ్యవ‌ధిలో స్టాటిక్ పాస్‌వ‌ర్డ్‌ను మార్చుకుంటూ ఉండాలి. మీ లావాదేవీల గురించి మీ మొబైల్‌కు వ‌చ్చే ఎస్ఎమ్ఎస్‌ల‌ను త‌రుచూ చూస్తుండాలి. మీ కార్డుకు సంభందించిన వివ‌రాల‌ను ఫోనులో ఉంచ‌డం స‌రికాద‌ని గుర్తుంచుకోండి. కార్డు ద్వారా జ‌రిగే మోసాల‌కు గురికాకుండా మీ వంతు జాగ్ర‌త్త‌లు తీసుకుని అప్ర‌మ‌త్తంగా ఉండండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని