Health Insurance: రెన్యువ‌ల్ చేశారా..? 

ఆరోగ్య బీమా పాల‌సీని తీసుకోవ‌డం ఎంత ముఖ్య‌మో, స‌మ‌యానికి పున‌రుద్ధ‌రించ‌డం కూడా అంతే ముఖ్యం. 

Updated : 30 Apr 2021 22:50 IST

ఆరోగ్య బీమాలో అన్ని ప్ర‌యోజ‌నాలు పొందాల‌న్నా.. పాల‌సీ ర‌ద్దు కాకుండా ఉండాల‌న్నా స‌మ‌యానికి పున‌రుద్ధ‌రించ‌డం (రెన్యువ‌ల్) చేయించ‌డం అవ‌స‌రం. స‌రైన స‌మ‌యంలో పున‌రుద్ధ‌రించ‌డం మ‌ర్చిపోతే,  ఇందుకు అయ్యే ఖర్చు పెర‌గ‌డంతో పాటు, అనేక ఇబ్బందులు ఎదుర్కోవ‌ల‌సి రావ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కి, పున‌రుద్ధ‌ర‌ణ ఆల‌స్యం కావ‌డం వ‌ల్ల పాల‌సీ ర‌ద్ద‌యితే మ‌ర‌ల పాల‌సీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో వెయిటింగ్ పిరియ‌డ్‌, నోక్లెయిమ్ బోన‌స్ వంటి ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు.  అందువ‌ల్ల ఆరోగ్య బీమా కొనుగోలు చేయ‌డంతో పాటు నిర్వ‌హించడంలోనూ శ్ర‌ద్ధ వ‌హించాలి. 

స‌మ‌యం మించ‌కుండా చూడాలి..
ప్ర‌స్తుతం మార్కెట్లో వంద‌లాది పాల‌సీలు విభిన్న అంశాల‌తో అందుబాటులో ఉన్నాయి. పాల‌సీ ఫీచ‌ర్లు చూపి.. ఏజెంట్లు పాల‌సీల కొనుగోలు వైపు ఆక‌ర్షింపచేస్తుంటారు. ఇప్ప‌టికే ఆరోగ్య బీమా పాల‌సీ ఉంద‌ని చెప్పిన‌ప్ప‌టికీ కొత్త‌ పాల‌సీ కొనుగోలు చేయ‌మ‌ని ప‌ట్టుబ‌డ‌తారు. 

అయితే, మీరు ఇప్ప‌టికే పాల‌సీ తీసుకుని వుంటే, పాత పాల‌సీని పున‌రుద్ధ‌రించుకోవ‌డం మంచింది. దీని వ‌ల్ల వెయిటింగ్ ప‌రియ‌డ్‌తో పాటు, నో క్లెయిమ్ బోన‌స్ ప్ర‌యోజ‌నాలు కోల్పోకుండా ఉంటారు. ఇందుకోసం పాల‌సీ ఎప్పుడు పున‌రుద్ధారించాలో.. గుర్తించుకోవాలి. పున‌రుద్ధ‌ర‌ణ తేది ద‌గ్గ‌ర‌లో ఉన్న‌ప్పుడు, ప్ర‌స్తుతం ఉన్న‌ పాల‌సీ కంటే కొత్త‌గా వ‌చ్చిన పాల‌సీలు క‌వ‌రేజ్ ఎక్కువ‌గా ఇస్తున్నాయ‌నుకుంటే.. కొత్త‌ పాల‌సీకి మార‌చ్చు. ఇందుకోసం పార్ట‌బిలిటీ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల వెయిటింగ్ ప‌రియ‌డ్..వంటి ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోకుండా ఉంటారు. అదేవిధంగా ఎక్కువ క‌వరేజ్‌ను పొంద‌గ‌ల‌ర‌ని నిపుణులు చెబుతున్నారు. 

పాల‌సీ పున‌రుద్ధ‌రించేప్పుడు, బీమా సంస్థ‌, జోన్ అప్‌గ్రేడ్, అవుట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్‌(ఓపీడీ) లేదా రోజువారి న‌గ‌దు ప్ర‌యోజ‌నం వంటి ఇత‌ర ఉప‌యోగ‌క‌ర‌మైన యాడ్‌ల‌ను అందిస్తుందా.. అనేది చూడాలి. మీ పాల‌సీలో లేని యాడ్‌-ఆన్ల‌ను తీసుకోవ‌చ్చు. 

సరిప‌డ క‌వ‌రేజ్ ఉందా.. నిర్ధారించుకోవాలి..
చికిత్స‌ల‌కయ్యే ఖ‌ర్చులు రోజురోజుకి పెరిగి పోతున్నాయి. మధ్యతరగతి వ్యక్తికి వాటిని భ‌రిచ‌డం చాలా క‌ష్టం. అందువల్ల, పునరుద్ధరణ సమయంలో, పాల‌సీలో ఉన్న క‌వ‌రేజ్‌ సరిపోదని భావిస్తే, పెంచుకునేందుకు ప్రయత్నించాలి. మీకు ఎంత బీమా అవ‌స‌రం అనేది తెలుసుకోవాలి. ఇందుకోసం మునుప‌టి క్లెయిమ్‌ల‌ను, ప్ర‌స్తుత ఆరోగ్య స్థితిని స‌మీక్షించ‌డం మంచిది. పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో స‌రిప‌డా క‌వ‌రేజ్‌తోనే పాల‌సీ తీసుకున్న‌ప్ప‌టికి, కోవిడ్ ప‌రిస్థితుల దృష్ట్యా క‌వ‌రేజ్‌ను పెంచుకోవ‌డం మంచిద‌నేది నిపుణుల అభిప్రాయం. ఇప్పుడు ఉన్న స్థితిలో ఒక వ్య‌క్తికి క‌నీసం రూ.10 నుంచి 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆరోగ్య బీమా క‌వ‌రేజ్ ఉండాలి. 

దాచిపెట్టడం మంచిది కాదు..
పాలసీ పునరుద్ధరణ సమయంలో కొత్త‌గా వ‌చ్చిన ఆరోగ్య స‌మ‌స్య‌లు వంటి.. కీలకమైన సమాచారాన్ని బీమా సంస్థ‌కు తెలియ‌జేయ‌డం చాలా ముఖ్యం, ఇలా చేయ‌డం వ‌ల్ల‌  భవిష్యత్తు క్లెయిమ్‌ల‌కు ఇబ్బంది ఉండ‌దు. నిజాల‌ను దాచిపెట్ట‌డం వ‌ల్ల, బీమా సంస్థ క్లెయిమ్‌ల‌ను తిర‌స్క‌రించే అవ‌కాశం ఉంటుంది. ఇబ్బందులు ప‌డ‌కూడ‌దంటే.. పారదర్శకంగా వ్య‌వ‌హ‌రించాలి. ప్ర‌స్తుత ఆరోగ్యస్థితిగ‌తుల గురించి బీమా సంస్థ‌కు తెలియ‌జేస్తే, మీ అవ‌స‌రాల‌కు త‌గిన మెరుగైన ప‌థ‌కాల‌ను ఎంచుకోవ‌డంలో సంస్థ‌ మీకు స‌హాయ‌ప‌డుతుంది. 

గ్రేస్ పిరియ‌డ్‌లోనే పున‌రుద్ధ‌రించాలి..
పాల‌సీ తీసుకున్న ఏడాది లోపు ఎటువంటి క్లెయిమ్ చేయ‌క‌పోతే, పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో కుమ్యులేటీవ్ బోన‌స్ పొందేందుకు అర్హ‌త ఉంటుంది. కాబ‌ట్టి ఎటువంటి క్లెయిమ్‌లు చేయ‌ని వారు, కొత్త పాల‌సీ ప్రీమియంకు కుమ్యూలేటీవ్ బోన‌స్ ప్ర‌యోజ‌నం వ‌ర్తించిందా.. అనేది త‌నిఖీ చేసుకోవాలి. అయితే ఇక్క‌డ ఒక విష‌యం గుర్తించుకోవాలి. పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ‌కు 30 రోజుల గ్రేస్ పిరియ‌డ్ ఉంటుంది. గడువు తేది నుంచి 30 రోజుల‌లోపు పాల‌సీ పున‌రుద్ధ‌రించ‌క‌పోతే ఎలాంటి ప్ర‌యోజ‌నం ల‌భించ‌దు. పాల‌సీ ర‌ద్దు అవుతుంది కాబ‌ట్టి మ‌ర‌ల కొనుగోలు చేసినా కొత్త పాల‌సీ కిందికి వ‌స్తుంది. దీంతో మ‌ళ్లీ వెయిటింగ్ పిరియ‌డ్ ఉంటుంది. ఈ వెయిటింగ్ పిరియ‌డ్‌లో ఏదైనా వైద్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు వ‌స్తే, పాల‌సీ క‌వ‌ర‌వ్వ‌దు. దీంతో మీరు పాల‌సీ తీసుకున్న ప్ర‌యోజ‌నం లేకుండా పోతుంది. కాబ‌ట్టి ఆరోగ్య బీమా పాల‌సీని తీసుకోవ‌డం ఎంత ముఖ్య‌మో, స‌మ‌యానికి పున‌రుద్ధ‌రించ‌డం కూడా అంతే ముఖ్యం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని