రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ‘రుణదాతల’కు చుక్కెదురు

రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ పరిష్కార ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలపడాన్ని సవాలు చేస్తూ కార్యనిర్వాహక రుణదాతలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దివాలా స్మృతి(ఐబీసీ)

Published : 11 Aug 2021 01:52 IST

సవాలును తిరస్కరించిన సుప్రీం

దిల్లీ: రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ పరిష్కార ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలపడాన్ని సవాలు చేస్తూ కార్యనిర్వాహక రుణదాతలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దివాలా స్మృతి(ఐబీసీ) నిబంధనల కింద కమిటీ ఆఫ్‌ క్రెడిటర్స్‌(సీఓసీ)లో మెజారిటీ సభ్యుల అనుమతి ఆ పరిష్కార ప్రణాళికకు లభించిందని కోర్టు వ్యాఖ్యానించింది. ‘సీఓసీలో 100 శాతం ఓటింగ్‌ వాటాతో పరిష్కార ప్రణాళికకు ఆమోదం లభించిన కారణంగా కొంత మంది క్రెడిటర్ల అభిప్రాయం ప్రభావం చూపజాలద’ని న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎమ్‌.ఆర్‌. షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘అవసరమైన అనుమతులు పూర్తయిన కారణంగా అప్పీలేట్‌ అథారిటీ తీసుకున్న నిర్ణయాలు చట్టానికి లోబడే ఉన్నాయని మేం విశ్వసిస్తున్నాం. ఈ అప్పీలుకు అర్హత లేని(నో మెరిట్‌) కారణంగా తిరస్కరిస్తున్నామ’ని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. డిసెంబరు 3, 2020న రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ పరిష్కార ప్రణాళికను ఎన్‌సీఎల్‌టీ ముంబయి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత జనవరి 2021న ఎన్‌సీఎల్‌ఏటీ దాన్ని సమర్థించింది. కానీ కార్యకలాపాల్లో ప్రధాన సేవలను తాము అందించామని, అయితే ప్రణాళిక కింద తక్కువ నిధులు తమకు ఇచ్చారని.. ‘న్యాయమైన, సమానమైన’ వాటా దక్కలేదంటూ ఎన్‌సీఎల్‌టీ, ఎన్‌సీఎల్‌ఏటీల అనుమతులను కార్యనిర్వాహక క్రెడిటర్లు సవాలు చేశారు. కాగా, కార్పొరేట్‌ రుణస్వీకర్త(రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌) లిక్విడేషన్‌ విలువ రూ.4339.58 కోట్లు అని.. పరిష్కార దరఖాస్తుదారు రూ.3720 కోట్ల నిధులను జొప్పించారని కోర్టు గుర్తించింది.


బీపీఈఏ చేతికి హెచ్‌జీఎస్‌ ఆరోగ్య సేవలు

దిల్లీ: హిందుజా గ్రూప్‌ కంపెనీ హిందుజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌(హెచ్‌జీఎస్‌) తన ఆరోగ్యసంరక్షణ సేవల వ్యాపారాన్ని బేరింగ్‌ ప్రైవేట్‌ ఈక్విటీ ఏషియా(బీపీఈఏ)కు విక్రయించనుంది. ‘1.2 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.9000 కోట్లు) ఎంటర్‌ప్రైజ్‌ విలువ ఆధారంగా బీపీఈఏతో లావాదేవీ జరగనుంది. 90 రోజుల్లో ఇది పూర్తి అవుతుందని అంచనా. వాటాదార్ల ఆమోదం, ఇతర నియంత్రణ అనుమతులపై ఇది ఆధారపడి ఉంటుంద’ని ఎక్స్ఛేంజీలకు హెచ్‌జీఎస్‌ సమాచారం ఇచ్చింది. లావాదేవీ పూర్తయ్యాక హెచ్‌జీఎస్‌ తన అన్ని క్లయింట్ల కాంట్రాక్టులు, ఉద్యోగులు, ఆస్తులు (మౌలిక నుంచి ఆరోగ్య సేవల వ్యాపారానికి సంబంధించినవి) బదిలీ చేస్తుంది. కంపెనీకి చెందిన ఆరోగ్యసంరక్షణ సేవల విభాగంలో 20,000 మందికి పైగా ఉద్యోగులున్నాయి. భారత్‌, ఫిలిప్పీన్స్‌, అమెరికా, జమైకాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ నికర లాభం 2020-21లో రెట్టింపై రూ.117 కోట్లకు చేరింది. ఆదాయాలు 25.5% వృద్ధి చెంది రూ.1550.5 కోట్లకు చేరుకున్నాయి.

భవిష్యత్‌ వృద్ధికి నిధులు

‘వచ్చిన నిధులను సంస్థ భవిష్యత్‌ వృద్ధి పెట్టుబడుల కోసం ఉపయోగించనున్న’ట్లు హెచ్‌జీఎస్‌ గ్లోబల్‌ సీఈఓ పార్థ డీసర్కార్‌ పేర్కొన్నారు. అదే సమయంలో కంపెనీ తన సీఈఎస్‌, డిజిటల్‌ వ్యాపారాలను వేగంగా విస్తరించడంపై దృష్టి కొనసాగిస్తుందనీ వివరించారు. ‘అనలిటిక్స్‌, కృత్రిమ మేధ, ఆటోమేషన్‌(ట్రిపుల్‌ ఏ)లను దృష్టిలో ఉంచుకుని తమ భవిష్యత్‌ వ్యూహాన్ని రచించనున్న’ట్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని