ఈఎల్ఎస్ఎస్, యులిప్స్... రెండింటిలో ఏది మేలు?

ఈఎల్ఎస్ఎస్, యులిప్స్ మ‌ధ్య చాలా వ్య‌త్యాసాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం

Published : 15 May 2021 14:33 IST

ఈఎల్ఎస్ఎస్, యులిప్స్ రెండింటిలో ప‌న్ను మిన‌హాయింపులున్నా రెండింటికి చాలా తేడా ఉంది. ఈ పెట్టుబ‌డి సాధ‌నాల‌ను ఎంచుకునే ముందు స‌గ‌టు పెట్టుబ‌డిదారుడికి వాటి గురించి తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

ఈక్విటీ లింక్‌డ్ సేవింగ్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్):
ఈక్విటీ-లింక్డ్ పొదుపు పథకం (ఈఎల్ఎస్ఎస్) ఎక్కువ భాగం ఈక్విటీ సాధ‌నాల్లో పెట్టుబడి పెట్టే వైవిధ్యమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడుల నుంచి వచ్చే రాబడులు, ప్రజా భవిష్య నిధి (పీపీఏప్), జాతీయ సేవా సర్టిఫికేట్లు (ఎన్ఏస్సీ), స్థిర బ్యాంకు డిపాజిట్ల నుంచి వచ్చే రాబడులతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా, భారతీయ ఆదాయ‌ పన్నుచట్టం, 1961 సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

రూ. 1 లక్ష కంటే ఎక్కువ దీర్ఘకాలిక మూలధన లాభాలపై 10 శాతం పన్ను విధిస్తారు. ఈఎల్ఎస్ఎస్‌లో 3 సంవ‌త్స‌రాల‌ లాక్ - ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. ఇది ఇత‌ర పెట్టుబ‌డి సాధానాలైన ఎన్ఎస్సీ, పీపీఏఫ్‌, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి వాటితో పోలిస్తే త‌క్కువ‌నే చెప్పాలి. ఇతర పన్ను మినహాయింపు పెట్టుబడుల కాలపరిమితి వరుసగా 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలుగా ఉంది. కాబ‌ట్టి వీటితో పోలిస్తే ఈఎల్ఎస్ఎస్ లో త‌క్కువ కాల‌ప‌రిమితికి నిధుల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు.
ఇది ఈక్విటీ ఆధారిత పెట్టుబడి పథకం కాబ‌ట్టి తక్కువ న‌ష్ట‌భ‌యం ఉండే పెట్టుబడ‌ల నుంచి వచ్చే రాబ‌డి కంటే వీటి ద్వారా వ‌చ్చే రాబడి ఎక్కువగా ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ ద్వారా వచ్చే రాబ‌డికి హామీ ఉండ‌దు. ఎందుకంటే ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లు మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటాయి.

యునిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యులిప్స్):
పెట్టుబడి కేటాయింపులను ఎంచుకునే సౌలభ్యత ఉండటం యులిప్స్‌ ప్రత్యేకత. యులిప్స్‌ మార్కెట్‌ ఒడిదొడుకులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి పెట్టుబడులపై లాభనష్టాలను పూర్తిగా పెట్టుబడిదారే భరించాల్సి వస్తుంది. జీవిత బీమాతో పాటు పెట్టుబడి మార్గాన్ని ఎంపిక చేసుకోవాలనుకునేవారికి యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు (యులిప్స్‌) మంచి ఎంపిక. యులిప్స్‌ కోసం చెల్లించే ప్రీమియంను కొంత మొత్తం బీమా కోసం, మరి కొంత సొమ్ము ఛార్జీలను మినహాయించుకొని మిగతా సొమ్మును మ్యూచువల్‌ ఫండ్ల యూనిట్ల పెట్టుబడులకు వినియోగిస్తారు.

ఈక్విటీ, డెట్‌, బ్యాలెన్స్‌డ్‌ లాంటి వివిధ రకాల మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని యులిప్స్‌ కల్పిస్తాయి. ఒక ఫండ్‌ నుంచి మరోదానికి మారేందుకు యులిప్‌లో వెసులుబాటు ఉంది. ఎంచుకున్న యులిప్స్‌ విలువ ఆ పాలసీలో కలిగి ఉన్న ఫండ్ల యూనిట్లపై , వాటి పనితీరుపై ఆధారపడి ఉంటుంది. అందుకే యులిప్‌ పథకం వివిధ రకాల నష్టభయాలతో కూడుకొని ఉంటుంది.

* యూలిప్స్.. మదుపు, బీమాని ఒకే పాలసీ కింద అందిస్తాయి. దీని మూలంగా ఒకప్పుడు వీటికి చాల క్రేజ్ ఉండేది. కానీ తరువాత మర్కెట్స్ ఒడిదుడుకుల వల్ల అనుకున్న స్థాయిలో ఇవి రాబడి అందించలేక పోయాయి. ఇప్పుడు యూలిప్స్ ముందు కంటే మెరుగ్గా రూపు దిద్దుకున్నాయి.

* ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సీ కింద ఒక ఏడాదిలో రూ.1.5లక్షల వరకూ చెల్లించే ప్రీమియంపై పన్ను చెల్లించనక్కర్లేదు. పాలసీ కొనసాగుతుండగా పాలసీదారు అనుకోకుండా మృతిచెందితే నామినీ అందుకునే బీమా హామీ సొమ్ముపై ఎటువంటి పన్ను విధించరు.

* గడువు ముగిసి పాలసీదారు స్వయంగా బీమా మెచ్యూరిటీ సొమ్ము పొందినట్టయితే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 10(10 డీ) ప్రకారం పన్ను చెల్లించనక్కర్లేదు.

* పాలసీని అయిదేళ్ల తర్వాత స్వాధీనపర్చినా కూడా ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించకర్లేదు. అయిదేళ్లలోపు స్వాధీనపరిచే పాలసీలకు వ్యక్తుల ఆదాయ శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

* మీ పెట్టుబ‌డుల ల‌క్ష్యం కేవ‌లం ప‌న్ను మిన‌హాయింపుల‌తో కూడిన లాభాన్ని పొందాల‌నుకుంటే ఈఎల్ఎస్ఎస్ ఎంచుకోవ‌డం మేలు. స్వ‌ల్ప కాలిక పెట్టుబ‌డులు, మంచి రాబ‌డుల‌కు, ఈక్విటీ ఆధారిత పెట్టుబ‌డులు చేయాల‌నుకుంటున్న వారికి ఈఎల్ఎస్ఎస్‌ మంచి సాధనం. అయితే ఇక్క‌డ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈక్విటీ పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలిక ల‌క్ష్యానికి ఉద్దేశించిన‌వి , ఎంత ఎక్కువ‌కాలం పెట్టుబ‌డులు కొన‌సాగిస్తే అంత ఎక్కువ‌గా ప్ర‌యోజ‌నాలు పొందుతారు.

* మంచి లాభాల‌తో పాటు, బీమాను కూడా అందించే విధంగా ఉండాలంటే యులిప్స్‌ను ఎంచుకోవ‌డం మేలు. ఇందులో కూడా ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. యులిప్స్ దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డులు, ఆర్థిక ల‌క్ష్యాల కోసం కొన‌సాగిస్తే మంచిది. యులిప్ 

* పెట్టుబ‌డిదారుడి ల‌క్ష్యాన్ని బ‌ట్టి ఎందులో పెట్టుబ‌డులు చేయాలో నిర్ణ‌యించుకోవాలి. ఎంత కాలం కొన‌సాగిస్తారు, రిస్క్ ఎంత తీసుకుంటారు అనే దానిపై పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించాలి. అయితే ఈఎల్ఎస్ఎస్, యులిప్స్ ప్ర‌యోజ‌నాలు వేరే అన్న విష‌యాన్ని గుర్తుంచుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని