పీఎఫ్ విత్‌డ్రాపై టీడీఎస్ ఎప్పుడు వ‌ర్తిస్తుంది?

ఐదేళ్లు, అంత‌కంటే ఎక్కువ నిరంత‌ర స‌ర్వీస్ ఉన్న ఉద్యోగులకు పీఎఫ్ బ్యాలెన్స్‌పై ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది

Updated : 25 Mar 2021 16:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈపీఎఫ్ (ఉద్యోగ భవిష్య నిధి) అనేది ఒక పదవీ విరమణ పొదుపు పథకం. ప్రతి నెలా ఉద్యోగులు వారి ప్రాథమిక జీతం నుంచి 12 శాతం మొత్తాన్ని ఈపీఎఫ్కు చెల్లిస్తారు. ఇదే మొత్తాన్ని యజమాని కూడా ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాకు చెల్లిస్తారు. ఈపీఎఫ్ ఉప‌సంహ‌ర‌ణ‌ల‌పై టీడీఎస్‌ (మూలం వ‌ద్ద ప‌న్ను) వ‌ర్తింపు, త‌దిత‌ర విష‌యాల‌ను ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం. ఈపీఎఫ్ స‌భ్యుడి ఖాతాలో రూ.50వేల కంటే ఎక్కువ మొత్తం జ‌మైన‌ప్పుడు, ఉద్యోగి ప‌నిచేసిన కాలం 5 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ ఉన్న‌ప్పుడు ఈపీఎఫ్‌ విత్‌డ్రాల‌పై ప‌న్ను టీడీఎస్ వ‌ర్తిస్తుంది. 

టీడీఎస్ ఎప్పుడు వ‌ర్తించ‌దు..?
* ఒక ఖాతా నుంచి మ‌రొక ఖాతాకు పీఫ్ బ‌దిలీ చేసుకున్న‌ప్పుడు
* ఈపీఎఫ్ స‌భ్యుడు అనారోగ్యం కార‌ణంగా ఉద్యోగం నుంచి వైదొల‌గిన‌ప్పుడు
* య‌జ‌మాని వ్యాపారాన్ని నిలిపివేసిన‌ప్పుడు.. ఈపీఎఫ్ స‌భ్యుని నియంత్ర‌ణ‌లో లేని ఇతర కార‌ణాల వ‌ల్ల
* పీఎఫ్ మొత్తం రూ.50వేల కంటే త‌క్కువ ఉన్న‌ప్పుడు.. వెన‌క్కి తీసుకునే స‌మ‌యంలో ప‌న్ను వ‌ర్తించ‌దు.

టీడీఎస్ ఎప్పుడు వ‌ర్తిస్తుంది..
ఉద్యోగి స‌ర్వీస్ 5 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ ఉండి, రూ.50వేలు అంత‌కంటే ఎక్కువ మొత్తం విత్‌డ్రా చేసుకుంటే..
ఏ. పాన్ కార్డు మాత్ర‌మే ఇచ్చి, ఫారం - 15జి/15హెచ్ ఇవ్వ‌క‌పోతే 10 శాతం టీడీఎస్‌ డిడ‌క్ట్ చేస్తారు. 
బి. పాన్ కార్డు ఇవ్వ‌డంలో విఫ‌ల‌మైతే గ‌రిష్ఠంగా (34.608 శాతం) టీడీఎస్ క‌ట్ చేస్తారు. 

ఇతర ముఖ్య విష‌యాలు
* ఈపీఎఫ్‌ విత్‌డ్రా స‌మ‌యంలో, ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961 సెక్ష‌న్ 192ఏ అనుస‌రించి టీడీఎస్ (మూలం వ‌ద్ద ప‌న్ను) డిడ‌క్ట్ చేస్తారు. 

* ఈపీఎఫ్ స‌భ్యులు, ఫారం 15జి/15హెచ్, ఫారం నెం.19 (విత్‌డ్రా ఫారం)ల‌లో పాన్‌ను నంబ‌రును త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాలి. 

* 5 సంవ‌త్స‌రాలు, అంత‌కంటే ఎక్కువ నిరంత‌ర స‌ర్వీస్ ఉన్న ఉద్యోగులు ఫారం నెం.19తో పాటు పాన్‌, ఫారం 15జి/15హెచ్ ల‌ను ఇవ్వాల్సిన‌ అవ‌స‌రం లేదు. ఇక్క‌డ పాత సంస్థ‌లో ప‌నిచేసిన కాలాన్ని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. 

* టీడీఎస్ వ‌ర్తించ‌ట్లేదు అంటే, దాని అర్థం ఈపీఎఫ్ విత్‌డ్రాల‌పై కూడా ప‌న్ను వ‌ర్తించ‌ద‌ని కాదు. ఐదేళ్ల నిరంత‌ర స‌ర్వీస్‌కు ముందే పీఎఫ్ బ్యాలెన్స్ విత్‌డ్రా చేసుకుంటే, విత్‌డ్రా చేసుకున్న‌ అదే సంవ‌త్స‌రంలో ప‌న్ను విధిస్తారు. దీనికి తోడు సంస్థ వాటా, దాని‌పై సేక‌రించిన‌ వ‌డ్డీల‌ను "జీతానికి అద‌నంగా వ‌చ్చిన లాభాలు" గా భావించి ప‌న్ను విధిస్తారు. ఉద్యోగి వాటా నుంచి సేక‌రించిన వ‌డ్డీ మొత్తంపై ‘‘ఇత‌ర మార్గాల ద్వారా వ‌చ్చిన ఆదాయం (ఇన్‌క‌మ్ ఫ్ర‌మ్ అద‌ర్ సోర్స్‌)’’ పేరిట ప‌న్ను విధిస్తారు. ఉద్యోగి కాంట్రీబ్యూష‌న్ల‌పై క్లెయిమ్ చేసిన ప‌న్ను మిన‌హాయింపులు వెన‌క్కి తీసుకుంటారు. ప‌న్ను చెల్లించాలి. 

* ఐదేళ్లు, అంత‌కంటే ఎక్కువ నిరంత‌ర స‌ర్వీస్ ఉన్న ఉద్యోగులకు పీఎఫ్ బ్యాలెన్స్‌పై ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

* ఉద్యోగి 5 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ కాలం ప‌నిచేసి, 5 సంవ‌త్స‌రాలు పీఎఫ్‌ స‌భ్యుడిగా కొన‌సాగిన‌ప్ప‌టికీ, టీడీఎస్ విష‌యంలో 5 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ స‌ర్వీస్ ఉన్న‌ట్లుగానే లెక్కిస్తారు. ఈ సంద‌‌ర్భంలో పాత సంస్థ పీఎఫ్ ట్ర‌స్ట్ టీడీఎస్‌ను డిడ‌క్ట్ చేసే అర్హ‌త/అవ‌కాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని