EPF Withdraw Rules: ఏ సంద‌ర్భాల‌లో ఈపీఎఫ్ నిధుల‌ను విత్‌డ్రా చేసుకోవ‌చ్చు? 

ఈపీఎఫ్ చందాదారులు, విద్య‌, వైద్యం, వివాహం, గృహ నిర్మాణం వంటి ప‌లు సంద‌ర్భాల‌లో ఈపీఎఫ్ నుంచి పాక్షికంగా డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. 

Updated : 28 Dec 2021 16:49 IST

ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితం కోసం పొదుపును ప్రోత్స‌హించేందుకు ఉద్దేశించిన ప‌థ‌కం ఉద్యోగి భ‌విష్య నిధి. ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్(ఈపీఎఫ్ఓ) దీన్ని నిర్వ‌హిస్తుంది.  ఈపీఎఫ్ నియ‌మాల ప్ర‌కారం 20 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న‌ సంస్థ‌లు నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఈపీఎఫ్ ప‌రిధిలోకి వ‌స్తాయి. ఇలాంటి సంస్థ‌ల‌లో ప‌నిచేసే ఉద్యోగులు త‌మ బేసిక్‌ వేత‌నం నుంచి 12శాతం ఈపీఎఫ్‌కి కాంట్రీబ్యూట్ చేయాలి. ఇదే మొత్తాన్ని సంస్థ కూడా ఉద్యోగి ఖాతాకు జ‌మ చేస్తుంది. ఈ మొత్తం ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ఉద్దేశించ‌న‌దే అయినా..కొన్ని సంద‌ర్భాల‌లో పూర్తిగా లేదా పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే వీలుక‌ల్పించింది ఈపీఎఫ్ఓ. ఏ సంద‌ర్భాల్లో ఈపీఎఫ్ డ‌బ్బును విత్‌డ్రా చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి మొత్తం ఎప్పుడు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు?
ఈ కింది సంద‌ర్భాల‌లో ఖాతాలోని డ‌బ్బును పూర్తిగా విత్‌డ్రా చేసుకునేందుకు ఈపీఎప్ఓ అనుమ‌తిస్తుంది. 
* ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన‌ప్పుడు
* రెండు నెల‌లు లేదా అంత‌కంటే ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉన్న‌ప్పుడు పూర్తి మొత్తం విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. అయితే ఉద్యోగానికి ఉద్యోగానికి మ‌ధ్య‌ విరామ స‌మ‌యంలో, లేదా కొత్త కంపెనీకి మారిన‌ప్పుడు పీఎఫ్ మొత్తాన్ని పూర్తిగా విత్‌డ్రా చేసుకోలేరు. 
* రిటైర్‌మెంట్ వ‌య‌సు కంటే ముందే మ‌ర‌ణించిన‌ప్పుడు

పాక్షిక విత్‌డ్రాల‌ను ఏయే సంద‌ర్భాల‌లో అనుమ‌తిస్తారు?
1. వైద్యం కోసం…
అనారోగ్యం కార‌ణంగా లేదా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌చ్చినా ఆరోగ్య బీమా పాల‌సీ ఆదుకుంటుంది. ఆరోగ్య బీమా పాల‌సీ లేని వారు,  లేదా  స‌మ‌గ్ర క‌వ‌రేజ్ లేన‌ప్పుడు అత్య‌వ‌స‌రంగా వైద్య చికిత్స చేయించుకోవాల్సి వ‌చ్చినా, స‌ర్జ‌రీ వంటివి అవ‌స‌ర‌మైనా, ఈపీఎఫ్ నుంచి కొంత మొత్తాన్ని తీసుకునే అవ‌కాశం ఉంది. ఉద్యోగి, అత‌ని/ఆమె కుటుంబ స‌భ్యుల‌(జీవిత భాగ‌స్వామి, పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు) వైద్య చికిత్స‌ల నిమిత్తం ఈపీఎఫ్ నుంచి న‌గ‌దు పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. వైద్య చికిత్స‌ల నిమిత్తం ఎన్ని సార్ల‌యినా ఈపీఎఫ్ విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. దీంతో అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఈపీఎఫ్ మీకు స‌హాయ‌ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు.

స‌ర్వీస్‌, విత్‌డ్రా లిమిట్‌..
దీనికి ఖ‌చ్చితంగా ఇన్ని సంవ‌త్స‌రాలు స‌ర్వీస్ ఉండాలన్న నిబంధ‌న‌ లేదు. గ‌రిష్ఠంగా ఉద్యోగి నెల‌వారి బేసిక్ వేత‌నానికి 6 రెట్లు స‌మాన‌మైన డ‌బ్బు లేదా ఈపీఎఫ్‌కి కాంట్రీబ్యూట్ చేసిన మొత్తంలో ఉద్యోగి వాటా(వ‌డ్డీతో స‌హా).. ఈ రెండింటిలో ఏది త‌క్కువైతే అంత మొత్తాన్ని మాత్ర‌మే విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. 

2. వివాహం కోసం..
ఉద్యోగి త‌న వివాహం కోసం, పిల్ల‌ల పెళ్లిళ్ల కోసం, సోద‌రుడు లేదా సోద‌రి పెళ్లి కోసం ఈపీఎఫ్ నుంచి పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. 

స‌ర్వీస్‌, విత్‌డ్రా లిమిట్‌..
మీరు ఉద్యోగంలో చేరి ఏడు సంవ‌త్స‌రాలు పూర్త‌యిన త‌ర్వాత పెళ్లి కోసం ఈపీఎఫ్ నుంచి డ‌బ్బు తీసుకోవ‌చ్చు. స‌ర్వీసులో ఉన్నకాలంలో 3 సార్లు ఈ కార‌ణంతో ఈపీఎఫ్ విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం ఉంటుంది. ఈపీఎఫ్‌కి కాంట్రీబ్యూట్ చేసిన మొత్తంలో ఉద్యోగి వాటా భాగం నుంచి గ‌రిష్ఠంగా 50శాతం వ‌ర‌కు  విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. సంస్థ ఈపీఎఫ్ ఖాతాలో జ‌మ‌చేసిన వాటాను ఉప‌సంహ‌రించుకునేందుకు వీలుండ‌దు. అంటే మీ ఈపీఎఫ్ ఖాతాలో రూ.10 ల‌క్ష‌లు ఉన్న‌ప్ప‌టికీ మొత్తం విత్‌డ్రా చేసుకునేందుకు వీలుండ‌దు. అందులో మీరు జమ చేసింది ఎంత అన్న‌దే లెక్క‌లోకి తీసుకుంటారు. ఖాతాలో ఉద్యోగి జ‌మ‌చేసిన మొత్తం, దానిపై వ‌డ్డీ మాత్ర‌మే విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుంది.

3. ఉన్న‌త విద్య కోసం..
స్వ‌యంగా ఉద్యోగి చ‌దువు కోసం లేదా పిల్ల‌ల చ‌దువుల కోసం ఈపీఎఫ్ న‌గ‌దును తీసుకోవ‌చ్చు. మెట్రిక్యులేష‌న్ త‌ర్వాత చ‌దువుల‌కు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంది. అంటే ప‌దో త‌ర‌గ‌తి పూర్తైన‌ త‌ర్వాత పై చ‌దువుల కోసం ఉప‌యోగించుకోవ‌చ్చు. మీ పిల్ల‌ల్ని ఏదేని కాలేజ్ లేదా యూనివ‌ర్సిటీలో గ్రాడ్యుయేష‌న్, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ లేదా ఇత‌ర ప్రొఫెష‌న‌ల్ కోర్సులో చేరుస్తున్న‌ప్పుడు ఈపీఎఫ్ తీసుకోవ‌చ్చు. 

స‌ర్వీస్‌, విత్‌డ్రా లిమిట్‌..
ఉద్యోగంలో చేరి ఏడు సంవ‌త్స‌రాలు పూర్త‌యిన త‌ర్వాతే ఇది ల‌భిస్తుంది. జీవిత కాలంలో మూడు సార్లు ఈ కార‌ణంతో ఈపీఎఫ్ నుంచి డ‌బ్బు తీసుకోవ‌చ్చు. ఈపీఎఫ్‌కి కాంట్రీబ్యూట్ చేసిన మొత్తంలో ఉద్యోగి వాటా భాగం నుంచి గ‌రిష్ఠంగా 50శాతం వ‌ర‌కు  విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. సంస్థ ఈపీఎఫ్ ఖాతాలో జ‌మ‌చేసిన వాటాను ఉప‌సంహ‌రించుకునేందుకు వీలుండ‌దు.  

4. ఇళ్లు, స్థ‌లం కొనుగోలు/నిర్మాణం…
నిర్మాణం పూర్త‌యిన ఇంటిని కొనుగోలు చేసేందుకు లేదా స్థ‌లాన్ని కొనుగోలు చేయాల‌నుకున్న‌ప్పుడు ఈపీఎఫ్ నుంచి ప‌రిమిత మొత్తంతో న‌గ‌దు తీసుకునే అవ‌కాశం ఉంది. ఈ కార‌ణంతో ఒక‌సారి మాత్ర‌మే ఈపీఎఫ్ నుంచి న‌గ‌దు విత్డ్రా చేసుకునే అవ‌కాశం ఉంటుంది. అయితే ఇందుకోసం ఇళ్లు లేదా స్థ‌లం.. ఉద్యోగి లేదా అత‌ను/ఆమె జీవిత భాగ‌స్వామి పేరుతో ఉండాలి. ఇద్ద‌రి పేరుతో ఉమ్మ‌డిగా కూడా ఉండ‌వ‌చ్చు ( ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌ పేరుతో క‌లిపి ఉండ‌కూడ‌దు) న‌గ‌దు విత్‌డ్రా వాయిదాలు ప్రారంభ‌మ‌యిన 6 నెల‌ల లోపు నిర్మాణం ప్రారంభించాలి. చివ‌రి ఇన్‌స్టాల్‌మెంట్ విత్‌డ్రా చేసుకున్న 12 నెల‌ల లోపుల నిర్మాణం పూర్తి చేయాలి. 

స‌ర్వీస్‌, విత్‌డ్రా లిమిట్‌..
అయిదేళ్ల స‌ర్వీస్ పూర్తి చేసి ఉండాలి. స్థ‌లం కొనుగోలు చేసేందుకు మీ నెల‌వారి బేసిక్ వేత‌నానికి(డియ‌ర్‌నెస్ అల‌వెన్స్‌తో క‌లిపి) 24 రెట్ల వ‌ర‌కు గ‌రిష్ఠంగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఇళ్లు, ఫ్లాట్ కొనుగోలు లేదా నిర్మాణం చేసేందుకు నెల‌వారి బేసిక్ వేత‌నానికి (డియ‌ర్‌నెస్ అల‌వెన్స్‌తో క‌లిపి) 36 రెట్ల మొత్తానికి స‌మాన‌మైన‌ తీసుకోవ‌చ్చు. ఆస్తి విలువ‌పై ఆధార‌ప‌డి కూడా ప‌రిమితులు ఉంటాయి. 

5. గృహ రుణ చెల్లింపు కోసం…
మీకు ఇదివ‌ర‌కే గృహ రుణం ఉంటే ఈపీఎఫ్ నుంచి కొంత భాగాన్ని ముంద‌స్తు రుణ చెల్లింపుల కోసం తీసుకోవ‌చ్చు. అయితే రుణం ఉద్యోగి, అత‌ను/ఆమె జీవిత భాగ‌స్వామి పేరుతో గానీ, ఇద్ద‌రి పేర్ల‌పై ఉమ్మ‌డిగా గానీ ఉండాలి. ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌ పేరుతో రుణం ఉంటే ఈపీఎఫ్ నుంచి ఈ కార‌ణంతో డ‌బ్బు విత్‌డ్రా చేసుకోలేరు.  అలాగే, పీఎఫ్ ఖాతాలో వ‌డ్డీతో క‌లిపి రూ.20వేల కంటే ఎక్కువ మొత్తం ఉండాలి. ఇంకా దీనికోసం ఇంటి అగ్రిమెంట్‌కు సంబంధించిన ఆధారాలు, గృహ రుణం తీసుకున్న‌ట్లుగా డాక్యుమెంట్లు వంటివి ఈపీఎఫ్ఓకి స‌మ‌ర్పించాలి.  ఈ డాక్యుమెంట్ల ఆధారంగా  డ‌బ్బు రుణం ఉన్న బ్యాంకు ఖాతాకు జ‌మ‌చేస్తారు. ఉద్యోగి చేతికి అందించ‌రు. 

స‌ర్వీస్‌, విత్‌డ్రా లిమిట్‌..
దీనికోసం ప‌దేళ్ల స‌ర్వీస్ ఉండాలి. ఒకేసారి మాత్ర‌మే ఈ కార‌ణంతో ఈపీఎఫ్ విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. అయితే ఇంటి కొనుగోలుకు లేదా గృహ రుణం చెల్లించేందుకు ఏదైనా ఒక కార‌ణంతోనే తీసుకోవాలి. రెండింటికి తీసుకునేందుకు అవ‌కాశం ఉండ‌దు. నెల‌వారి బేసిక్ వేత‌నానికి (డియ‌ర్‌నెస్ అల‌వెన్స్‌తో క‌లిపి) 36 రెట్ల మొత్తానికి స‌మానంగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. అయితే ఇక్క‌డ ఈపీఎఫ్ ఖాతాలో ఉద్యోగి, సంస్థ జ‌మ‌చేసిన మొత్తం నుంచి తీసుకోవ‌చ్చు. గృహ రుణ అస‌లు, వ‌డ్డీ చెల్లింపుల‌కు ఈ మొత్తాన్ని ఉప‌యోగించ‌వ‌చ్చు. 

6. ఇంటి రిపేర్/ఆధునీకర‌ణ కోసం..
ఇళ్లు నిర్మించి చాలా సంవ‌త్స‌రాలు అయితే పాత‌దైపోతుంది. దాంతో ఇంటికి రిపేర్లు రావ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అలాగే  కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయించాల్సి రావ‌చ్చు. దీనికి కూడా చాలా ఖ‌ర్చ‌వుతాయి. కొత్త‌గా నిర్మాణం చేప‌ట్టాల్సి వ‌స్తే, టైల్ మార్చ‌డం, మ‌రొక గ‌దిని క‌ట్ట‌డం వంటి వాటికి భారీగానే వెచ్చించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈపీఎఫ్ నుంచి పాక్షికంగా డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. అయితే ఇల్లు ఉద్యోగి, అత‌ను/ఆమె జీవిత భాగ‌స్వామి పేరుతో గానీ, ఇద్ద‌రి పేర్ల‌పై ఉమ్మ‌డిగా గానీ ఉండాలి. ఈ కార‌ణంతో రెండు సార్లు ఈపీఎఫ్ నుంచి డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.  ఇళ్లు నిర్మించిన 5 ఏళ్ల త‌ర్వాత ఒక‌సారి, 10ఏళ్ల త‌ర్వాత ఒక‌సారి రిపేర్ల కోసం డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. 

స‌ర్వీస్‌, విత్‌డ్రా లిమిట్‌..
దీనికోసం ప‌దేళ్ల స‌ర్వీస్ ఉండాలి. నెల‌వారి బేసిక్ వేత‌నానికి (డియ‌ర్‌నెస్ అల‌వెన్స్‌తో క‌లిపి) 12 రెట్లు స‌మానమైన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఉద్యోగి వాటా(వ‌డ్డీతో స‌హా) నుంచి మాత్ర‌మే విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుది.  

7. రిటైర్‌మెంట్‌కి ముందు..
ప‌ద‌వీ విర‌మ‌ణ ముందు కూడా పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు. ఉద్యోగికి 54 సంవ‌త్స‌రాలు నిండిన త‌రువాత‌, ప‌ద‌వీవిర‌మ‌ణ లేదా సూప‌ర్ యాన్యుటేష‌న్‌కి ఒక సంవ‌త్స‌రం ముందు పీఎఫ్ ఖాతాలో జ‌మైన మొత్తం నుంచి 90శాతం నిధిని  విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని