56శాతం పెరిగిన ఈపీఎఫ్ఓ చందాదారులు

ఈపీఎఫ్ఓ నివేదిక ప్ర‌కారం 2020 ఏప్రిల్- అక్టోబ‌రు మ‌ధ్య‌ కాలంలో దాదాపు 39.33 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు ల‌భించాయి...

Updated : 01 Jan 2021 18:48 IST

ఈపీఎఫ్ఓ నివేదిక ప్ర‌కారం 2020 ఏప్రిల్- అక్టోబ‌రు మ‌ధ్య‌ కాలంలో దాదాపు 39.33 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు ల‌భించాయి

క‌రోనా మ‌హమ్మారి నేప‌థ్యంలోనూ సంఘ‌టిత రంగంలో 2020 అక్టోబ‌రులో 11.55 ల‌క్ష‌ల నిక‌ర ఉద్యోగాల సృష్టి జ‌రిగింద‌ని ఉద్యోగుల భ‌విష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) వెల్ల‌డించింది. అంత‌కు ముందు ఏడాది ఇదే స‌మ‌యంలో 7.39 ల‌క్ష‌ల ఉద్యోగాలు ల‌భించ‌గా, ఈ సంఖ్య‌తో పోలిస్తే అక్టోబ‌రులో 56 శాతం అధికంగా వృద్ధి జ‌రిగిందని సంస్థ తెలిపింది. అయితే 2020 సెప్టెంబ‌రులో న‌మోదైన 14.19 ల‌క్ష‌ల ఉద్యోగాల‌తో పోలిస్తే మాత్రం స్వ‌ల్ప త‌గ్గుద‌ల క‌నిపిస్తుంద‌ని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఆదివారం విడుద‌ల చేసిన తాజా నివేదిక ప్ర‌కారం 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఏప్రిలో 1,79,685, న‌వంబ‌రులో 1,49,248 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అంటే ఈ కాలంలో ఈపీఎఫ్‌లో కొత్త‌గా చేరిన స‌భ్యులు, తిరిగి చేరిన స‌భ్యుల కంటే ఉద్యోగం కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తుంది.

2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో నిక‌ర కొత్త చందాదారుల సంఖ్య 78.58 ల‌క్ష‌లు ఉండ‌గా, అంత‌కు ముందు సంవ‌త్స‌రం ఈ సంఖ్య‌ 61.12 ల‌క్షలు‌గా న‌మోదైంది. ఈపీఎఫ్ఓ చెల్లింపుల డేటాను సెప్టెంబ‌రు 2017 సంబంధించిన డేటాను మొద‌టిసారిగా ఏప్రిల్ 2018 నుంచి విడుద‌లచేసింది. అప్ప‌టి నుంచి ప్ర‌తీ నెల డేటాను విడుద‌ల చేస్తూ వ‌స్తుంది.

2017సెప్టెంబ‌రు - 2020 అక్టోబ‌రు మ‌ధ్య కాలంలో నిక‌ర కొత్త చందాదారుల సంఖ్య 1.94 కోట్లుగా ఉంది. అక్టోబ‌రు 2020లో 7.5 ల‌క్ష‌ల మంది కొత్త స‌భ్యులు చేర‌గా దాదాపుగా 2.40 ల‌క్ష‌ల మంది ఈపీఎఫ్ఓ నుంచి నిష్క్ర‌మించారు.

రాష్ట్రాల వారీగా ప‌రిశీలిస్తే, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, గుజ‌రాత్, హ‌రియాణాల్లోనే అధికంగా 53 శాతం ఉద్యోగాలు ల‌భించాయి. 2020 ఏప్రిల్ నుంచి అక్టోబ‌రు వ‌ర‌కు ఉన్న ఏడు నెల‌ల కాలంలో నిక‌రంగా 39.33 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు ల‌భించాయి. ప‌రిశ్ర‌మ ఆధారంగా చూస్తే నిపుణుల సేవ‌లు విభాగంలో 60 శాతం రిక‌వ‌రీ క‌నిపించింది. 2020లో కొత్త‌గా 2.08 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు ఉద్యోగాలు పొందారు. అక్టోబ‌రులో న‌మోదైన 11.55 నిక‌ర ఉద్యోగాల్లో వీరి వాటా 21 శాతం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని