ఐపీఓ కేటాయింపు స‌మ‌యంలోనూ వ‌డ్డీని ఆర్జించ‌వ‌చ్చు!

ఐపీఓ, ఎఫ్‌పీఓ, రైట్స్ ఇష్యూ, డెట్ ఇష్యూల‌కు ద‌ర‌ఖాస్తు చేస్తున్నారా!. ఈ ప్ర‌క్రియలో మీకు షేర్ల కేటాయింపులు జ‌రిగేంత‌వ‌ర‌కు మీ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును తాత్కాలికంగా నిలుప‌ద‌ల చేస్తారు. సాధార‌ణంగా షేర్ల కేటాయింపు జ‌రిగేందుకు..

Published : 16 Dec 2020 16:27 IST

ఐపీఓ, ఎఫ్‌పీఓ, రైట్స్ ఇష్యూ, డెట్ ఇష్యూల‌కు ద‌ర‌ఖాస్తు చేస్తున్నారా!. ఈ ప్ర‌క్రియలో మీకు షేర్ల కేటాయింపులు జ‌రిగేంత‌వ‌ర‌కు మీ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును తాత్కాలికంగా నిలుప‌ద‌ల చేస్తారు. సాధార‌ణంగా షేర్ల కేటాయింపు జ‌రిగేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఆ స‌మ‌యానికి మీ డ‌బ్బు పై వ‌చ్చే వ‌డ్డీని మీరు కోల్పోతారు. అయితే ఎస్‌బీఐ ఈ ద‌శ‌లోనూ మీరు వ‌డ్డీ కోల్పోకుండా కొత్త ప‌థ‌కాన్ని తెర మీద‌కు తీసుకొచ్చింది. అప్లికేష‌న్ స‌పోర్టెడ్ బై బ్లాక్‌డ్ అమౌంట్‌(ఏఎస్‌బీఏ) గా పిలువ‌డ‌బ‌డే ఈ విధానంలో మీకు షేర్ల కేటాయింపు జ‌రిగేంత‌వ‌ర‌కు ప‌ట్టే స‌మ‌యానికి సంబంధించిన వ‌డ్డీని కూడా మీ ఖాతాలో జ‌మ చేస్తుంది. షేర్ల కేటాయింపు జ‌రిగిన త‌ర్వాత అందుకు త‌గ్గ న‌గ‌దు మీ ఖాతా నుంచి ఉప‌సంహ‌రించ‌బ‌డుతుంది.

ఎస్‌బీఐ-ఏఎస్‌బీఏ ద్వారా ధ‌ర‌ఖాస్తు చేసేందుకు అవ‌స‌ర‌మైన నిబంధ‌న‌లు:

  1. మ‌దుప‌రికి క‌చ్చితంగా ఎస్‌బీఐలో పొదుపు లేదా క‌రెంట్ ఖాతా ఉండి తీరాలి.
  2. మ‌దుప‌రికి డీమ్యాట్ ఖాతాతో పాటు, శాశ్వ‌తా ఖాతా సంఖ్య‌(పాన్) క‌చ్చితంగా ఉండాలి.
  3. ధ‌ర‌ఖాస్తు చేసేందుకు అవ‌స‌ర‌మైన న‌గ‌దు నిల్వ‌లు బ్యాంకు ఖాతాలో ఉండాలి. ఓవ‌ర్‌డ్రాఫ్ట్ లేదా రుణ ఖాతాల‌కు ఏఎస్‌బీఏ విధానం అనుమ‌తించ‌బ‌డ‌ద‌ని బ్యాంక్ స్ప‌ష్టం చేసింది.

ఎలా ధ‌రఖాస్తు చేయాలి?

  1. భౌతిక ధ‌ర‌ఖాస్తు ఫారం ద్వారా కాకుండా వినియోగ‌దారులు ఎల‌క్ట్రానిక్ విధానంలో ధ‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వినియోగ‌దారులు www.onlinesbi.com సైట్‌లోకి వెళ్లి ఇ-స‌ర్వీసెస్‌లో ఐపీఓ(ఈక్విటీ) లేదా ఐపీఓ(డెట్‌) లో ఏఎస్‌బీఏ ఆప్ష‌న్‌ని ఎంచుకోవాలి. ఏఎస్‌బీఐ విధానంలో ధ‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఎస్‌బీఐతోనే డీమ్యాట్ ఖాతా ఉండాల్సిన అవ‌స‌రం లేదు. ఇత‌ర సంస్థ‌ల‌తో అనుసంధాన‌మైన డీమ్యాట్ ఖాతా స‌రిపోతుంది.
  2. శాఖ‌ల‌తో సంబంధం లేకుండా ఎస్‌బీఐ వినియోగ‌దారులంద‌రూ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ధ‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. పొదుపు లేదా క‌రెంట్ ఖాతా క‌లిగిన ఎస్‌బీఐ వినియోగ‌దారులంద‌రూ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రిజిస్ట‌ర్ అయి ఏఎస్‌బీఏ విధానంలో ధ‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఇత‌ర వివ‌రాలు…

ఐపీఓ, ఎఫ్‌పీఓల‌కు ధ‌ర‌ఖాస్తు చేసుకున్న‌ప్ప‌డు షేర్ల కేటాయింపు జ‌రిగేంత వ‌ర‌కు ప‌ట్టిన స‌మ‌యానికి వ‌డ్డీని ఆర్జించేలా ఈ ఏఎస్‌బీఏ విధానం తోడ్ప‌డుతుంది. ఏఎస్‌బీఏ అనేది పబ్లిక్ ఇష్యూల‌కు సంబంధించి బ్యాంక్ క‌ల్పిస్తున్న ఒక అనుబంధ ప్ర‌క్రియ‌. ఐపీఓ, ఎఫ్‌పీఓ, రైట్స్ ఇష్యూ లేదా డెట్ ఇష్యూ మొద‌లైన సంద‌ర్భాల‌లో ధ‌ర‌ఖాస్తు స‌మ‌యంలో మీ సొమ్మును తాత్కాలికంగా నిలుపుద‌ల చేస్తారు. ఒక్క‌సారి షేర్ల కేటాయింపు పూర్త‌యితే అందుకు త‌గ్గ సొమ్ము మీ ఖాతా నుంచి ఉప‌సంహ‌రించ‌బ‌డుతుంది. షేర్లు మీ డీమ్యాట్ ఖాతాలో జ‌మవుతాయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని