ఇ-కామర్స్‌కు కొత్త చిక్కులు

కొవిడ్‌-19 వచ్చిన తర్వాత ప్రజల ఆలోచన ధోరణి బాగా మారింది.

Published : 25 Apr 2021 13:39 IST

కొవిడ్‌ రెండో దఫాతో అనూహ్యంగా పెరిగిన గిరాకీ
రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్‌ల ప్రభావం 
డెలివరీ సిబ్బంది ఆరోగ్యంపై సంస్థల దృష్టి 

కొవిడ్‌-19 వచ్చిన తర్వాత ప్రజల ఆలోచన ధోరణి బాగా మారింది. రద్దీగా ఉన్న దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసే బదులు ఇంటి దగ్గరే కూర్చుని ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయడానికి ఇష్టపడుతున్నారు. అందువల్లే ఇ-కామర్స్‌ సంస్థల అమ్మకాలు గతేడాది కాలంలో గణనీయంగా వృద్ధి చెందాయి. కొవిడ్‌ రెండోదశ విజృంభణ నేపథ్యంలో, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, దుస్తులు వంటివే కాకుండా నిత్యావసరాలు, ఔషధాల వంటి విభాగాల్లో ఆన్‌లైన్‌ ఆర్డర్లు జోరందుకుంటున్నాయి. అయితే  ఉత్పత్తులు అందించే సిబ్బంది ఆరోగ్య పరిరక్షణా ముఖ్యమైన అంశం అవుతోంది.

కొవిడ్‌-19 కేసులు రోజుకు 3 లక్షలకు పైగా నమోదవుతుండటంతో తీవ్రత ఎక్కువ ఉన్న నగరాల్లో రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు  లాక్‌డౌన్‌ ఆంక్షలను విధిస్తున్నారు. ఫలితంగా ఇ-కామర్స్‌ సంస్థలకు ఆర్డర్లు అమాంతం పెరిగాయి. ఇది సంస్థలకు మంచి విషయమే అయినా.. కొన్ని రాష్ట్రాలు విధిస్తున్న కఠిన  ఆంక్షలతో సరకు రవాణా నుంచి డెలివరీల వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నెగెటివ్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ నివేదిక ఉంటేనే మహారాష్ట్రలో డెలివరీ సిబ్బందిని అనుమతిస్తున్నారు. ఇక రాత్రిళ్లు డెలివరీలు చేయడం కష్టంగా మారింది. వినియోగదారులకు సురక్షితంగా, భద్రమైన రీతిలో వస్తువులను అందించాలంటే డెలివరీ సిబ్బంది, భాగస్వాములు కొవిడ్‌ బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీలపై పడింది.

సిబ్బందికి ఉచితంగా టీకా

కొవిడ్‌ బారిన పడిన సిబ్బందిని ఆదుకోవడమే కాక, టీకాలు ఇప్పించేద]ుకు సంస్థలు సన్నద్ధమయ్యాయి. 10 లక్షల మందికి పైగా ఉద్యోగులు, భాగస్వాములు, విక్రేతలు, డెలివరీ సిబ్బందికి కొవిడ్‌-19 టీకాలకు అయ్యే ఖర్చును భరించడానికి ఇప్పటికే అమెజాన్‌ ముందుకొచ్చింది. కొవిడ్‌-19 చికిత్స, నిర్థారణ పరీక్షలకు సైగా అమెజాన్‌ ఇండియా తోడ్పాటు ఇస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు పలు సంస్థలు సైతం ఉచితంగా టీకాలను అందిస్తామని ఇప్పటికే ప్రకటించాయి.

ఈ వస్తువులకు అధిక గిరాకీ

గత కొన్ని వారాల్లో నిత్యావసరాలు, శానిటైజర్లు, మాస్కులు, పుస్తకాలు, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలకు ఆన్‌లైన్‌లో గిరాకీ పెరిగిందని సంస్థలు చెబుతున్నాయి. కొవిడ్‌ రెండో దఫా తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్‌ ప్రదేశ్, మధ్యప్రదేశ్, దిల్లీ ఎన్‌సీఆర్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో గిరాకీ 60 శాతం అధికమైంది. తినడానికి, వండటానికి సిద్ధంగా ఉన్న ప్యాకేజ్డ్‌ ఆహారం (80 శాతం), శీతలీకరించిన ఆహారం (500 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (150 శాతం) వంటి విభాగాల్లో గిరాకీ అనూహ్యంగా పెరిగింది. ఇటువంటి నగరాల్లో ఆర్డర్ల విలువ 11 శాతం వృద్ధి చెందిందని ఆన్‌లైన్‌ గ్రోసరీ సంస్థ గ్రోఫర్స్‌ ప్రకటించింది. పుస్తకాలు, పిల్లల ఆటబొమ్మలు, ఫిట్‌నెస్‌ పరికరాలు, సౌందర్య ఉత్పత్తులకు అధిక గిరాకీ వస్తోందని ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని