
Second Wave: ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది!
కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక
దిల్లీ: కరోనా రెండో దశ నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థికశాఖ నెలవారీ నివేదిక తెలిపింది. వేగవంతమైన వ్యాక్సినేషన్, ద్రవ్య విధానంలో సర్దుబాటు నిర్ణయాలు, ఉపశమన ప్యాకేజీలే ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు దోహదం చేస్తున్నాయని పేర్కొంది.
వివిధ రంగాల్లో కరోనా వల్ల నెలకొన్న ప్రతికూలతలను దూరం చేయడానికి కేంద్రం గత నెల రూ.6.29 లక్షల కోట్ల ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన విషయాన్ని ఆర్థికశాఖ గుర్తుచేసింది. మార్కెట్లపై ప్రతికూలతలను తగ్గించి.. వివిధ రంగాలు పుంజుకునేలా ద్రవ్య విధానంలో ఆర్బీఐ పలు సర్దుబాటు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో వసూలైన పన్ను వసూళ్లు మూలధన వ్యయానికి ఊతమిచ్చాయని తెలిపింది. ముఖ్యంగా రోడ్డు, రైల్వే రంగాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు పెట్టుబడులు అంతరాయం లేకుండా కొనసాగాయని.. తద్వారా ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఆటంకం కలగలేదని పేర్కొంది. తాజాగా ప్రకటించిన ఉపశమన ప్యాకేజీతో పాటు పీఎల్ఐ పథకం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు మరింత దోహదం చేయనుందని పేర్కొంది.
డిజిటలైజేషన్, భారత్ నెట్ సహా ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన, రుణ హామీ పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఉపాధి భరోసా లభించనుందని ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే ఎరువుల సబ్సిడీ, ఉచిత ఆహార పదార్థాల పంపిణీ, ఉపాధి హామీ పథకం అమలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి ఊతమివ్వనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ విజృంభిస్తుండడం ఆర్థిక వ్యవస్థకు సవాల్ విసురుతోందని పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.