Updated : 24 Aug 2021 13:08 IST

Billionaires Education: ఈ ధనవంతులు ఏం చదివారో తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కుబేరులు అనగానే మన దృష్టి వారి సంపదవైపే వెళుతుంది. ఆసక్తి ఉంటే వారి కంపెనీలు.. రోజుకి ఎంత ఆర్జిస్తున్నారు?వంటి వివరాలను తెలుసుకుంటాం. కానీ, వారి చదువు గురించి ఎప్పుడైనా వెతికారా? ప్రపంచంలోనే శ్రీమంతులుగా ఉన్న కొంతమంది విద్యార్హత చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. కొంత మంది ఉన్నత చదువులు లేకుండానే రూ.లక్షల కోట్ల సామ్రాజ్యాలను నిర్మించారు. ఫోర్బ్స్‌ ప్రపంచ ధనవంతుల జాబితాలో ఉన్న కొంతమంది కుబేరుల విద్యార్హతలేంటో చూద్దాం!


జెఫ్‌ బెజోస్‌

ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానంలో ఉన్న జెఫ్ బెజోస్‌ 1994లో అమెజాన్‌ సంస్థను స్థాపించారు. ఆయన ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. 16 ఏళ్ల వయసులోనే మెక్‌ డొనాల్డ్స్‌లో ఫ్రైకుక్‌గా పనిచేశారు. ఒకవైపు చదువుకుంటూనే పనిచేస్తూ గంటకు 2.69 డాలర్ల వరకు సంపాదించేవారు. ఆయన సంపద ప్రస్తుత నికర విలువ 189.2 బిలియన్‌ డాలర్లు.


ఎలాన్‌ మస్క్‌

టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ 12 ఏళ్ల వయసులోనే స్పేస్‌ థీమ్డ్‌ వీడియో గేమ్‌ ‘బ్లాస్టర్‌’కు కోడింగ్‌ చేశారు. దాన్ని పీసీ అండ్‌ ఆఫీస్‌ టెక్నాలజీ అనే మ్యాగజైన్‌కు ఇవ్వగా పారితోషికంగా 500 డాలర్లు వచ్చాయి. ఇక ఈయన చదివింది కూడా బ్యాచిలర్‌ డిగ్రీయే. ఫిజిక్స్‌, ఎకానమిక్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ కోసం స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీలో చేరినప్పటికీ.. రెండు రోజుల్లోనే మానేశారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 184.5 బిలియన్‌ డాలర్లు.


బెర్నార్డ్‌ అర్నాల్ట్‌

ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువుల బ్రాండ్‌కి పెట్టింది పేరైన ఎల్‌వీఎంహెచ్‌ అధిపతి బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ సంపద విలువ 179.3 బిలియన్‌ డాలర్లు. ఇటలీకి చెందిన ఈయన ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ వెంటనే తండ్రి స్థిరాస్తి వ్యాపారంలోకి అడుగు పెట్టారు. కొన్నేళ్ల తర్వాత ఎల్‌వీఎంహెచ్‌లో పెట్టుబడులు పెట్టి.. తదనంతర కాలంలో దాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ కింద ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌లు ఉన్నాయి.


బిల్‌ గేట్స్‌ 

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ తొలుత హార్వర్డ్‌ యూనివర్సిటీలో ‘లా’ కోర్సులో చేరారు. కానీ, అదే వర్సిటీలో బోధించే కంప్యూటర్‌ సైన్స్‌, గణితంపై ఆసక్తితో ఆ కోర్సులను సొంతంగా అభ్యసించారు. అనంతరం ‘లా’ కోర్సును మధ్యలోనే వదిలేశారు. టెక్నాలజీ రంగంపై తనకున్న ఆసక్తితో అటువైపుగా అడుగులువేశారు. 1975లో పాల్‌ అలెన్‌తో కలిసి మైక్రోసాఫ్ట్‌ స్థాపించారు. ప్రస్తుతం బిల్‌గేట్స్‌ ఆస్తుల విలువ 131.6 బిలియన్‌ డాలర్లు.


మార్క్‌ జుకర్‌బర్గ్‌

ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన మార్క్‌ జుకర్‌బర్గ్‌కు చిన్నతనం నుంచే ఇంటర్నెట్‌.. టెక్నాలజీపై అమితాసక్తి. ఆయన హార్వర్డ్‌లో సైకాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ కోసం చేరారు. అందులో ఉండగానే ఫేస్‌బుక్‌కి ప్రోగ్రాం రాశారు. దానికి బాగా ప్రాచుర్యం రావడంతో రెండో ఏడాదిలోనే చదువుకు స్వస్తి చెప్పి ఫేస్‌బుక్‌ కోసం పూర్తి సమయాన్ని కేటాయించారు. అయితే, జుకర్‌బర్గ్‌కు కాలేజీలో చేరడానికి ముందే కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌పై పూర్తి పట్టు ఉండేది. జుకర్‌బర్గ్‌ ఆసక్తిని గమనించిన ఆయన తండ్రి ఓ ప్రైవేట్‌ ట్యూటర్‌ను పెట్టి ప్రోగ్రామింగ్‌లో శిక్షణ ఇప్పించారు. అలా కాలేజీలో చేరడానికి ముందే జుకర్‌బర్గ్‌ అనేక ప్రోగ్రామ్స్‌ రాశారు. ప్రస్తుతం జుకర్‌బర్గ్‌ సంపద 130.7 బిలియన్‌ డాలర్లు.


వారెన్‌ బఫెట్‌

పెట్టుబడుల్లో ఘనుడు.. బెర్క్‌షైర్‌ హాత్‌వే సంస్థ సీఈవో వారెన్‌ బఫెట్‌.. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ, ఎకానమిక్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుతుండగానే ప్రముఖ మదుపర్లు బెంజమిన్‌ గ్రాహమ్‌, డేవిడ్‌ డాడ్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికి గ్రాహమ్‌, డాడ్‌ అక్కడ బోధిస్తున్నారు. వారి నుంచే బఫెట్‌ ప్రాథమిక మదుపు పాఠాలు నేర్చుకున్నారు.


ముకేశ్‌ అంబానీ

భారత కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ.. యూనివర్సిటీ ఆఫ్‌ బాంబే నుంచి కెమికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ కోర్సులో చేరినప్పటికీ.. మధ్యలోనే ఆపేశారు. అప్పటికీ రిలయన్స్‌ కొత్త రంగాల్లోకి ప్రవేశిస్తుండడంతో అర్ధాంతరంగా చదువు ఆపేసి వ్యాపార కార్యకలాపాలను చక్కబెట్టారు. ప్రస్తుతం ఆయన ఫోర్బ్స్‌ ధనవంతుల జాబితాలో 12వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద విలువ ప్రస్తుతం 82.7 బిలియన్ డాలర్లు.


గౌతమ్‌ అదానీ

భారతీయ సంపన్నుడు, అదానీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు గౌతమ్‌ అదానీ బ్యాచిలర్‌ డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేశారు. తండ్రికి టెక్ట్స్‌టైల్‌ కంపెనీ ఉన్నా.. సొంతంగా వ్యాపారం ప్రారంభించి తనకంటూ గుర్తింపు సంపాదించాలని భావించారు. అందుకే గుజరాత్‌లోని తన స్వస్థలం అహ్మదాబాద్‌ వదిలేసి ముంబయికి చేరుకున్నారు. ఆయన సంపద విలువ 57.5 బిలియన్‌ డాలర్లు. ఫోర్బ్స్‌ కుబేరుల జాబితాలో 21వ స్థానంలో ఉన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts