Elon Musk: పాటలు వింటూ పనిచేయండి.. టెస్లా ఉద్యోగులకు మస్క్‌ సలహా

పాటలు వింటూ పని చేయడం చాలా మందికి అలవాటే. దానివల్ల పనిమీద మరింత ఏకాగ్రత పెరుగుతుందని చెబుతారు. మరి ఆఫీస్‌లో అలాంటి వెసులుబాటే ఉంటే..!

Published : 20 Nov 2021 17:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాటలు వింటూ పని చేయడం చాలా మందికి అలవాటే. దానివల్ల పనిమీద మరింత ఏకాగ్రత పెరుగుతుందని చెబుతారు. మరి ఆఫీస్‌లో అలాంటి వెసులుబాటే ఉంటే..! ఆహా.. వర్క్‌ టైంలో మ్యూజిక్‌ వింటే ఏ బాస్‌ ఊరుకుంటారు.. అనే కదా మీ సందేహం. కానీ టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్ మాత్రం తన ఉద్యోగులకు ఇదే సలహా ఇస్తున్నారు. మ్యూజిక్‌ వింటూ పనిచేయండంటూ తన సిబ్బందికి లేఖ కూడా రాశారు. 

ఇటీవల ఎలాన్‌ మస్క్‌ టెస్లా ఉద్యోగులకు పంపిన ఓ ఈ-మెయిల్‌ను ఓ అమెరికా మీడియా సంస్థ ప్రచురించింది. అందులో ఆయన పని ప్రదేశాల్లో మ్యూజిక్‌ గురించి తన అభిప్రాయాలను సిబ్బందితో పంచుకున్నారు. ‘‘ఫ్యాక్టరీలో సంగీతాన్ని నేను ఎంతో సపోర్ట్‌ చేస్తాను. దాని వల్ల ఉద్యోగులు తమ పనిని మరింత ఉల్లాసంగా చేసుకోగలరు. ఇటీవల ఓ అసోసియేట్‌ నన్నో మాట అడిగారు. ఒక చెవితో మ్యూజిక్‌ వింటూ.. మరో చెవితో భద్రతా పరమైన అంశాలను వినొచ్చా..! అని అడిగారు. అది నాకు మంచిదే అనిపించింది. ఆఫీస్‌లో మీరు రోజును మరింత అందంగా మార్చుకునేలా ఎలాంటి ఐడియాలున్నా నా దృష్టికి తీసుకురండి. మీరు ప్రతి రోజూ ఆఫీస్‌కు వచ్చేందుకు ఎదురు చూడాలనే నేను కోరుకుంటా..’’ అని మస్క్‌ తన మెయిల్‌లో పేర్కొన్నారు. 

ట్విటర్‌లో ఎంతో చురుగ్గా ఉండే మస్క్‌.. ఆఫీస్‌లో తన ఉద్యోగులతోనూ అంతే కలివిడిగా ఉంటారట. అందుకే అమెరికాలోని టాప్‌ 10 ఆరాధ్య సీఈవోల జాబితాలో చోటు దక్కించుకుంటున్నారు. ఈ జాబితాలో మస్క్‌ 8వ ర్యాంక్‌లో ఉన్నట్లు 2017లో గ్లాస్‌డోర్‌ అనే సంస్థ తమ వార్షిక నివేదికలో పేర్కొంది. అంతేనా.. మస్క్‌ సారథ్యాన్ని తన కంపెనీల్లో 98శాతం మంది సిబ్బంది ఆమోదిస్తున్నారని గ్లాస్‌డోర్‌ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు