Published : 04 Aug 2021 14:20 IST

Elon Musk: ఎలాన్‌ మస్క్‌ కంట కన్నీరొచ్చిన వేళ..!

వాషింగ్టన్‌: టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ ఏదైనా ప్రాజెక్టు చేపట్టారంటే.. అది సక్సెస్‌ అయ్యి తీరాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆయనపై ఉన్న నమ్మకం అలాంటిది. ఈ స్థాయికి చేరడానికి ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఓ దశలో స్పేస్‌ ఎక్స్‌ను దాదాపు మూసివేయాల్సిన పరిస్థితులు వచ్చాయట! ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకొని ఓ ఇంటర్వ్యూలో ఆయన ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. దానికి సంబంధించిన వీడియోను ‘టెస్లా ఓనర్స్‌ ఆఫ్‌ సిలికాన్‌వ్యాలీ’ గ్రూప్‌ ట్విటర్‌లో షేర్‌ చేయగా.. ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

స్పేస్‌ ఎక్స్‌ నిర్మించిన ఫాల్కన్‌ వ్యోమనౌక లక్షిత కక్ష్యను చేరుకోవడంలో తొలుత మూడుసార్లు విఫలమైంది. నాలుగో ప్రయత్నంలో విజయవంతమైంది. అయితే, అప్పటికే కంపెనీ తీవ్ర నష్టాల్లోకి జారుకుంది. దాదాపు మూసివేసే స్థితికి చేరుకుంది. సరిగ్గా అదే సమయంలో నాసా నుంచి ఓ శుభవార్త అందింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్‌ఎస్‌)కి సామగ్రిని తీసుకెళ్లాల్సిన భారీ కాంట్రాక్టును స్పేస్‌ ఎక్స్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పంద విలువ 1.6 బిలియన్ డాలర్లు. అప్పటికే తీవ్ర నిరాశలో కూరుకుపోయిన మస్క్‌కు ఇది పెద్ద ఊరట కలిగించింది. ఈ వార్తను ఫోన్‌ ద్వారా తెలుసుకున్న ఆయన వెంటనే ‘ఐ లయ్‌ యూ గాయ్స్‌’ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది 2008 క్రిస్మస్‌కు రెండు రోజుల ముందు జరిగిన ఘటన. ఈ సంఘటనను ఓ ఇంటర్వ్యూలో ఎలాన్‌ మస్క్ స్వయంగా వివరించారు. నాసా తమని కాపాడిందని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి.

ఈ వీడియోను తాజాగా ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా.. మస్క్ స్పందించారు. అది వాస్తవమని మరోసారి గుర్తుచేసుకున్నారు. నాసా అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ‘‘బయటి శక్తుల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ.. మంచి జరగాలనే కాంక్షతో పోరాడిన ప్రభుత్వ వర్గాలకు కృతజ్ఞతలు. ఇదే అమెరికా గొప్పతనం’’ అని వ్యాఖ్యానించారు. ఫాల్కన్‌ విజయవంతమైన తర్వాత.. డ్రాగన్‌, క్రూడ్రాగన్‌ పేరిట స్పేస్‌ ఎక్స్‌ వ్యోమనౌకల్ని నిర్మించింది. క్రూడ్రాగన్‌ ఇప్పటి వరకు రెండుసార్లు వ్యోమగాముల్ని ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్లింది. మరోవైపు 2024లో చంద్రుడిపైకి చేపట్టనున్న మానవసహిత యాత్రకు అవసరమైన కీలక ‘హ్యూమన్‌ ల్యాండర్‌ సిస్టం’ నిర్మాణానికి ఇటీవలే నాసాతో ఒప్పందం కుదుర్చుకుంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని