ఎంప్లాయ్ స్టాక్ ఓన‌ర్‌షిప్ ప్లాన్ (ఈసాప్) - లాభాలు, పన్ను చెల్లింపులు

కంపెనీ త‌మ ఉద్యోగుల‌కు అందించే ప్ర‌యోజ‌నాల‌లో భాగంగా కంపెనీ షేర్లను అందించే విధాన‌మే ఎంప్లాయ్ స్టాక్ ఓన‌ర్‌షిప్ ప్లాన్ (ఈసాప్) అంటారు. ఇన్ఫోసిస్‌, విప్రో, ఫ్లిప్‌కార్ట్ వంటి పెద్ద పెద్ద సంస్థ‌లు ఇచ్చే ఈసాప్‌ల ద్వారా కోటీశ్వ‌రులైన‌వారి...

Published : 19 Dec 2020 16:20 IST

ఈసాప్ ప్ర‌యోజ‌నాలేంటి..ప‌న్ను ఎంత వ‌ర్తిస్తుందో తెలుసా?​​​​​​​

కంపెనీ త‌మ ఉద్యోగుల‌కు అందించే ప్ర‌యోజ‌నాల‌లో భాగంగా కంపెనీ షేర్లను అందించే విధాన‌మే ఎంప్లాయ్ స్టాక్ ఓన‌ర్‌షిప్ ప్లాన్ (ఈసాప్) అంటారు. ఇన్ఫోసిస్‌, విప్రో, ఫ్లిప్‌కార్ట్ వంటి పెద్ద పెద్ద సంస్థ‌లు ఇచ్చే ఈసాప్‌ల ద్వారా కోటీశ్వ‌రులైన‌వారి గురించి వినే ఉంటారు. ఈసాప్ గురించి కంపెనీ ఆఫ‌ర్ చేసిన‌ప్పుడు తెలీక‌పోయినా లాభం పొందిన త‌ర్వాత ఈక్విటీ మార్కెట్ల‌ ప్ర‌యోజ‌నాలేంటో అప్పుడు అర్థం చేసుకున్న‌వారున్నారు. మీరు ఉద్యోగం చేస్తున్న సంస్థ స్టాక్స్ ఆఫ‌ర్ చేస్తే మ‌రోమారు ఆలోచించ‌కుండా వాటిని ఎంచుకోవ‌డం మంచిది. అస‌లు ఈసాప్ అంటే ఏంటి పూర్తిగా తెలుసుకుందాం.

ఈసాప్ అంటే ఏమిటి?

కంపెనీ ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్ల‌ను, రాయితీ ధ‌ర‌కు మార్కెట్ ధ‌ర కంటే త‌క్కువ ధ‌ర‌కు అందిస్తారు. కంపెనీలు ప్ర‌క‌టించిన దాని ప్ర‌కారం ఉద్యోగులు త‌మ ఆప్ష‌న్లు ఉప‌యోగించుకుని షేర్ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇది ప్ర‌త్యేక గ‌డువులో కంపెనీలు అందిస్తాయి. న‌మ్మ‌కం క‌లిగిన‌, క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే ఉద్యోగుల‌కు ఈసాప్ కంపెనీ ఇచ్చే రివార్డు వంటిది. అదేవిధంగా చాలా కంపెనీలు ఉద్యోగుల‌ను త‌మ సంస్థ‌లోనే కొన‌సాగేలా చేసుకునేందుకు కూడా ఈసాప్‌ను ఆఫ‌ర్ చేస్తాయి.

ఈసాప్‌ లు సాధారణంగా రాయితీ రేట్లతో ఉద్యోగికి అందిస్తారు. అదేవిధంగా దీనిని ఎంచుకునేందుకు ఒక గ‌డువును ప్ర‌క‌టిస్తారు. దీనినే వెస్టింగ్ పీరియ‌డ్ అంటారు. ఆ గడువులోగా ఉద్యోగి స్టాక్‌ను ఎంచుకోక‌పోతే ఇక వారికి అవ‌కాశ‌ముండ‌దు వివిధ రంగాల్లో ఉన్న అనేక సంస్థలు ప్ర‌తిభ ఉన్న ఉద్యోగులను ఆకర్షించేందుకు అదేవిధంగా నైపుణ్యం గ‌ల ఉద్యోగులు త‌మ సంస్థ‌లోనే కొన‌సాగేలా చేసేందుకు స్టాక్‌ల‌ను కేటాయిస్తున్నాయి.

ఈసాప్ ద్వారా ఉద్యోగి ఎలా లాభం పొందుతాడు?

ఈసాప్ ద్వారా ఉద్యోగి సంప‌ద‌ను సృష్టించుకునేందుకు వీలుంటుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని ఏర్పాటు చేసుకునేందుకు ఇవి మంచి ఆప్ష‌న్‌గా చెప్పుకోవ‌చ్చు. షేర్ల ధ‌ర త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఎంచుకోవ‌డం మంచిద‌ని నిపుణుల స‌ల‌హా. అంటే త‌క్కువ ధ‌ర‌లో కొనుగోలు చేసి ఎక్కువ ధ‌ర ఉన్న‌ప్పుడు అమ్మేస్తే లాభం పొంద‌వ‌చ్చు.

అయితే ఈసాప్ ఎంచుకునేముందు ఇందులో కొంత రిస్క్ ఉంద‌నే విష‌యం ఉద్యోగి గ్ర‌హించాలి. భ‌విష్య‌త్తులో కంపెనీ రాణించ‌క‌పోతే మీరు న‌ష్ట‌పోయే అవ‌కాశాలు ఉండొచ్చు. అయితే చాలా వ‌ర‌కు కంపెనీలో దీనిని దృష్టిలో పెట్టుకొని ప‌రిహారంతో పాటు క‌లిపి స్టాక్ ఆప్ష‌న్‌ను అందిస్తున్నాయి. అయితే ఇది ఎంచుకున్న త‌ర్వాత మీ వేత‌నం నుంచి కొంత దానికి కేటాయించ‌వ‌ల‌సి ఉంటుంది. ప‌న్ను ఉంటుంది. అదేవిదంగా షేర్ల ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు ఉంటాయ‌న్న విష‌యం గుర్తుంచుకోవాలి.

ఈసాప్ ప్ర‌యోజ‌నాలు:

  • దీర్ఘ‌కాల సంపాద‌న‌కు ఈసాప్ మంచి అవ‌కాశ‌మ‌ని చెప్పుకోవ‌చ్చు.
  • కొత్త‌గా స్టాక్ మార్కెట్లలో పెట్టుబ‌డులు పెట్టేవారికి ఈక్విటీ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులకు మంచి మార్గం.
  • ఉద్యోగుల‌కు సాధార‌ణంగా కంపెనీ ప‌నితీరు గురించి తెలుస్తుంది కాబ‌ట్టి లాభ, న‌ష్టాల‌ను బేరీజు వేసుకొని పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించ‌వ‌చ్చు
  • ఉద్యోగిని నిలుపుకోవ‌డం కోసం సంస్థకు ఇదొక మంచి సాధ‌నం
  • కంపెనీలో ద్ర‌వ్య‌ల‌భ్య‌త లేన‌ప్పుడు ఉద్యోగుల‌కు స్టాక్‌ల‌ను ఇచ్చేందుకు వీలుంటుంది
  • కంపెనీలో వాటా ఉన్నందున ఉద్యోగి మంచి ఫ‌లితాల‌పై దృష్టి పెట్ట‌గ‌లుగుతాడు.

ప్ర‌తికూల‌తలు;

  • కొన్ని సార్లు కంపెనీ షేర్లు న‌ష్టాల‌ను మిగిల్చే అవ‌కాశం లేక‌పోలేదు
  • ఈసాప్‌ల‌తో ద్రవ్య‌లభ్య‌త ఉండ‌దు, ప‌న్ను వ‌ర్తిస్తుంది
  • కొన్ని సంద‌ర్భాల్లో కంపెనీ లాకిన్ పీరియ‌డ్ విధిస్తుంది లేదా బాండ్ రాయించుకుంటుంది. దీంతో ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోయే అవ‌కాశం ఉంటుంది.

ప‌న్ను:

ఈసాప్‌ల‌పై రెండు ద‌శ‌ల్లో ప‌న్ను వ‌ర్తిస్తుంది. మొద‌ట స్టాక్ ఎంచుకున్న‌ప్పుడు మార్కెట్ ధ‌ర- ఉద్యోగికి ఇచ్చిన ధ‌రలో వ్య‌త్యాసాన్ని వేత‌నంతో క‌లిపి ప‌న్నువ‌ర్తింప‌జేస్తారు. మ‌రోసారి షేర్ల‌ను విక్ర‌యించేట‌ప్పుడు ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. ఈసాప్‌ల‌ను విక్ర‌యించేట‌ప్పుడు మూల‌ధ‌న ప‌న్ను ఉంటుంది. ఇక్క‌డ రెండుర‌కాల క్యాపిట‌ల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది.

  1. దీర్ఘకాలీక మూల‌ధ‌నంపై ప‌న్ను
  2. స్వ‌ల్ప‌కాలిక మూల‌ధ‌నంపై ప‌న్ను.

మీరు స్టాక్‌ను ఎంత‌కాలం కొన‌సాగించార‌న్న‌దానిపై ఆధ‌రాప‌డి ప‌న్ను ఉంటుంది. 12 నెల‌ల కంటే ఎక్కువ కాలం ఉంటే ఎల్‌టీసీజీ 10 శాతంతో పాటు సెస్ 4 శాతం ప‌డుతుంది. అయితే రాబ‌డి ల‌క్ష రూపాయ‌ల కంటే ఎక్కువ‌గా ఉంటేనే ఇది వ‌ర్తిస్తుంది. స్వ‌ల్ప‌కాలిక మూల‌ధ‌న ప‌న్ను 15 శాతంగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని