GST: జీఎస్టీతో పన్నుచెల్లింపుదార్లు రెట్టింపయ్యారు

వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) అమల్లోకి వచ్చిన తర్వాత గత నాలుగేళ్లలో పన్ను చెల్లింపుదార్లు రెట్టింపయ్యారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు

Updated : 01 Jul 2021 17:18 IST

దిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) అమల్లోకి వచ్చిన తర్వాత గత నాలుగేళ్లలో పన్ను చెల్లింపుదార్లు రెట్టింపయ్యారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. జీఎస్‌టీ విధానం నేటితో నాలుగేళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఆమె పన్ను అధికారులకు అభినందించారు. గత కొన్ని నెలలుగా ఆదాయ వసూళ్లు మెరుగ్గా ఉన్నాయని, ఇకపై కూడా ఇలాగే కొనసాగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 

‘‘జీఎస్‌టీ మోసాలపై చర్యలు తీసుకోవడం, ఐటీసీ రిజిస్ట్రేషన్లు తదితర విషయాల్లో ఏడాదికేడాది ప్రశంసనీయ పనితీరను కనబరుస్తున్నాం. కొన్ని నెలలుగా మెరుగైన ఆదాయ వసూళ్లు నమోదయ్యాయి. వరుసగా ఎనిమిది నెలలుగా జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్షకోట్లకు పైనే ఉంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో రికార్డు స్థాయిలో రూ. 1.41 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూలైంది. ఇక మీదట కూడా ఇలాగే కొనసాగాలి. జీఎస్‌టీ వచ్చిన తర్వాత తక్కువ పన్నులతో వసూళ్లు పెరిగాయి. గత నాలుగేళ్లలో పన్ను చెల్లింపుదార్లు 66.25లక్షల నుంచి 1.28కోట్లకు పెరిగారు’’ అని నిర్మలా సీతారామన్‌ వివరించారు. 

కొవిడ్‌ సంక్షోభం ఎదురైనప్పటికీ జీఎస్‌టీ సవాళ్లను అధిగమించామని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌ లాంటి దేశంలో ఇంత పెద్ద సంస్కరణ అమలు చేయడం చాలా సవాళ్లతో కూడుకున్నదని అభిప్రాయపడ్డారు. ఈ సవాళ్లను అధిగమించి జీఎస్‌టీని విజయవంతం చేసిన కేంద్ర, రాష్ట్ర పన్ను అధికారులను ఆమె అభినందించారు.  జీఎస్‌టీని వాస్తవంలోకి తీసుకురావడంలో సహకారం అందించిన పన్ను చెల్లింపుదారులకు కేంద్రమంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. 

ఎక్సైజ్‌ సుంకం, సేవా పన్ను, వ్యాట్‌, 13 సెస్సులు వంటి 17 స్థానిక పన్నులను ఒక్కటి చేసి 2017 జులై 1న దేశవ్యాప్తంగా జీఎస్‌టీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీని కింద వస్తువులు, సేవలపై 5, 12, 18, 28.. ఇలా నాలుగు శ్లాబుల్లో పన్నులు విధిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని