Published : 06 Jul 2021 12:29 IST

SPAC: కంపెనీ లేకున్నా ఐపీఓకి వెళ్లొచ్చు తెలుసా?

అమెరికాలో భారీ ఎత్తున నిధుల సమీకరణకు సిద్ధమైన భారత స్పాక్‌లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీఓ) వస్తుందంటే అది ఏదో ఒక కంపెనీకి సంబంధించిందే అయి ఉంటుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే మదుపర్లంతా ఆ కంపెనీ స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. దాని ఆర్థిక స్థితి, భవిష్యత్తులో సంస్థ మనుగడ ఆధారంగా మదుపర్లు వాటాలు కొంటారు. పైగా ఐపీఓకి రావాలంటే నిబంధనల ప్రకారం.. కచ్చితంగా సంస్థకు కొన్ని అర్హతలు ఉండాలి. కొత్తగా వచ్చే కంపెనీలను ఐపీఓకి అనుమతించరు.

స్పాక్‌..

అయితే, ఏ కంపెనీ లేకుండా కూడా ఐపీఓకి వెళ్లొచ్చు. ‘స్పెషల్‌ పర్పస్‌ అక్విజిషన్ కంపెనీస్‌(స్పాక్‌)’ ఏర్పాటు ద్వారా అది సాధ్యమవుతుంది. భవిష్యత్తులో ఏదైనా కంపెనీ లేదా కంపెనీలను కొనుగోలు చేయడమే లక్ష్యంగా ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు ఓ కంపెనీని ఏర్పాటు చేస్తే దాన్ని స్పాక్‌ అంటారు. అలా వచ్చిన నిధులతో ఏదైనా ఓ రంగంలోని కంపెనీలను కొనుగోలు చేయొచ్చు. ఇలా స్పాక్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహికులను స్పాన్సర్స్‌ అంటారు. మార్కెట్లో స్పాన్సర్లకు ఉన్న ప్రతిష్ఠ, పలుకుబడే ఐపీఓకి కీలకం. ఐపీఓ ద్వారా వచ్చిన నిధులతో నిర్దేశిత సమయంలోగా ఏదైనా కంపెనీని స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే నిధుల్ని మదుపర్లకు తిరిగిచ్చేయాల్సి వస్తుంది. స్వాధీన ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత స్పాక్‌ దాని మనుగడను కోల్పోయి కొనుగోలు చేసిన కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్‌ అవుతాయి. దీన్నే డిసాల్వ్‌ స్పాక్‌(డీ-స్పాక్‌) అంటారు. ఈ స్పాక్‌ విధానం 90వ దశకం నుంచే అందుబాటులో ఉన్నప్పటికీ.. 2020లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అమెరికాలో జనవరి 2020- మార్చి 2021 మధ్య 89 కంపెనీలు స్పాక్‌ ద్వారా 145 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించాయి. మరో 117 సంస్థలు త్వరలో డీ-స్పాక్‌కి సిద్ధంగా ఉన్నాయి.

ఐఎంఏసీ.. అజయ్‌ దేవగణ్‌, మణిరత్నం

ఈ స్పాక్‌ విధానం టెక్నాలజీ, మీడియా, టెలీకమ్యూనికేషన్‌(టీఎంటీ) రంగాల్లో బాగా వృద్ధి చెందుతోంది. భారత్‌కు చెందిన రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్‌ సీఈఓ శిబాశిష్‌ సర్కార్‌ ‘ఇంటర్నేషనల్‌ మీడియా అక్విజిషన్‌ కార్పొరేషన్‌(ఐఎంఏసీ)’ పేరిట ఓ స్పాక్‌ను ఏర్పాటు చేశారు. 230 మిలియన్‌ డాలర్ల సమీకరణే లక్ష్యంగా అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 7.1-7.96  మిలియన్‌ డాలర్లు విలువ చేసే వాటాలను కొనుగోలుకు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. ఈ ఐఎంఏసీలో పెట్టుబడులు పెట్టేందుకు అజయ్‌ దేవగణ్‌, మణిరత్నం, రోహిత్‌ శెట్టి, ఇంతియాజ్‌ అలీ వంటి పలువురు సినీ ప్రముఖులతో పాటు టి-సిరీస్‌, ముంబయి మువీ స్టూడియోస్‌, అన్నపూర్ణ స్టూడియోస్ వంటి ప్రముఖ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి.

ఈ రంగాల్లోనే స్పాక్‌లు ఎక్కువ..

భారత్‌లోని టెలివిజన్‌, డిజిటల్‌ కంటెంట్‌, గేమింగ్‌, ఎగ్జిబిషన్ బిజినెస్‌ వంటి రంగాల్లోని సంస్థల్ని సొంతం చేసుకోవడంపైనే ఐఎంఏసీ దృష్టి సారించింది. దాదాపు 150-500 మిలియన్ డాలర్లు  విలువ చేసే కంపెనీలను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అమెరికా, కెనడాలోని ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థల నుంచి పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా అమెరికా స్టాక్ మార్కెట్లలోకి ఇది ప్రవేశిస్తోంది. భారత్‌లో 500 మిలియన్‌ డాలర్లు విలువ చేసే కంపెనీలు లేనందున.. రెండు, మూడు కంపెనీలను కొనుగోలు చేసి వాటిని ఐఎంఏసీ కింద విలీనం చేయాలని భావిస్తోంది. ఇదే బాటలో స్టార్‌ ఇండియా మాజీ సీఈఓ ఉదయ్‌ శంకర్‌, మీడియా దిగ్గజం రూపర్ట్‌ ముర్డోచ్‌ కుమారుడు జేమ్స్‌ ముర్డోచ్‌ కలిసి ‘ఐలాండ్స్‌’ అనే స్పాక్‌ను ఏర్పాటు చేశారు. 345 మిలియన్‌ డాలర్ల నిధులను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక వినియోగదారుల సేవల రంగంలో పాయ్‌ దాని భాగస్వామ్య కంపెనీలు ఇప్పటికే 170 మిలియన్ డాలర్ల నిధులను సేకరించాయి.

స్టార్టప్‌లకు మంచి మార్గం..

ఇలా భారత్‌కు చెందిన పలు స్పాక్‌లు అమెరికా మార్కెట్ల ద్వారా భారీ ఎత్తున నిధులను సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఐపీఓకి వెళ్లాలనుకుంటున్న సక్సెస్‌ఫుల్ స్టార్టప్‌లకు ఈ స్పాక్‌ ఓ తక్షణ మార్గంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో మంచి మనుగడ ఉండి.. వచ్చే ఆదాయాన్ని విస్తరణకే వెచ్చిస్తూ ఇప్పటి వరకు లాభాల్ని ఒడిసిపట్టుకోలేకపోయిన కంపెనీలన్నీ ఇప్పుడు స్పాక్‌ విధానంపై దృష్టి సారిస్తున్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని