Evergrande Crisis: కష్టకాలం నుంచి గట్టెక్కుతాం.. ఎవర్‌గ్రాండే ఛైర్మన్‌

సంక్షోభం అంచున ఉండి ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్న చైనా స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండే ఎట్టకేలకు నోరు విప్పింది. ఈ కష్టకాలం నుంచి సంస్థ కచ్చితంగా బయటపడుతుందని సంస్థ ఛైర్మన్‌ హుయి కా యువాన్‌ తెలిపారు....

Published : 21 Sep 2021 21:37 IST

బీజింగ్‌: సంక్షోభం అంచున ఉండి ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్న చైనా స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండే ఎట్టకేలకు నోరు విప్పింది. ఈ కష్టకాలం నుంచి సంస్థ కచ్చితంగా బయటపడుతుందని సంస్థ ఛైర్మన్‌ హుయి కా యువాన్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన కంపెనీ ఉద్యోగులకు మంగళవారం లేఖ రాశారు. తాము చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ తప్పకుండా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సహకారంతో ఈ లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అయితే, అప్పుల ఊబిలో చిక్కుకున్న కంపెనీని గట్టెక్కించడానికి గల ప్రణాళికలను మాత్రం యువాన్‌ వెల్లడించలేదు.

చైనా స్థిరాస్తి విపణిలో 2% వాటా ఉన్న ఎవర్‌గ్రాండేకి గతేడాది ద్రవ్యలభ్యత సమస్య ఏర్పడింది. మొత్తం 15 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉండగా, కంపెనీ తన ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరింది. సంస్థకు మొత్తం 300 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.22.50 లక్షల కోట్ల) అప్పులు ఉండటంతో, తగ్గించుకోవడానికి తలపట్టుకుంటోంది. 2023 మధ్య కల్లా 100 బి.డా.(సుమారు రూ.7.50 లక్షల కోట్ల) రుణాలను తీర్చాలని భావిస్తోంది. కానీ, అందుకు స్థిర ప్రణాళిక రూపొందలేదు. ఈ ఏడాది ఇప్పటిదాకా 8 బిలియన్‌ డాలర్లనే సమీకరించింది. చైనా ప్రభుత్వం కూడా సాయం చేయాలా వద్దా అన్న మీమాంసలో పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లన్నీ సోమవారం ప్రతికూలంగా కదలాడాయి.

ఒక్కరోజే రూ.10 లక్షల కోట్లు ఆవిరి..

ఎవర్‌గ్రాండే సంక్షోభ భయాలతో కుదేలైన అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్ల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 500 మంది ధనవంతుల సంపద 135 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.10 లక్షల కోట్లు) మేర తగ్గింది. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్ ఇండెక్స్‌లో తొలి స్థానంలో ఉన్న టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ సంపద 7.2 బిలియన్‌ డాలర్లు తగ్గి 198 బిలియన్ డాలర్లకు చేరింది. అమెజాన్‌ వ్యవస్థాకుడు జెఫ్‌ బెజోస్ సంపద 5.6 బిలియన్ డాలర్లు కుంగి 194.2 బిలియన్ డాలర్లకు కుంగింది. ఇక ఎవర్‌గ్రాండే షేర్లు దశాబ్దకాల కనిష్ఠానికి చేరాయి. దీంతో 2017లో 42 బిలియన్‌ డాలర్ల వద్ద గరిష్ఠానికి చేరుకున్న సంస్థ ఛైర్మన్‌ హుయి కా యువాన్‌ సంపద తాజాగా 7.3 బిలియన్ డాలర్లకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని