పీపీఎఫ్ గురించి తెలుసుకోవాల్సిన‌ ఐదు కీలక అంశాలు

మ‌నంద‌రికీ పీపీఎఫ్ పై అవ‌గాహ‌న ఉంటుంది. అయితే వీటిలో కొన్ని విష‌యాలు మీరు తెలుసుకోవాలి. స్థిర‌మైన రాబ‌డి, పెట్టుబ‌డి భ‌ద్ర‌త‌, సుల‌భ‌మైన విధానం తో అందుబాటులో ఉండే పీపీఎఫ్ కొన్ని కోట్ల రూపాయ‌ల‌ను ఆక‌ర్షిస్తోంది.....

Updated : 02 Jan 2021 14:49 IST

మ‌నంద‌రికీ పీపీఎఫ్ పై అవ‌గాహ‌న ఉంటుంది. అయితే వీటిలో కొన్ని విష‌యాలు మీరు తెలుసుకోవాలి. స్థిర‌మైన రాబ‌డి, పెట్టుబ‌డి భ‌ద్ర‌త‌, సుల‌భ‌మైన విధానం తో అందుబాటులో ఉండే పీపీఎఫ్ కొన్ని కోట్ల రూపాయ‌ల‌ను ఆక‌ర్షిస్తోంది. ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌కు పీపీఎఫ్ ఒక ప్ర‌త్యేక పెట్టుబ‌డి సాధ‌నం. మ‌న మ‌దుప‌ర్లు పీపీఎఫ్ లో ఎప్ప‌టి నుంచో పెట్టుబ‌డులు చేస్తున్నారు. కొత్త త‌రానికి చెందిన ఉద్యోగులు కూడా వాటిని కొన‌సాగిస్తున్నారు. స్థిర‌మైన రాబ‌డి, పెట్టుబ‌డి భ‌ద్ర‌త‌, సుల‌భ‌మైన విధానం తో అందుబాటులో ఉండే పీపీఎఫ్ కొన్ని కోట్ల రూపాయ‌ల‌ను ఆక‌ర్షిస్తోంది. దీని గురించి మ‌రిన్ని విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పీపీఎఫ్ ఖాతా జాయింట్‌గా తెర‌వొచ్చా?

పీపీఎఫ్ ఖాతాను ఉమ్మ‌డిఖాతాగా తెరిచేందుకు అవ‌కాశం లేద‌ని తెలిసిన విష‌య‌మే. అయితే త‌ల్లిదండ్రులు ఈ ఖాతాను త‌మ మైన‌ర్ పిల్ల‌ల పేరున తెర‌వ‌వ‌చ్చు. త‌ల్లిదండ్లులు లేని, లేదా ప‌నిచేయ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న‌ వారి పిల్ల‌ల‌కు ఈ ఖాతా తెరిచేందుకు కోర్టు ఒక గార్డియ‌న్ ను నియ‌మిస్తుంది ఆ బాలుడు లేదా బాలిక పేరున ఖాతా తెరిచి చ‌ట్ట‌బ‌ద్ధంగా సంర‌క్ష‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న వ్య‌క్తి గా ఆ వ్య‌క్తిని నియ‌మించుకోవ‌చ్చు. ఆ బాలుడు లేదా బాలిక పెద్ద‌యిన త‌రువాత పూర్తి హ‌క్కుదారుగా అవుతారు.

పీపీఎఫ్ ఖాతా డ‌బ్బును ఇత‌రులు పొంద‌లేరు:

పీపీఎఫ్ ద్వారా ల‌భించే మొత్తాన్ని ఇత‌ర వ్య‌క్తులు గానీ, రుణాలిచ్చిన సంస్థ‌లుగానీ తీసుకునేంద‌కు అవ‌కాశం లేదు. పీపీఎఫ్ ఖాతాదారుడు ఏదైనా సంస్థ‌కు లేదా వ్య‌క్తికి రుణ‌ప‌డి ఉంటే ఆ మొత్తాన్ని స‌ద‌రు వ్య‌క్తులు లేదా సంస్థ‌లు జ‌ప్తు చేసుకునే అవ‌కాశం లేదు. గృహ‌రుణాల‌పై చెల్లించే ఈఎమ్ఐ అయినా స‌రే ఈ ఖాతానుంచి తీసుకునేందుకు అధికారం లేదు. అయితే ఆదాయ‌ప‌న్ను శాఖ వారికి మాత్రం దీనిపై అధికారం ఉంటుంది. స‌ద‌రు వ్య‌క్తి ఏవైనా చెల్లింపుల‌ను చేయాల్సి ఉంటే ఆదాయ‌ప‌న్ను శాఖ వారు ఆ మొత్తాన్ని జ‌మ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది.

నామినీలు:

పీపీఎఫ్ ఖాతా క‌లిగిన వ్య‌క్తులు నామినీగా ఒక‌రి కంటే ఎక్కువ మందిని నియ‌మించుకోవ‌చ్చు. అయితే నామినీ నియామ‌క ప‌త్రంలో ఏయే వ్య‌క్తుల‌కు ఎంతెంత శాతం కేటాయిస్తున్నార‌నేది వివ‌రంగా తెల‌పాలి. నామినీ గా ఉండే వ్య‌క్తికి స‌ద‌రు ఖాతాదారుడు మ‌ర‌ణించిన త‌రువాత‌ మాత్ర‌మే ఆ మొత్తంపై అధికారం ల‌భిస్తుంది. నామినీని ఖాతాదారులు ర‌ద్దు చేసుకోవ‌డం లేదా మార్చుకోవ‌డం చేయ‌వ‌చ్చు. నామినీగా ఉండే వ్య‌క్తి లేదా వ్య‌క్తులు పీపీఎఫ్ ద్వారా వ‌చ్చే మొత్తాన్ని ట్ర‌స్టుగా ఏర్ప‌రిచి వాటిని చ‌ట్ట‌బ‌ధ్ద‌మైన వ్య‌క్తుల‌కు అందించాల్సి ఉంటుంది. పీపీఎప్ ఖాతాకు నామినీగా ట్ర‌స్టునునామినీగా ట్ర‌స్టును ఏర్పాటుచేడం వీలు కాదు.

కాల‌ప‌రిమితి:

సాధార‌ణంగా కాల‌ప‌రిమితికి సంబంధించి కొంత గంద‌ర‌గోళం ఉంటుంద‌నే చెప్పాలి. ఎందుకంటే పీపీఎఫ్ ఖాతా తెరిచిన తేదీ నుంచి కాకుండా ఆ ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి నుంచి కాల‌ప‌రిమితిని లెక్కిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి పీపీఎఫ్ ఖాతాను జూన్ 14, 2018 న తీసుకున్నార‌ని అనుకుందాం. అప్పుడు ఆ ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి తేదీ అంటే మార్చి 31 2019 నుంచి ప‌రిగ‌ణిస్తారు. లాక్ ఇన్ పీరియ‌డ్ 15 ఏళ్లు అంటే మార్చి 31, 2034 వ‌ర‌కూ ఉంటుంది.

పీపీఎఫ్ ఖాతా మ‌ధ్య‌లో నిలిపివేస్తే:

కొంత మంది పీపీఎఫ్ ఖాతా చెల్లింపుల‌ను మ‌ధ్య‌లో నిలిపివేస్తుంటారు. అవ‌గాహ‌న లేక‌పోవ‌డం మూలంగానో లేదా క‌నీస న‌గ‌దు లేక‌పోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. అయితే చెల్లించిన కొంత మొత్తాన్ని పొందేందుకు చివ‌రి వ‌ర‌కూ వేచి ఉండాలి. 15 ఏళ్ల త‌రువాత మీరు చెల్లించిన మొత్తంపై వ‌డ్డీ లెక్కించి చెల్లిస్తారు. పీపీఎఫ్ లో ప్ర‌తీ సంవ‌త్స‌రం చివ‌రి నాటికి ఉన్న మొత్తంపై వ‌డ్డీ లెక్కిస్తారు. మ‌ధ్య‌లో నిలిపివేసిన ఖాతాల‌పై రుణం గానీ పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ గానీ చేసే వీలులేదు. మీరు పాక్షికంగా కొంత మొత్తాన్ని తీసుకోవాల‌న్నా లేదా రుణం తీసుకోవాల‌న్నా క‌నీస మొత్తం ప్ర‌తీ ఏడాది చెల్లించ‌డం త‌ప్ప‌నిస‌రి. కాబ‌ట్టి గుర్తుగా ప్ర‌తీ సంవ‌త్స‌రం పీపీఎఫ్ లోకొంత మొత్తాన్ని చెల్లించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని