హల్వా వేడుక.. బడ్జెట్‌ కోసం కొత్త యాప్‌

కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టబోయే 2021-22 బడ్జెట్‌ రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఏటా ఆనవాయితీగా నిర్వహించే హల్వా వేడుకను శనివారం.....

Updated : 25 Jan 2021 16:52 IST

ముంబయి: కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టబోయే 2021-22 బడ్జెట్‌ రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఏటా ఆనవాయితీగా నిర్వహించే హల్వా వేడుకను శనివారం సాయంత్రం నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమక్షంలో నార్త్‌ బ్లాక్‌లో ఈ వేడుక జరిపారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాధారణంగా ఈ వేడుక జరిగిన తర్వాత బడ్జెట్‌ ప్రతుల ముద్రణ ప్రారంభమవుతుంది. కొవిడ్‌-19 నేపథ్యంలో ఈ సారి బడ్జెట్‌ ప్రతులను ముద్రించడం లేదని కేంద్రం ఇదివరకే వెల్లడించింది. దీంతో బడ్జెట్‌ రోజు పార్లమెంట్‌ సభ్యులకు ఎలక్ట్రానిక్‌ రూపంలో ప్రతులు అందజేయనున్నారు. అలాగే, బడ్జెట్‌ సమర్పణ పూర్తయ్యే వరకు దీని రూపకల్పనలో పాల్గొన్న అధికారులెవరికీ బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవు.

హల్వా వేడుక సందర్భంగా ‘యూనియన్‌ బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌’ను నిర్మలా సీతారామన్‌ విడుదల చేశారు. పార్లమెంట్‌ సభ్యులతో పాటు, సాధారణ ప్రజలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా మొబైల్‌లో బడ్జెట్‌ను వీక్షించొచ్చు. బడ్జెట్‌ ప్రసంగం పూర్తైన తర్వాత ఆ ప్రతులు యాప్‌లో అందుబాటులోకి వస్తాయి. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో బడ్జెట్‌ ప్రతులను చదువుకోవచ్చు. వాటిని డౌన్‌లోడ్‌ చేయడంతో పాటు ప్రింట్‌ చేసుకునే వెసులుబాటునూ కల్పిస్తున్నారు. అలాగే www.indiabudget.gov.in వెబ్‌సైట్‌ ద్వారా కూడా బడ్జెట్‌ ప్రతులను పొందొచ్చు. 

ఇవీ చదవండి..
‘పెట్రోల్‌’పై సుంకం తగ్గిస్తారా?
2020లో స్విఫ్ట్‌.. ది బెస్ట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని