Income tax portal: ఐటీ పోర్టల్‌లో సమస్యలు.. ఇన్ఫోసిస్‌కు కేంద్రం డెడ్‌లైన్‌!

ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు కోసం రూపొందించిన కొత్త వెబ్‌సైట్‌లో లోపాలను సవరించేందుకు వెబ్‌సైట్‌ను సిద్ధం చేసిన ఇన్ఫోసిస్‌కు కేంద్రం డెడ్‌లైన్‌ విధించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం.

Published : 23 Aug 2021 20:49 IST

దిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు కోసం రూపొందించిన కొత్త వెబ్‌సైట్‌లో లోపాలను సవరించేందుకు వెబ్‌సైట్‌ను సిద్ధం చేసిన ఇన్ఫోసిస్‌కు కేంద్రం డెడ్‌లైన్‌ విధించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం ఇన్ఫోసిస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో సలిల్‌ పరేఖ్‌ భేటీ సందర్భంగా ఈ గడువు నిర్దేశించింది. సెప్టెంబర్‌ 15లోగా పోర్టల్‌కు సంబంధించిన లోపాలను సవరించాలని కేంద్రం సూచించింది. పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిన రెండు నెలల దాటినా సమస్యలు ఉత్పన్నమవుతుండడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. పోర్టల్‌లోని సమస్యలను తొలగించేందుకు ఇన్ఫోసిస్‌ తమ వంతు కృషి చేస్తోందని ఈ సందర్భంగా పరేఖ్‌ వివరించారు. 750 మందితో కూడిన బృందం దీనిపై పనిచేస్తోందని చెప్పారు. గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో నిర్మలా సీతారామన్‌తో పాటు ఆర్థిక, ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ ఏడాది జూన్‌ 7న ఆదాయపు పన్ను శాఖ కొత్త వెబ్‌సైట్‌  ( www.incometax.gov.in) అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి సాంకేతిక సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. దీంతో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో వెబ్‌సైట్‌ పూర్తిగా తెరుచుకోకపోవడంపై ఆదాయపు పన్ను విభాగం అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఇన్ఫోసిస్‌ సీఈవోకు సమన్లు జారీ చేసింది. మరోవైపు కొత్త వెబ్‌సైట్‌లో సాంకేతికత సమస్యల పరిష్కారం కొలిక్కిరాని నేపథ్యంలో సెప్టెంబరు 30 వరకు ఉన్న గడువును మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని