Crypto Bill: క్రిప్టో బిల్లు పార్లమెంటుకు ఎప్పుడంటే..?

క్రిప్టోకరెన్సీ నిషేధం, నియంత్రణకు సంబంధించి అనేక ఊహాగానాలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభ వేదికగా పలు కీలక విషయాలు వెల్లడించారు....

Published : 30 Nov 2021 21:19 IST

కీలక విషయాలు వెల్లడించిన నిర్మలా సీతారామన్‌

దిల్లీ: క్రిప్టోకరెన్సీ నిషేధం, నియంత్రణకు సంబంధించి అనేక ఊహాగానాలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభ వేదికగా పలు కీలక విషయాలు వెల్లడించారు. క్రిప్టోకరెన్సీకి సంబంధించిన బిల్లును కేబినెట్‌ ఆమోదం లభించగానే పార్లమెంటు ముందుకు తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం బయట జరుగుతున్న ప్రచారమంతా గత వర్షాకాల సమావేశాల్లో తీసుకురావాలనుకున్న పాత బిల్లుకు సంబంధించినదని తెలిపారు.

గత పార్లమెంటు సమావేశాల్లోనే క్రిప్టో బిల్లు తీసుకురావాలనుకున్నప్పటికీ.. వివిధ వర్గాల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని వెనకడుగు వేయాల్సి వచ్చిందని సీతారామన్‌ తెలిపారు. పాత బిల్లుపైనే విస్తృతంగా చర్చ జరిపి దాంట్లో మార్పులు చేశామమన్నారు. అలా సవరించిన బిల్లునే తాజాగా తీసుకొస్తున్నామన్నారు.

ఇక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌కు సంబంధించి వివిధ సంస్థలు ఇస్తున్న ప్రకటనలను నిషేధించడంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు. అయితే, ‘అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ నిబంధనలను అనుసరించి సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే సెబీ, ఆర్‌బీఐ ద్వారానూ మదుపర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామన్నారు. తప్పుడు ప్రకటనల ద్వారా కొన్ని సంస్థలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు సుశీల్‌ కుమార్‌ మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రకటనల నిషేధానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా? అని ఆయన అడిగిన ప్రశ్నకు సీతారామన్‌ స్పందిస్తూ పై విధంగా సమాధానమిచ్చారు.

‘నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్స్(ఎన్‌ఎఫ్‌టీ)‌’ విక్రయాలపైనా ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించలేదని మంత్రి తెలిపారు. అలాగే క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌ ద్వారా ఆర్జించిన లాభాలపై మదుపర్లు ఆదాయ పన్ను చెల్లించారా? లేదా? అనే విషయంపై తమ వద్ద ప్రస్తుతానికి ఎలాంటి సమాధానం లేదని సీతారామన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని