
కుటుంబాల రుణాలు రూ.75 లక్షల కోట్లు
జూన్ త్రైమాసికంపై ఎస్బీఐ నివేదిక అంచనా
ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కుటుంబ అప్పులు స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 34 శాతానికి దిగి వచ్చాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా నివేదిక ఎకోరాప్ అంచనా వేసింది. కొవిడ్-19 పరిణామాల ప్రభావంతో గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) కుటుంబాల అప్పు జీడీపీలో 37.3 శాతానికి పెరిగిందని, 2019-20లో 32.5 శాతంగా ఉందని తెలిపింది. అంకెల్లో చూస్తే.. కుటుంబాల అప్పు 2020-21 జూన్ త్రైమాసికంలో రూ.73.59 లక్షల కోట్లు కాగా, 2021-22 జూన్ త్రైమాసికంలో రూ.75 లక్షల కోట్లుగా ఉండొచ్చని పేర్కొంది. భారత అప్పు-పెట్టుబడి సర్వే (ఏఐడీఐఎస్) నివేదిక 2018 ప్రకారం, 2012-18 మధ్య గ్రామీణ, పట్టణ కుటుంబాల్లో సరాసరి అప్పు పెరిగిందని ఎస్బీఐ వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం..
* 2018తో ముగిసిన ఆరేళ్ల కాలానికి గ్రామీణ, పట్టణ కుటుంబాల్లో అప్పు వరుసగా 84 శాతం, 42 శాతం పెరిగింది. ఈ కాలంలో 18 రాష్ట్రాల్లో గ్రామీణ కుటుంబాల సరాసరి అప్పు గత ఆరేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. 7 రాష్ట్రాల్లో పట్టణ ప్రాంత కుటుంబాల అప్పు కూడా ఇదే విధంగా పెరిగింది.
* మహారాష్ట్ర, రాజస్థాన్, అసోంతో సహా 5 రాష్ట్రాల్లో 2012-18 మధ్య గ్రామీణ, పట్టణ కుటుంబాల్లో సరాసరి అప్పులు రెట్టింపయ్యాయి.
* ఏఐడీఐఎస్ నివేదిక ప్రకారం గ్రామీణ కుటుంబాల సగటు రుణం రూ.59,748 కాగా, పట్టణ ప్రాంత కుటుంబాల అప్పు రూ.1.20 లక్షలుగా ఉన్నాయి.
* కొవిడ్ మహమ్మారి ప్రభావంతో 2021లో గ్రామీణ కుటుంబాల సగటు అప్పు రూ.1.16 లక్షలకు, పట్టణ కుటుంబాల అప్పు రూ.2.33 లక్షలకు చేరి ఉండొచ్చు.
* అప్పు-ఆస్తి నిష్పత్తి గ్రామీణ కుటుంబాల్లో 2012లో 3.2 శాతం ఉండగా, 2018 నాటికి అది 3.8 శాతానికి చేరింది. పట్టణ ప్రాంత కుటుంబాల్లో 3.7 శాతం నుంచి 4.4 శాతానికి చేరింది.
ఆర్అండ్డీలో నియామకాలు: మీడియాటెక్
దిల్లీ: చిప్సెట్ కంపెనీ మీడియాటెక్ భారత్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందుకోసం కృత్రిమ మేధ, స్మార్ట్‌హోం, 5జీ, వైర్లెస్ కమ్యూనికేషన్స్ విభాగాల్లో నిపుణులను నియమించుకోనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో ఈ నియామకాలు ఉంటాయి. బెంగళూరు, నోయిడాలలో ఉన్న ప్రొడక్ట్ డిజైన్ కేంద్రాల్లో పరిశోధనలకు ఎక్కువ మందిని నియమించుకోనుంది.
హైదరాబాద్‌లో ‘హౌసర్ కో-లివింగ్’ విస్తరణ
ఈనాడు, హైదరాబాద్: కో-లివింగ్ సేవల సంస్థ హౌసర్ హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్ ప్రాంతాల్లో రెండు కొత్త ప్రాంగణాలు సిద్ధం చేసినట్లు తెలిపింది. ఈ సంవత్సరాంతం లోగా హైదరాబాద్‌లో 10- 12 ప్రాంగాణాలను నిర్వహించే స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ సంస్థ ఎన్సీఆర్ దిల్లీ, పుణె, హైదరాబాద్‌లలో కార్యకలాపాలు సాగిస్తోంది. 2022 చివరి నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలనేది తమ లక్ష్యమని హౌసర్ సీఈఓ దీపక్ ఆనంద్ తెలిపారు. త్వరలో బెంగళూరు, చెన్నై నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని వివరించారు.