Crypto Currency: క్రిప్టోతో తీవ్ర సమస్యలే

క్రిప్టోకరెన్సీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. వర్చువల్‌ కరెన్సీల వల్ల ‘చాలా తీవ్ర సమస్యలు’ ఎదురవుతాయని.. అవి దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక స్థిరత్వానికి

Updated : 17 Nov 2021 09:45 IST

ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరం
ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ముంబయి: క్రిప్టోకరెన్సీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. వర్చువల్‌ కరెన్సీల వల్ల ‘చాలా తీవ్ర సమస్యలు’ ఎదురవుతాయని.. అవి దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ఈనెల 29న మొదలయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీలపై ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.

క్రిప్టో ఖాతాలు పెరుగుతున్నాయ్‌..

ఒక బ్యాంకింగ్‌ కార్యక్రమంలో దాస్‌ మాట్లాడుతూ ‘క్రిప్టోకరెన్సీల వల్ల స్థూల ఆర్థిక వ్యవస్థకు ఎంతటి ప్రమాదం ఉందనే విషయమై మరింత లోతుగా చర్చించాలి. మాకొచ్చిన సమాచారం ప్రకారం..క్రిప్టో కరెన్సీ ఖాతాలను తెరవడానికి రుణాలు ఇస్తున్నారు. ట్రేడింగ్‌కు ప్రోత్సాహకాలూ ఇస్తున్నారు. అయితే మొత్తం ఖాతా నిల్వ రూ.500, రూ.1000, రూ.2000 వరకే ఉంటోంది. ఈ తరహా ఖాతాలే 70-80 శాతం ఉన్నాయి. అయితే ఖాతాల సంఖ్య భారీగా పెరగడంతో వర్చువల్‌ కరెన్సీల్లో ట్రేడింగ్‌, లావాదేవీల విలువ పెరుగుతోంద’ని ఆయన అన్నారు.  

ప్రైవేటు పెట్టుబడులతోనే వృద్ధి

కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని పలు సంకేతాలు సూచిస్తున్నాయి. వృద్ధి స్థిరంగా కొనసాగాలన్నా.. కొవిడ్‌ ముందటి స్థాయికి చేరాలన్నా.. ప్రైవేటు పెట్టుబడులు ప్రారంభం కావాలని దాస్‌ పేర్కొన్నారు. ఒక్కసారి అవి పునః ప్రారంభమైతే అధిక వృద్ధితో దూసుకెళ్లే సత్తా మన ఆర్థిక వ్యవస్థకు ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనాలను చాలా మంది ఆర్థిక వేత్తలు 8.5-10 శాతం మధ్య సవరిస్తున్నా, ఆర్‌బీఐ మాత్రం తన అంచనా అయిన 9.5 శాతాన్ని మార్చలేదు.


అధిక వృద్ధికి ఊతమిచ్చే అంశాలివే..

* అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇతర ప్రపంచంతో పాటే వృద్ధితో దూసుకెళ్లే సామర్థ్యం మనదేశానికి ఉంది. దేశీయ గిరాకీ అధికం కావడం, నైపుణ్యం మెరుగవ్వడంఇందుకు దోహదం చేస్తుంది.

* ప్రభుత్వం టెలికాం, మౌలికం వంటి రంగాలకు ప్రకటించిన సంస్కరణలు ఉత్పాదకతను పెంచి  సరఫరా సమస్యలను తగ్గించాయి. వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరుస్తున్నాయి.

* కొవిడ్‌ పరిణామాల వల్ల డిజిటల్‌, హరిత సాంకేతికతలో వృద్ధికి కొత్త అవకాశాలు తెరచుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని