బీమా, పొదుపు మార్గంగా ఉండే మనీ బ్యాక్ పాలసీ

బీమా ర‌క్ష‌ణ‌తో పాటు, నిర్ణీత వ్య‌వ‌ధుల్లో ఆదాయం కావాలా? అయితే ఇది మీ కోస‌మే...

Published : 19 Dec 2020 15:59 IST

మనీ బ్యాక్‌ పాలసీ అంటే పాలసీదారుడికి క్రమానుగతంగా తిరిగి సొమ్మును చెల్లించేవి. ఎండోమెంట్‌ పాలసీల్లో ఒక్కసారిగా చెల్లింపులు చేస్తారు. మనీ బ్యాక్‌ పాలసీల్లో, పాలసీ కాలపరిమితి ముగిసే వరకూ బీమా ప్రయోజనాలు కొనసాగిస్తూ, పాలసీలో ఉన్న‌ విధంగా నిర్ణీత సంవత్సరాలకు ఒకసారి బీమా హామీ మొత్తంలో కొంత శాతం చొప్పున చెల్లిస్తూ వస్తారు. ఆకస్మికంగా పాలసీదారుడు మృతి చెందితే, అప్పటి వరకూ చేసిన చెల్లింపులను మినహాయించకుండా హామీ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. కుటుంబ అవసరాల కోసం నిర్ణీత కాలవ్యవధుల్లో డబ్బు కావాలనుకునేవారికి ఈ పాలసీ తగినదిగా చెప్పుకోవచ్చు.

పాలసీ కాలపరిమితి : ఏడేళ్ల‌ నుంచి మొదలుకొని 25 సంవత్సరాల వరకు కాలపరిమితి కలిగిన మనీ బ్యాక్‌ పాలసీలు అందుబాటులో ఉన్నాయి.కనిష్ఠ, గరిష్ఠ అర్హత వయసు: ఈ రకమైన పాలసీల్లో చేరేందుకు కనిష్ఠ వయసు 13ఏళ్లుగా ఉంది. గరిష్ఠ వయసు 60 ఏళ్ల వరకూ ఉండవచ్చు. కొన్ని బీమా కంపెనీలు 30 రోజుల ప‌సిపిల్ల‌ల‌కు సైతం ఈ పాల‌సీల‌ను అందిస్తున్నాయి. ప్రీమియం చెల్లింపు: అయిదేళ్ల‌ నుంచి 20 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే పాలసీలు ఉన్నాయి. బీమా హామీ మొత్తం ఆధారంగా ప్రీమియం రేట్లు నిర్ణయమవుతాయి. ప్రీమియాన్ని నెలవారీ లేదా త్రైమాసికానికి ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి చెల్లించే వీలుంది. మొత్తం ప్రీమియాన్ని ఒకేసారి చెల్లించేందుకు కొన్ని పాల‌సీలు అనుమ‌తిస్తున్నాయి. కాలపరిమితి(టర్మ్‌)లో సగం లేదా అంతకంటే తక్కువ చెల్లించే పాలసీలను సైతం కంపెనీలు ప్రవేశపెట్టాయి. బీమా హామీ మొత్తం: పాలసీ డాక్యుమెంట్‌లో బీమా హామీ మొత్తాన్ని తెలియజేస్తారు. రూ. 1ల‌క్ష‌ మొదలుకొని రూ.10ల‌క్ష‌ల వరకు బీమా హామీ మొత్తం ఉన్న వివిధ రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు పాలసీ పరిధిలో అదనపు ప్రయోజనాలు ఏమైనా ఉంటే మెచ్యురిటీ ముగిసిన తర్వాత వాటినీ చెల్లిస్తారు. కొన్ని కంపెనీలు బీమా హామీ మొత్తానికి గ‌రిష్ఠ‌ పరిమితి విధించడం లేదు. ఇలాంటి వాటిలో పాలసీ నియమనిబంధనలను బట్టి బీమా హామీ గ‌రిష్ఠ‌ విలువ ఉంటుంది. పాలసీ మెచ్యురిటీ: పాలసీ కాలపరిమితి ముగియగానే పాలసీ మెచ్యూర్‌ అయినట్లుగా పరిగణిస్తారు. గ‌రిష్ఠ‌ మెచ్యురిటీ పీరియడ్‌ 70/75 ఏళ్లు ఉన్న పాలసీలు అందుబాటులో ఉన్నాయి. పాలసీ మెచ్యూర్‌ అయ్యేందుకు కనీస వయసు నిబంధన ఉన్న పాలసీలు సైతం ఉన్నాయి. 20 ఏళ్లు కాలపరిమితి కలిగిన పాలసీకి 5 ఏళ్లకు ఒకసారి లేదా చివరి 5 ఏళ్లలో హామీ మొత్తంలో కొంత శాతం చెల్లిస్తూ పాలసీ మెచ్యూర్‌ అయిన తర్వాత మిగిలిన బీమా హామీ మొత్తాన్ని చెల్లిస్తారు. ఫ్రీలుక్‌ పీరియడ్‌(కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌): పాలసీని ఎంచుకున్న 15 రోజుల్లోగా పాలసీ నచ్చకపోతే, వెనక్కి తిరిగి ఇచ్చేందుకు వీలుంటుంది. ఈ కాలపరిమితిని ఫ్రీలుక్‌ పీరియడ్‌ అంటారు.

స్వాధీన విలువ:

పాలసీలను కాలపరిమితికి ముందే సరెండర్‌ చేసేందుకు ఉండే అవకాశాలు తక్కువ. అత్యవసర(తప్పనిసరి) పరిస్థితులు ఎదురైతే, కనీసం మూడు సంవత్సరాల పాటు క్రమంగా ప్రీమియం చెల్లించిన పాలసీదారులకు పాలసీని సరెండర్‌ చేసే సౌకర్యాన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి. ఇది కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది. పాలసీని సరెండర్‌ చేస్తే, ఏ సంవత్సరంలో ఎంత శాతం చెల్లించేది పాలసీ డాక్యుమెంట్‌లో ఉంటుంది. పాల‌సీ డాక్యుమెంటులో పేర్కొన్న విధంగా చెల్లింపులు చేస్తారు. ఇలా చెల్లించేటప్పుడు మొదటి సంవత్సరం చెల్లించే ప్రీమియంను మినహాయించే అవకాశం ఉంది.

రైడర్లు :

ఈ పాలసీల్లో పెట్టుబడి కూడా కలిసి ఉండటం వల్ల తీవ్ర అనారోగ్యం, వైకల్యం సంభవించినప్పుడు బీమా అసలు ఉద్దేశాన్ని నెరవేర్చకపోవచ్చు.
మనీబ్యాక్‌ పాలసీతో పాటు పలు రైడర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రమాద వైకల్య(యాక్పిడెంటల్‌ డిసెబిలిటీ) రైడర్‌, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌, హాస్పిటల్‌ క్యాష్‌ బెనిఫిట్‌ రైడర్‌, యాక్సిడెంటల్‌ డెత్‌ బెనిఫిట్‌ రైడర్‌, టర్మ్‌ రైడర్‌ వంటి వివిధ రైడర్లను మనీబ్యాక్‌ పాలసీలతో కలిపి అందిస్తున్నారు.

పాలసీపై రుణ సదుపాయం:

పాలసీ కాలపరిమితిని బట్టి ఒక సంవత్సరం గడిచిన తర్వాత పాలసీపై రుణ సదుపాయం పొందే వీలుంది. నియమ నిబంధనలను అనుసరించి పాలసీ బీమా హామీ మొత్తంలో 50 శాతం నుంచి 80 శాతం వరకూ రుణం అందిస్తారు.

మనీ బ్యాక్‌ పాలసీ వల్ల ప్రయోజనాలు:

  • 30−35 ఏళ్ల సగటు వయసు ఉన్నవారికి మనీబ్యాక్‌ పాలసీలు ప్రయోజనకరంగా ఉంటాయి.

  • పిల్లల విద్య, వివాహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పాలసీలను ఎంచుకోవచ్చు.

  • ఆర్థిక భరోసాతో పాటు పెట్టుబడి ప్రయోజనాన్ని కల్పిస్తున్నాయి.

  • క్రమానుగతంగా చెల్లించే మొత్తాన్ని మినహాయించకుండా సర్వైవల్‌ బెనిఫిట్స్‌ను కల్పిస్తారు.

  • పలు రకాల ముఖ్యమైన రైడర్లు అందుబాటులో ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని