సమగ్ర వ్యక్తిగత ప్రమాద బీమా
వ్యక్తిగత ప్రమాదాలకు బీమా రక్షణ కల్పించే పాలసీలపై అవగాహన పెంచుకుందాం
జీవితం ఒడుదొడుకులమయం. ఆర్థిక బాధ్యతలను నెరవేర్చుకునేందుకు సరైన ప్రణాళికలతో తగిన మొత్తానికి బీమా చేయించుకుంటాం. అనారోగ్య కారణాలతో మనం పొదుపు చేసుకున్న సొమ్ము హరించుకుపోకుండా ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటాం. ఇంతవరకు బాగానే ఉంది కానీ ప్రమాదాల విషయానికి వస్తే ఆసుపత్రిలో ఉన్నంత వరకూ ఆరోగ్య బీమా అండగా ఉంటుంది కానీ ప్రమాదం కారణంగా వ్యక్తికి వైకల్యం కలిగితే బాధ్యతల నుంచి తప్పించుకోగలుగుతాడా అంటే కాదనే చెప్పాలి. ఒకవేళ ఆ వ్యక్తి ప్రధాన సంపాదన పరుడైతే, అతడిపై ఆధారపడి ఉన్నవారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. ప్రమాదం జరిగిన వ్యక్తి తనపై ఆధారపడి జీవించే వారిపైనే ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి నెలకొంటుంది.ఆదాయం తగ్గడమే కాకుండా వైద్య ఖర్చులతో సతమతమవ్వడం కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే వ్యక్తిగత ప్రమాద బీమా కీలక భూమిక పోషిస్తుంది.
ప్రమాదాలు వైకల్యానికి దారితీస్తాయి. అవి శాశ్వతంగా ఉండవచ్చు లేదా తాత్కాలికంగా ఉండవచ్చు. వైకల్యంతో ఆర్జన తగ్గిపోయేందుకు అవకాశాలెక్కువ. ఒక్కోసారి ప్రమాదం వల్ల జరిగే గాయాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే చేస్తున్న ఉద్యోగమో లేదా వ్యాపారమో వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదా కొన్ని నెలలపాటు ఉద్యోగానికి సెలవు పెట్టాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో ఆర్ధికంగా ఊరట ఇచ్చేందుకు రూపొందించినదే వ్యక్తిగత ప్రమాద బీమా.
ప్రమాదం కారణంగా మృతిచెందితే:
ఒకవేళ ప్రమాదం కారణంగా మృతిచెందితే జీవిత బీమా పాలసీలు ఆదుకుంటాయి. అదే వ్యక్తిగత ప్రమాద బీమా కూడా తీసుకుంటే ఈ సొమ్మును సైతం క్లెయిం చేసుకోవచ్చు.
శాశ్వత వైకల్యం:
వ్యక్తి మృతి కంటే ఇది చాలా తీవ్రమైన పరిణామమని చెప్పవచ్చు. ఇక్కడ ప్రమాదం జరిగిన వ్యక్తి తన కుటుంబ సభ్యుల మీదే ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ పోషణకు మాత్రమే కాకుండా గాయపడిన వ్యక్తికి చికిత్స చేసేందుకు మరింత ఆదాయం అవసరమవుతుంది. ఇలాంటి సమయంలో బీమా కంపెనీలు, బీమా చేయించుకున్న వ్యక్తి కుటుంబానికి వందశాతం బీమా సొమ్మును అందజేస్తాయి.
శాశ్వత పాక్షిక వైకల్యం:
ప్రమాదం వల్ల వ్యక్తి శరీరంలో ఏదైనా అవయవం కోల్పోయినా, పనిచేయకపోయినా, లేదా తొలగించినా అంత మేరకు జరిగిన నష్టానికి, కోల్పోయిన అవయవం వల్ల చేసుకోలేని పనులకు సంబంధించి జరిగిన నష్టానికి బీమా కంపెనీలు సొమ్ము చెల్లిస్తాయి. ఇదేకాక బీమా సొమ్ములో కొంత భాగాన్ని అందజేస్తారు.
తాత్కాలిక వైకల్యం :
బీమా చేయించుకున్న వ్యక్తికి ప్రమాదం జరిగి తాత్కాలిక కాలానికి ఉద్యోగ, వ్యాపార విధులు నెరవేర్చలేకపోతే బీమా కంపెనీలు పరిహారం అందజేస్తాయి. ఈ ప్రయోజనం ఆదాయాన్ని అందించేదిగా ఉంటుంది కాబట్టి సరైన మొత్తానికి బీమా చేయించుకుంటే ఆపద సమయంలో నెలవారీ ఖర్చులకు ఆదుకునేలా ఉంటుంది.
జీవిత బీమా పాలసీలతో పాటు తీసుకునే యాక్సిడెంట్ రైడర్లు మనం ఎంచుకున్న పరిమితుల మేరకే పనిచేస్తాయి. పైగా ఒకసారి క్లెయిం చేసుకుంటే రైడర్ ప్రయోజనాలు ముగిసిపోతాయి. మరోసారి క్లెయిం చేసుకునేందుకు అవకాశం ఉండదు. సమగ్ర వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకుంటే ఎప్పటికైనా మంచిది.
ప్రాథమిక రక్షణ కోసం మాత్రమే అయితే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ లేదా శాశ్వత/తాత్కాలిక రైడర్‌ను నామమాత్రపు ధరకు కొనుగోలు చేయవచ్చు. సమగ్ర పరిరక్షణకు ప్రత్యేక వ్యక్తిగత ప్రమాద బీమా కొనుగోలు చేయడమే ఉత్తమం.
వ్యక్తిగత ప్రమాద బీమా వర్తించని సందర్భాలు:
-
బీమాదారు గర్భవతిగా లేదా బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు కలిగే ప్రమాదాలకు
-
ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు
-
ఎయిడ్స్ లాంటి సుఖవ్యాధులు వచ్చినప్పుడు
-
తీవ్ర అస్వస్థతకు గురయినప్పుడు
-
మద్యం, మాదకద్రవ్యాల సేవనంతో కలిగే రోడ్డు ప్రమాదాలకు
-
ఏదైనా నేరాలకు పాల్పడినప్పుడు కలిగే ప్రమాదాలకు
-
సాహసోపేతమైన క్రీడల్లో పాల్గొన్నప్పుడు అనుకోకుండా జరిగే ప్రమాదాలకు
-
ఆర్మీ విధుల్లో ఉన్న సాయుధ దళానికి చెందినవారికి
-
అణు ధార్మిక రేడియేషన్ ద్వారా కలిగే అనర్థాలకు
-
యుద్ధం, యుద్ధంలాంటి పరిస్థితులు ఏర్పడి వ్యక్తిగతంగా కలిగే నష్టాలకు బీమా కంపెనీలు సాధారణంగా క్లెయిం సొమ్మును చెల్లించవు.
క్లెయిం చేసుకునేందుకు అవసరమైనవి:
-
పాలసీ సంఖ్య, ప్రమాదం జరిగిన తేదీ, పాలసీ కాపీ
-
పూర్తి వివరాలతో నింపిన క్లెయిం ఫారం
-
ఒరిజినల్ బిల్లులు, చెల్లింపు రశీదులు
-
డాక్టర్ ప్రిస్కిప్షన్ సూచించిన ఎక్స్‌రే రిపోర్టులు
-
ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్.ఐ.ఆర్)
-
పోస్ట్‌మార్టమ్ నివేదిక
-
వైద్యుడు ధ్రువీకరించిన పత్రాలు
-
పూర్తిగా కోలుకున్నట్టు వైద్యుడి నుంచి ధ్రువీకరణ పత్రాలు
-
ఉద్యోగం చేస్తున్నట్టు ఆధారం
-
పంచనామా
-
మరణ ధ్రువీకరణ పత్రం
-
లీవ్ సర్టిఫికెట్
బీమా కంపెనీలు ఇంకా ఏదైనా అవసరమైన పత్రాలు అడిగితే వాటిని సమర్పించాలి.
బీమా పొందేందుకు అర్హులైనవారు:
అయిదేళ్ల చిన్నారుల నుంచి 70ఏళ్ల వృద్ధుల వరకూ ఈ బీమాను పొందేందుకు అవకాశం ఉంది.
కుటుంబమంతటికీ:
సంపాదించే వ్యక్తి అయి ఉంటే జీవితభాగస్వామ్యుల్లో ఎవరో ఒకరు లేదా ఇద్దరూ 100శాతం బీమా హామీ సొమ్ము పొందేందుకు అర్హులవుతారు.
బీమా రంగంలో సరళీకృత విధానాలు:
-
బీమా రంగంలో సరళీకృత విధానాలు ప్రవేశపెట్టడంతో వ్యక్తిగత ప్రమాద బీమాలో చాలా మంచి మార్పులే వచ్చాయి.
-
వార్షికాదాయానికి 10రెట్లకు బీమా చేయించుకునే అవకాశం కల్పించారు.
-
కొన్ని బీమా సంస్థలు శాశ్వత పూర్తి వైకల్యానికి 150శాతం దాకా బీమా హామీ సొమ్మును అందజేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్